గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త :
గుంటూరు నగరంలో పారిశుధ్య పనులు ఆశించిన స్థాయిలో జరగడంలేదని, ఇక నుండి సచివాలయాల వారీగా పారిశుధ్య నిర్వహణలో నిర్లక్ష్యంగా ఉండే శానిటేషన్ కార్యదర్శులు, ఇన్సెపెక్టర్ల పై చర్యలు తీసుకుంటామని నగర కమిషనర్ శ్రీమతి కీర్తి చేకూరి ఐఏయస్ గారు స్పష్టం చేశారు. శుక్రవారం నగరపాలక సంస్థ కౌన్సిల్ సమావేశ మందిరంలో సచివాలయాల శానిటేషన్ కార్యదర్శులతో, నగరపాలక సంస్థ ప్రజారోగ్య విభాగ అధికారులతో కమిషనర్ గారు నగరంలో పారిశుధ్య పనులు, ఇంటింటి చెత్త సేకరణ, సర్వీస్ రిక్వస్ట్ లు, ట్రేడ్ లైసెన్స్ లపై సమీక్షా సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా కమిషనర్ గారు మాట్లాడుతూ నగరంలో పారిశుద్యం మెరుగ్గా జరగాలని, ఇంటింటి చెత్త సేకరణ నూరు శాతం జరగాలన్నారు. స్కానర్ల ద్వారా ప్రతి ఇంటికి ఏర్పాటు చేసిన కోడ్ ని స్కాన్ చేయాలని, స్కానర్స్ రిపేరు వారం రోజుల్లో పూర్తీ చేయాలని ఏజన్సీ ప్రతినిధులను ఆదేశించారు. కార్యదర్శులు ప్రజలకు రోడ్ల మీద, కాల్వల్లో చెత్త వేయవద్దని, నిర్దేశిత సమయంలో కార్మికులు ఇంటి వద్దకే వచ్చి వ్యర్ధాలు సేకరణ చేస్తారని తెలియ చేయాలన్నారు. డిప్యూటీ కమిషనర్, సి.ఎం.ఓ.హెచ్.లు ప్రతి రోజు కొన్ని వార్డ్ ల్లో ఆకస్మిక తనిఖీలు చేసి, పారిశుధ్య మెరుగుకు చర్యలు తీసుకోవాలని, క్షేత్ర స్థాయిలో నిర్లక్ష్యంగా ఉండే వారి పై చర్యలకు సిఫార్స్ చేయాలని ఆదేశించారు. సచివాలయ పరిధిలో పక్కాగా పారిశుధ్య పనులు జరిగేలా, ఇంటింటి చెత్త సేకరణ, ప్రధాన రహదార్ల స్వీపింగ్లకు కార్మికుల కేటాయింపు జరగాలన్నారు. వీధి వ్యాపారుల నుండి చెత్త సేకరణకు నిర్దేశిత సమయం కేటాయించాలన్నారు. ఎస్ఎస్ లు పర్యవేక్షణ మరింత మెరుగుపడాలన్నారు. నగరంలో ఎక్కడైనా రోడ్ల మీద చెత్త వేస్తె అపరాధ రుసుం విధించాలని, షాప్స్ వారు వేస్తె సీజ్ చేయాలని స్పష్టం చేశారు. మధ్యాహ్న సమయంలో గ్యాంగ్ వర్క్ ద్వారా సమస్యాత్మక ప్రాంతాల్లో సమగ్ర పారిశుధ్య పనులు, డ్రైన్ల శుభ్రం చేయాలన్నారు. ట్రేడ్ లైసెన్స్ లు లేని వ్యాపార వాణిజ్య సంస్థలను సీజ్ చేయాలన్నారు. సచివాలయం పరిధిలో ప్రజల నుండి అందే ఫిర్యాదులు నిర్దేశిత గడువులోగా పరిష్కరించాలన్నారు. చెత్త తరలింపుకు డివిజన్ల వారీగా వాహనాలను కూడా క్రమ పద్దతిలో వెహికిల్ షెడ్ నుండి పంపాలని ఈ.ఈ.ని ఆదేశించారు. చెత్త తరలింపు వాహనాలకు ఏర్పాటు చేసిన జి.పి.ఎస్. డాష్ బోర్డ్ నివేదిక ప్రతి రోజు ఇవ్వాలన్నారు.
సమావేశంలో డిప్యూటీ కమిషనర్ టి.వెంకట కృష్ణయ్య, సి.ఎం.ఓ.హెచ్. డాక్టర్ విజయలక్ష్మీ, ఈ.ఈ. కొండారెడ్డి, డి.ఈ.ఈ. హనీఫ్, బయాలజిస్ట్ మధుసూదన్ రావు, యస్.యస్.లు రాంబాబు, ఆనందకుమార్, శానిటరీ ఇన్స్పెక్టర్ లు, కార్యదర్శులు పాల్గొన్నారు.
Tags guntur
Check Also
6.60 కోట్లతో నిర్మించనున్న జి.టి.యస్ పనులకు శంకుస్థాపన
గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : గుంటూరు నగరంలో శాస్తీయ పద్దతిలో వ్యర్దాల నిర్వహణకు జి.టి.యస్ (గార్బేజ్ ట్రాన్స్ఫర్ సిస్టం) …