నవరత్నాలతో సుస్థిర అభివృద్ధి : ఎమ్మెల్యే మల్లాది విష్ణు

-58వ డివిజన్ 252 వ వార్డు సచివాలయ పరిధిలో గడప గడపకు మన ప్రభుత్వం

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
నవరత్నాలకు ధీటైన సంక్షేమ పథకాలు దేశంలోని ఏ రాష్ట్రంలోనూ అమలు కావడం లేదని ఎమ్మెల్యే మల్లాది విష్ణు పేర్కొన్నారు. శుక్రవారం 58 వ డివిజన్ 252 వ వార్డు సచివాలయ పరిధిలో నగర డిప్యూటీ మేయర్ అవుతు శ్రీ శైలజారెడ్డితో కలిసి గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం నిర్వహించారు. కృష్ణ హోటల్ సెంటర్ నుంచి దాబాకొట్ల సెంటర్ మీదుగా వైఎస్సార్ కాలనీ వరకు విస్తృతంగా పర్యటించి ప్రజల యోగ క్షేమాలను అడిగి తెలుసుకున్నారు. 160 గడపలను సందర్శించి ప్రజల నుంచి గ్రీవెన్స్ స్వీకరించారు. ఎమ్మెల్యే సహా నాయకులు, అధికారులు తమ ఇంటికి వచ్చి సమస్యల గురించి అడుగుతుండటంతో ప్రజలు ఎంతో సంతోషం వ్యక్తం చేశారు. చెప్పిన సమస్యల్ని పరిష్కరించేందుకు అక్కడికక్కడే చర్యలు తీసుకోవడం కూడా వారికి మరింత సంతృప్తినిచ్చింది. వైఎస్సార్ సీపీ పాలనలో మూడేళ్లుగా సంక్షేమ పథకాల ద్వారా తాము పొందిన లబ్ధిని వివరిస్తూ.. అర్హతే ప్రామాణికంగా కలిగిన మేలు గురించి చెప్పడంతో ప్రజలందరూ ఆనందం వ్యక్తం చేశారు.

వైఎస్సార్ చేయూతతో మహిళల ఆర్థికాభ్యున్నతి
రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న వైఎస్సార్ చేయూత పథకం మహిళలకు గొప్ప భరోసానిస్తోందని ఎమ్మెల్యే మల్లాది విష్ణు అన్నారు. పర్యటనలో భాగంగా పొదుపు సంఘాల మహిళలతో ఆయన ప్రత్యేకంగా సమావేశమయ్యారు. చేయూత పథకం ద్వారా జగనన్న ప్రభుత్వం 45 ఏళ్ల నుంచి 60 ఏళ్ల ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ మహిళలకు ఆర్థిక భరోసానందిస్తూ.. ప్రతి ఏటా రూ.18,750 చొప్పున నేరుగా అక్కచెల్లెమ్మల అకౌంట్‌ లలో నగదు జమ చేయడం జరుగుతుందన్నారు. సెంట్రల్ నియోజకవర్గానికి సంబంధించి ఈ పథకం ద్వారా 2020-21 ఆర్థిక సంవత్సరంలో 6,034 మంది ఆడపడుచులకి రూ. 11.31 కోట్లు.. 2021-22 ఏడాదిలో 6,232 మంది ఖాతాలలో రూ. 11.68 కోట్లు జమ చేసినట్లు తెలిపారు. మొత్తంగా రూ. 22.99 కోట్లు అక్కచెల్లెమ్మలకు లబ్ధి చేకూర్చినట్లు వెల్లడించారు. సెప్టెంబర్ మాసంలో మూడో విడత నిధులు విడుదల చేయనున్న నేపథ్యంలో ఇప్పటినుంచే అధికారులు, సచివాలయ సిబ్బంది సన్నద్ధంగా ఉండాలని మల్లాది విష్ణు సూచించారు. నెలాఖరుకల్లా కుల, ఆదాయ ధ్రువీకరణ పత్రాల జారీ ప్రక్రియను పూర్తిచేయాలని రెవెన్యూ సిబ్బందిని ఆదేశించారు. అనంతరం మీడియాతో మాట్లాడారు.

