బాలల సంరక్షణ కేంద్రాల్లో జిల్లా స్థాయి కమిటీ తనిఖీలు

-బాలలకు మెరుగైన వసతులు, నాణ్యమైన ఆహారం, వైద్య సేవలు అందించాలి
-దత్తత ప్రక్రియను వేగవంతం చేయాలి
-జాయింట్ కలెక్టర్ ఎస్. ఇలక్కియ

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త:
ఎన్టీఆర్ జిల్లాలోని బాలల సంరక్షణ కేంద్రాల్లో బాలలకు మెరుగైన వసతులు, నాణ్యమైన ఆహారం, వైద్య సేవలు అందించాలని జాయింట్ కలెక్టర్, జిల్లా స్థాయి కమిటీ చైర్మన్ ఎస్.ఇలక్కియ ఆదేశించారు.

విజయవాడలోని కృష్ణలంక, విశాలాంధ్ర రోడ్, గవర్నర్‌పేట గోపాలరెడ్డి నగర్ ప్రాంతాల్లో ఉన్న ప్రజ్వల బాలికల హోమ్, శిశు గృహం, బాలసదనాలను జిల్లా స్థాయి కమిటీ సభ్యులతో కలిసి మంగళవారం తనిఖీ చేశారు. శిశు గృహంలో చిన్నారులకు అందిస్తున్న వైద్యం, ఆహారం, ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. అవసరమైన మందులు అందుబాటులో ఉంచాలని, వైద్యుల సూచనల మేరకు మందులు వినియోగించాలని, దత్తత ప్రక్రియను వేగవంతం చేయాలని ఆదేశించారు. బాలసదనంలో బాలికల విద్య, పాఠశాలకు వెళ్లే విధానం గురించి వివరాలు తెలుసుకున్నారు. బాలలకు దుస్తులు, స్టడీ మెటీరియల్, ఆట వస్తువులు క్రమం తప్పకుండా అందించాలని సూచించారు. మెనూ ప్రకారం ఆకుకూరలు, కూరగాయలు, ప్రోటీన్లు కలిగిన పోషకాహారం అందించాలని, కిచెన్, స్టోర్ రూమ్‌లు, మరుగుదొడ్లు పరిశుభ్రంగా ఉంచాలని ఆదేశించారు. జువైనల్ జస్టిస్ చట్ట నిబంధనల ప్రకారం రిజిస్టర్లను సక్రమంగా నిర్వహించాలని, బాలలు ఆటలు ఆడుకునేందుకు అవసరమైన స్థలం కల్పించాలని సూచించారు. బాలలతో ముఖాముఖి మాట్లాడి వారి సదుపాయాలను తెలుసుకున్నారు. క్రమం తప్పకుండా పాఠశాలకు వెళ్లి బాగా చదువుకుని ఉన్నత శిఖరాలను చేరుకోవాలని బాలికలను ప్రోత్సహించారు.

ఈ కార్యక్రమంలో జిల్లా మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ అధికారి సుల్తానాబేగం, డీసీపీవో ఎం.రాజేశ్వరరావు, జువైనల్ జస్టిస్ సభ్యురాలు బి.పుష్పలత, డా.అమితా, డా. సురేష్, ప్రభాకర్, దుర్గ ప్రసాద్, తదితరులు పాల్గొన్నారు.