నందిగామ సమగ్ర అభివృద్ధే నూతన పాలకవర్గం ప్రధాన లక్ష్యం – ఎంపీ కేశినేని చిన్ని

-నందిగామ మున్సిపల్ నూతన పాలకవర్గం ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకోవాలి
-నందిగామను రాష్ట్రంలోనే ఆదర్శ మున్సిపాలిటీగా తీర్చిదిద్దేందుకు సంపూర్ణ సహకారం – ఎంపీ కేశినేని శివనాథ్ (చిన్ని)

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త:
ఎన్టీఆర్ జిల్లా (నందిగామ)నందిగామ మున్సిపల్ నూతన పాలకవర్గ ప్రమాణ స్వీకార కార్యక్రమం, అభినందన సభకు విజయవాడ పార్లమెంట్ సభ్యులు కేశినేని శివనాథ్ (చిన్ని) ఎమ్మెల్యే సౌమ్య తో కలిసి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా నూతనంగా మున్సిపల్ చైర్‌పర్సన్‌గా ఎన్నికైన శాఖమూరి వంశీధర్, వైస్ చైర్‌పర్సన్‌గా ఎన్నికైన తొర్లికొండ సీతారామయ్యతో పాటు నూతన కౌన్సిలర్లందరికీ హృదయపూర్వక అభినందనలు, శుభాకాంక్షలు తెలిపారు.

ఈ సందర్భంగా ఎంపీ కేశినేని చిన్ని మాట్లాడుతూ.. ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య నాయకత్వంలో, కూటమి నాయకులు, కార్యకర్తల సమష్టి కృషితో నందిగామ మున్సిపాలిటీలో చారిత్రాత్మక విజయాన్ని సాధించామని అన్నారు. నందిగామ చరిత్రలో సరికొత్త రికార్డు సృష్టించేలా ప్రజలు కూటమికి అఖండ విజయాన్ని అందించారని, ప్రజలు తమపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకోవాల్సిన బాధ్యత నూతన పాలకవర్గంపై ఉందని స్పష్టం చేశారు.గత ప్రభుత్వ హయాంలో నిర్లక్ష్యానికి గురైన నందిగామ మున్సిపాలిటీని అభివృద్ధి పథంలో నడిపించడమే నూతన పాలకవర్గం ప్రధాన కర్తవ్యమని పేర్కొన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచే నందిగామ అభివృద్ధికి ప్రత్యేక ప్రాధాన్యతనిస్తూ, మౌలిక సదుపాయాల కల్పనకు చర్యలు చేపడుతున్నామని తెలిపారు.నందిగామ ప్రభుత్వ ఆసుపత్రి అభివృద్ధికి ప్రత్యేక ప్రాధాన్యతనిస్తామని, ప్రతి ఇంటికీ సురక్షితమైన తాగునీరు అందించడంతో పాటు రహదారులు, పారిశుధ్యం, ఇతర మౌలిక సదుపాయాలను మెరుగుపరుస్తామని హామీ ఇచ్చారు. పట్టణ ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను గుర్తించి, వాటి పరిష్కారానికి ప్రాధాన్యతనిస్తూ మెరుగైన పౌర సేవలు అందించాలని నూతన పాలకవర్గానికి సూచించారు.కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం, రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం, స్థానికంగా కూటమి పాలకవర్గం ఏర్పడటంతో ట్రిపుల్ ఇంజిన్ తరహా సమన్వయ పాలనకు అవకాశం ఏర్పడిందన్నారు. కేంద్ర, రాష్ట్ర, స్థానిక ప్రభుత్వాల మధ్య సమన్వయంతో నందిగామ అభివృద్ధిని మరింత వేగవంతం చేస్తామని తెలిపారు.అమరావతి, విజయవాడ నగరాలకు సమీపంలో ఉన్న నందిగామకు అపారమైన అభివృద్ధి అవకాశాలు ఉన్నాయని, వాటిని సద్వినియోగం చేసుకుని పట్టణాన్ని అభివృద్ధిలో అగ్రస్థానంలో నిలపాలని ఆకాంక్షించారు. నూతనంగా ఎన్నికైన కౌన్సిలర్లు రాజకీయాలకు, వర్గాలకు అతీతంగా ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని, ప్రజలకు నిరంతరం అందుబాటులో ఉంటూ వారి ఆకాంక్షలకు అనుగుణంగా పనిచేయాలని సూచించారు.నూతన కౌన్సిలర్లలో యువత అధిక సంఖ్యలో ఉండటం సంతోషకరమని పేర్కొంటూ, మంత్రి నారా లోకేష్ ప్రోత్సహిస్తున్న యువ నాయకత్వ స్ఫూర్తితో యువత అభివృద్ధి కార్యక్రమాల్లో చురుగ్గా భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.

