-నిబంధనల ఉల్లంఘనలపై వ్యాపార సంస్థలకు నోటీసులు
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త:
విజయవాడ నగరంలో ప్రజారోగ్య పరిరక్షణ, పారిశుధ్య ప్రమాణాల అమలుపై ప్రత్యేక దృష్టి సారిస్తూ నగరపాలక సంస్థ ప్రజారోగ్య శాఖ ఆధ్వర్యంలో సర్కిల్-1 పరిధిలోని 53, 54 డివిజన్లలో మంగళవారం విస్తృతస్థాయిలో తనిఖీలు నిర్వహించారు.
నగరపాలక సంస్థ ఇంచార్జ్ కమిషనర్ ఏ రవీంద్రరావు ఆదేశాల మేరకు సర్కిల్-1 శానిటరీ సూపర్వైజర్లు సోమరాజు, ఎస్.వి.ఎస్. శ్రీధర్ మార్గనిర్దేశంలో సంబంధిత శానిటరీ ఇన్స్పెక్టర్లు, సచివాలయ సిబ్బంది తనిఖీల్లో పాల్గొన్నారు.
తనిఖీల్లో భాగంగా వ్యాపార సంస్థలు, పరిసర ప్రాంతాల్లో ప్రజారోగ్యానికి సంబంధించిన అంశాలను క్షుణ్ణంగా పరిశీలించారు. ముఖ్యంగా తాగునీటి నాణ్యత, పరిసరాల పరిశుభ్రత, ఆహార పదార్థాల నాణ్యత, వ్యర్థాల సక్రమ నిర్వహణతో పాటు పారిశుధ్య ప్రమాణాల అమలును తనిఖీ చేశారు. ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ కార్పొరేషన్స్ చట్టంలోని నిబంధనలకు అనుగుణంగా ఆయా సంస్థల నిర్వహణ తీరును పరిశీలించారు.
ఈ క్రమంలో నిబంధనల ప్రకారం నిర్వహణ లేని వ్యాపార సంస్థలను గుర్తించి, సంబంధిత లోపాలను వెంటనే సరిదిద్దుకోవాలని సూచిస్తూ నోటీసులు జారీ చేశారు. నిర్దేశించిన గడువులోగా లోపాలను సరిచేయని సంస్థలపై చట్టప్రకారం తదుపరి చర్యలు తీసుకుంటామని అధికారులు స్పష్టం చేశారు. నగర ప్రజలకు ఆరోగ్యకరమైన వాతావరణం కల్పించడంతో పాటు ప్రజారోగ్య ప్రమాణాల అమలును నిరంతరం పర్యవేక్షించేందుకు నగరంలోని అన్ని ప్రాంతాల్లో తనిఖీలు కొనసాగుతాయని అధికారులు తెలిపారు.
