ప్రజల ముంగిటకే నాణ్యమైన బియ్యం..

– ధరణి బియ్యం మొబైల్ వాహ‌నాన్ని ప్రారంభించిన జేసీ ఇల‌క్కియ‌
– బహిరంగ మార్కెట్లో బియ్యం ధరల భారాన్ని తగ్గించేందుకు ప్రభుత్వ చర్యలు

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త:
ప్రజలకు నాణ్యమైన బియ్యాన్ని అందుబాటు ధరల్లో వారి ముంగిటకే చేర్చాలనే లక్ష్యంతో ప్రభుత్వం చేపట్టిన ధరణి బియ్యం పంపిణీ కార్యక్రమంలో భాగంగా విజయవాడ నగర పరిధిలో మొబైల్ వాహన సేవలను ప్రారంభించినట్లు జాయింట్ కలెక్టర్ ఎస్‌.ఇల‌క్కియ తెలిపారు. మంగళవారం కలెక్టరేట్ ప్రాంగణంలో ఆమె ధరణి బియ్యం మొబైల్ వాహనాన్ని ప్రారంభించారు.
ఇటీవల బహిరంగ మార్కెట్లో బియ్యం ధరలు పెరిగిన నేపథ్యంలో వినియోగదారులపై ధరల భారాన్ని తగ్గించేందుకు ప్రభుత్వం మార్కెట్ జోక్యం కార్యక్రమంలో భాగంగా ధరణి బియ్యం పంపిణీకి శ్రీకారం చుట్టింది. ఇప్పటికే జిల్లాలోని 14 రైతు బజార్లతో పాటు రైతు బజార్లు లేని మండల కేంద్రాల్లో ఏర్పాటు చేసిన 8 అదనపు విక్రయ కేంద్రాల ద్వారా నాణ్యమైన కేఎన్ఎం (KNM), బీపీటీ (BPT) రకాల బియ్యాన్ని ‘ధరణి బియ్యం’ పేరుతో ప్రజలకు అందుబాటులో ఉంచింది. ఈ కార్యక్రమాన్ని మరింత విస్తరిస్తూ ప్రజలు విక్రయ కేంద్రాలకు వెళ్లాల్సిన అవసరం లేకుండా నేరుగా వారి నివాస ప్రాంతాల వద్దకే బియ్యాన్ని చేరవేసేందుకు మొబైల్ వాహన సేవలను ప్రారంభించినట్లు జాయింట్ క‌లెక్ట‌ర్ తెలిపారు. ఒక్కో కుటుంబానికి నెలకు ఒక సంచి చొప్పున 26 కిలోల బరువున్న ముద్రిత సంచుల్లో ఈ బియ్యాన్ని విక్రయించనున్నట్లు పేర్కొన్నారు. మరికొద్ది రోజుల్లో ఈ మొబైల్ వాహన సేవలను జిల్లా వ్యాప్తంగా విస్తరించనున్నట్లు తెలిపారు. ప్రజలందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు. అదేవిధంగా సెంట్ర‌ల్ బ్యాంకు డిజిట‌ల్ క‌రెన్సీలో భాగంగా ప్ర‌తికార్డుదారుడు త‌న ఆధార్ నెంబ‌రుకు లింక్ అయిన మొబైల్ నంబ‌రును సీబీడీసీ మొబైల్ యాప్ ద్వారా అప్‌డేట్ చేయించుకోవాల‌ని.. రేష‌న్ డీల‌ర్ల‌కు నంబ‌రు అందిస్తే వారే అప్‌డేట్ చేస్తార‌న్నారు. అదే విధంగా ఈ-కేవైసీ పెండింగ్ ఉన్న కార్డుదారులు అది కూడా త‌ప్ప‌నిస‌రిగ చేయించుకోవాల‌ని జేసీ ఇల‌క్కియ సూచించారు. కార్య‌క్ర‌మంలో డీఎస్‌వో పి.వాణి, ఏఎస్‌వో శ్రీనివాస్ త‌దిత‌రులు పాల్గొన్నారు.