యువత ఉత్సాహానికి సీనియర్ నాయకుల అనుభవం తోడైతే నందిగామ అభివృద్ధికి మరింత బలమైన పునాది ఏర్పడుతుందని అన్నారు.కూటమి ఐక్యత, ధర్మానికి అత్యంత ప్రాధాన్యతనిస్తూ బీజేపీకి వైస్ చైర్మన్ పదవిని కేటాయించామని, కూటమి భాగస్వామ్య పార్టీలన్నింటినీ కలుపుకుని ముందుకు సాగడమే తమ విధానమని స్పష్టం చేశారు. పార్టీ విజయానికి కృషి చేసిన ప్రతి నాయకుడికి, కార్యకర్తకు సముచిత గుర్తింపు, గౌరవం కల్పిస్తామని, పార్టీ కోసం పనిచేసిన వారి సేవలను ఎప్పటికీ విస్మరించబోమని భరోసా ఇచ్చారు. ఎంపీటీసీ, జెడ్పీటీసీ తదితర స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి ఘన విజయాలు సాధించిందని, రాబోయే పంచాయతీ ఎన్నికల్లోనూ ఇదే విజయపరంపరను కొనసాగించాలని పిలుపునిచ్చారు. 98 శాతం స్ట్రైక్ రేట్ లక్ష్యంగా గ్రామస్థాయి నుంచి కూటమిని మరింత బలోపేతం చేసేందుకు నాయకులు, కార్యకర్తలు సమన్వయంతో, ఐక్యంగా పనిచేయాలని సూచించారు. ప్రజలు అప్పగించిన పదవులు అధికారానికి చిహ్నాలు కావని, ప్రజలకు సేవ చేసే బాధ్యతకు ప్రతిరూపాలని ఎంపీ కేశినేని చిన్ని పేర్కొన్నారు. ప్రతి ప్రజాప్రతినిధి ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పనిచేస్తూ, ప్రజా సమస్యల పరిష్కారమే ధ్యేయంగా ముందుకు సాగాలని అన్నారు.నందిగామ మున్సిపాలిటీని రాష్ట్రంలోనే ఆదర్శ మున్సిపాలిటీగా తీర్చిదిద్దేందుకు ఎంపీగా తన వంతు సంపూర్ణ సహకారం అందిస్తానని హామీ ఇచ్చారు. నూతన పాలకవర్గం సమష్టి కృషి, ప్రజాప్రతినిధుల నాయకత్వం, పార్టీ నాయకులు, కార్యకర్తల సమన్వయంతో నందిగామ సమగ్ర అభివృద్ధిని సాధించాలని ఆకాంక్షించారు.“పదవుల కోసం కాదు.. ప్రజల కోసం పనిచేద్దాం. రాజకీయాలకు అతీతంగా నందిగామ అభివృద్ధే మనందరి లక్ష్యం కావాలి. కూటమి ఐక్యతతో నందిగామను అభివృద్ధిలో అగ్రస్థానంలో నిలుపుదాం” అని ఎంపీ కేశినేని శివనాథ్ (చిన్ని) పిలుపునిచ్చారు.