గొల్లపూడి, నేటి పత్రిక ప్రజావార్త:
గ్రామ అభివృద్ధికి తన వంతు కృషి చేసేందుకు రాజకీయాల్లోకి అడుగుపెట్టినట్లు గొల్లపూడి కూటమి సర్పంచ్ అభ్యర్థి బొమ్మసాని జయంత్ సాయి తెలిపారు. గ్రామ పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో మంగళవారం ఆయన వార్డు సభ్యుల అభ్యర్థులు, స్థానిక నాయకులు, కార్యకర్తలతో కలిసి విస్తృతంగా ప్రచారం నిర్వహించారు. గ్రామంలోని వివిధ ప్రాంతాల్లో ఇంటింటికీ వెళ్లి ప్రజలను కలుసుకున్నారు. ఈ నెల 26న జరగనున్న ఎన్నికల్లో తనకు, తన బృందంలోని వార్డు సభ్యుల అభ్యర్థులకు ఓటు వేసి ఆదరించాలని విజ్ఞప్తి చేశారు. ప్రచారంలో భాగంగా స్థానికుల సమస్యలను తెలుసుకుంటూ, గ్రామ అభివృద్ధికి కృషి చేస్తానని భరోసా ఇచ్చారు.
ఈ సందర్భంగా జయంత్ సాయి మాట్లాడుతూ, తన తాత బొమ్మసాని కృష్ణమూర్తి, తండ్రి బొమ్మసాని సుబ్బారావు గ్రామ ప్రజలతో మమేకమై అభివృద్ధి కార్యక్రమాల్లో కీలక పాత్ర పోషించారని గుర్తుచేశారు. వారు సంపాదించిన ప్రజాభిమానాన్ని నిలబెట్టుకోవడంతో పాటు, వారి అడుగుజాడల్లో నడుస్తూ గ్రామ సేవకు అంకితమవుతానని పేర్కొన్నారు.
సర్పంచ్‌గా అవకాశం కల్పిస్తే గ్రామంలో మౌలిక వసతుల అభివృద్ధి, ప్రజలకు అవసరమైన సౌకర్యాల కల్పనకు ప్రాధాన్యత ఇస్తానని తెలిపారు. ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ అందరినీ కలుపుకొని గ్రామ ప్రగతికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఎన్నికల్లో తనకు కేటాయించిన కత్తెర గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని కోరారు. అలాగే తనతో పాటు పోటీ చేస్తున్న వార్డు సభ్యుల అభ్యర్థులకు కూడా మద్దతు తెలిపి విజయాన్ని అందించాలని గ్రామ ఓటర్లను అభ్యర్థించారు. ప్రజల ఆశీస్సులు, సహకారంతో గ్రామాన్ని అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్లడమే తన లక్ష్యమని జయంత్ సాయి తెలిపారు.
ఈ ప్రచార కార్యక్రమంలో కూటమి నాయకులు, కార్యకర్తలు, వార్డు సభ్యుల అభ్యర్థులు, స్థానికులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
గ్రామాభివృద్ధే లక్ష్యం.. ప్రజల ఆశీస్సులే బలం : బొమ్మసాని జయంత్ సాయి