కుప్పంలో చంద్రబాబు ఓటమి తథ్యం
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఇప్పటికీ తానే ముఖ్యమంత్రి అనే భ్రమలో చంద్రబాబు ఉన్నారని ఎమ్మెల్యే మల్లాది విష్ణు విమర్శించారు. 40 ఏళ్ళు అనుభవం ఉందని చెప్పుకునే చంద్రబాబునాయుడు.. ప్రజలపై దౌర్జన్యం చేస్తూ, తన సభల్లో విధ్వంసకరమైన సంఘటనలకు దారి తీసే విధంగా యువతను రెచ్చగొడుతున్నారని ఆరోపించారు. చంద్రబాబు సమక్షంలోనే ఆ పార్టీ నేతలు దాడులకు పాల్పడటం, మహానేత వైఎస్సార్ విగ్రహాన్ని కూల్చడం, వైఎస్సార్ సీపీ బ్యానర్లను చించి వేయడం బాధాకరమన్నారు. కుప్పం నియోజకవర్గానికి 30 ఏళ్లు ప్రాతినిథ్యం వహించిన చంద్రబాబు.. కనీసం కుప్పాన్ని రెవెన్యూ డివిజన్ చేసుకోలేకపోయారని విమర్శించారు. వైఎస్‌ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత నిజమైన అభివృద్ధి, సంక్షేమం ఎలా ఉంటుందో తొలిసారి కుప్పం ప్రజలకి రుచి చూపారన్నారు. చంద్రబాబు హయాంలో కన్నా ఈ మూడేళ్లలో కుప్పానికి వైఎస్సార్ సీపీ ప్రభుత్వం అధిక మేలు చేసిందని వెల్లడించారు. కుప్పం మున్సిపాలిటీకి రూ.65 కోట్ల విలువైన పనులు మంజూరు చేసినట్లు వివరించారు. ఇప్పటికే ఎంపీటీసీ ఎన్నికల్లో 65 స్థానాలకు 63 చోట్ల, కుప్పం మున్సిపాలిటీ కూడా వైఎస్సార్ సీపీ క్లీన్‌ స్వీప్‌ చేసిందని గుర్తుచేశారు. వచ్చే సార్వత్రిక ఎన్నికలలో 175 అసెంబ్లీ స్థానాలలో వైఎస్సార్ సీపీ గెలుపు కుప్పం నియోజకవర్గం నుంచే మొదలవుతుందని ధీమా వ్యక్తం చేశారు. మరోవైపు చవితి వేడుకలను కూడా తెలుగుదేశం పార్టీ రాజకీయం చేయాలని చూడటం సిగ్గుచేటని మల్లాది విష్ణు అన్నారు. పండుగపై ఎక్కడా రాష్ట్ర ప్రభుత్వం, వీఎంసీ ఆంక్షలు విధించలేదని.. మండపాల కోసం దరఖాస్తు చేసుకున్న వారికి పర్మిషన్ ఇవ్వడం జరుగుతుందని తెలియజేశారు. కార్యక్రమంలో జోనల్ కమిషనర్(ఇంఛార్జి) అంబేద్కర్, డీఈ రామకృష్ణ, ఏఎంహెచ్ఓ రామకోటేశ్వరరావు, వైసీపీ నాయకులు అవుతు శ్రీనివాసరెడ్డి, అఫ్రోజ్, నేరెళ్ల శివ, తోపుల వరలక్ష్మి, బొందిలి శైలజా, భోగాది మురళి, గుండె సుందర్ పాల్, మానం వెంకటేశ్వరరావు, మేడేపల్లి ఝాన్సీరాణి, ఇతర నాయకులు, అన్ని శాఖల అధికారులు, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ప్రతి నెలా చేనేత ఎగ్జిబిషన్లు ఏర్పాటు

-మంత్రి సవిత వెల్లడి -నికె హ్యాండ్లూమ్ మార్కెటింగ్ ఎక్స్ పో 2024-25 ను ప్రారంభించిన మంత్రి -నేతన్నలకు 365 రోజులు …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *