Breaking News

సంక్షేమ పథకాల్లో సంచార జాతుల వారికి ప్రాధాన్యత ఇవ్వాలి!!

మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త:
సంచార జాతులు, వెనుకబడిన కులాల వారికి ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాల్లో ప్రాధాన్యతనిచ్చి వారి అభివృద్ధికి కృషి చేయాలని జాతీయ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మానవహక్కుల కమిషన్‌ బోర్డు సభ్యులు తురక నర్సింహా కోరారు. శుక్రవారం కలెక్టరేట్‌ లోని స్పందన మీటింగ్ హాలులో కలెక్టర్‌తో కలిసి సంబంధిత జిల్లా అధికారులతో ప్రత్యేక సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కులాల వివక్షత, వివిధ ప్రజల మధ్య అంతరాలు మన సమాజంలో బలంగా వేళ్ళూనికిపోయాయని, డి-నోటిఫైడ్, సంచార, ఉప‌-సంచార తెగల వారి నిమిత్తం కేంద్ర ప్ర‌భుత్వం జాతీయ కమిషన్‌ను (ఎన్‌సీడీఎన్‌టీ) ఏర్పాటు చేసిందన్నారు. మన రాష్ట్రంలో సంచార జాతులకు ప్రభుత్వం ప్రత్యేక బోర్డు, ప్రత్యేక బడ్జెట్‌ ప్రవేశపెట్టిందని తెలిపారు. విద్యా, వైద్యం, ఆర్థిక, సాంఘిక తదితర రంగాల్లో సంచార జాతులు ముందుకు వెళ్లడానికి ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. డి-నోటిఫైడ్, సంచార జాతులు, ఉప సంచార జాతుల గుర్తింపు ప్రక్రియను పూర్తి చేయడానికి నీతీ ఆయోగ్ ద్వారా ఒక కమిటీని ఏర్పాటు చేశారు. నితీ ఆయోగ్, ఆంత్రోపోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియాలో (ఏఎన్‌ఎస్‌ఐ) డీఎన్‌టీ కమ్యూనిటీలను గుర్తించి వాటిని ఎస్సీ ,ఎస్టీ , ఓబిసి విభాగంలో చేర్చే సర్వే పని సైతం జరుగుతోందన్నారు. ఈ సమాజం యొక్క సంక్షేమం కోసం “స్కీమ్ ఫర్ ఎకనామిక్ ఎంపవర్‌మెంట్ ఆఫ్ డీఎన్‌టీ కమ్యూనిటీస్ (ఎస్ఈఈడీ)”అనే ప్రత్యేక పథకాన్ని ఆమోదించిందని ఇది నాలుగు విభాగాలుగా ఉంటుందన్నారు. పోటీ పరీక్షలలో హాజరుకావడానికి డీఎన్‌టీ అభ్యర్థులకు మంచి నాణ్యత గల కోచింగ్ ఇవ్వడం, వారికి ఆరోగ్య బీమా అందించడం.సమాజ స్థాయిలో జీవనోపాధి చొరవను సులభతరం చేయడం ఈ వర్గాల సభ్యులకు ఇళ్ల నిర్మాణానికి ఆర్థిక సహాయం అందించడం తదితర విషయాల గూర్చి సంచార జాతుల అభివృద్ధికి తీసుకోవాల్సిన చర్యలపై ఆయన స్థానిక అధికారులకు అవగాహన కల్పించారు.
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకొస్తున్న సంక్షేమ పథకాలు అట్టడుగున ప్రజలకు అందేలా పటిష్టమైన చర్యలు అధికారులు తీసుకోవాలన్నారు. విద్య, వైద్యం, ఉపాధి అనేది పేదలకు అందితేనే దేశం మరింత అభివృద్ధి చెందుతుందని ఆయన చెప్పారు. గురజాడ అప్పారావు దేశమంటే మట్టి కాదోయో దేశమంటే మనుషులని అభివర్ణించారని చెప్పారు. అన్నమయ్య, పోతులూరి వీరబ్రహ్మం, వేమన లాంటి మహనీయులు మానవత్వం గురించి తెలియజేశారన్నారు. మన దేశం ప్రపంచానికి ఇచ్చిన సందేశం ‘ భిన్నత్వంలో ఏకత్వం ‘ అని సమానత్వం సౌబ్రాతత్వం మన భారత రాజ్యాంగంలో పొందుపర్చారని, స్వాతంత్ర్య ఫలాలు ప్రతి ఒక్కరికి అందాలని సూచించారు. కృష్ణాజిల్లా ఎందరో మహనీయులు జన్మించిన దివ్య గడ్డ అన్నారు. కేంద్ర ప్రభుత్వం సంచార జాతుల సంక్షేమం కోసం బోర్డును ఏర్పాటు చేయడంతో పాటు వారి స్థితిగతులను, జీవన అలవాట్లపై నివేదికకు చర్యలు తీసుకుంటుందన్నారు. సంచార జాతుల అభివద్ధికి తీసుకోవాల్సిన చర్యలపై ఆయన అధికారులకు అవగాహన కల్పించారు. సంచార జాతుల పిల్లలకు కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన నూతన విద్యా విధానం, సైన్స్‌, గణితం, రసాయన శాస్త్రం, సోషియల్‌ తదితర సబ్జెక్టులలో విద్యార్థులకు ఎలాంటి విద్యా బోధన ఉండాలి, ఎలా ఉంటే బాగుంటుంది, విద్యార్థులకు చక్కగా అర్థమయ్యేలా బోధన చేయాలన్నారు. ఆధునిక కవుల పేర్లను తెలియచేయమని, గుర్రం జాషువా కవితాశైలి వివరించాలని, దేశ బాష లందు తెలుగు ఎందుకు లెస్స అని కొందరు తెలుగు టీచర్లను ప్రశ్నించారు.. అలాగే, నీటి పిహెచ్ ఎలా కనుక్కోంటారని , మానవ రక్తం పిహెచ్ విలువ ఎంత అని సైన్స్ ఉపాధ్యాయులను తురక నరసింహ ప్రశ్నించారు..
అనంతరం కలెక్టర్‌ పి.రంజిత్ బాషా మాట్లాడుతూ, తనకు తెల్సినంతవరకు సంచార జాతుల స్థితిగతులపై సమీక్ష నిర్వహించడం ఇదే తొలిసారి అన్నారు. కృష్ణాజిల్లాలో వెనకబడినవర్గాల అభ్యున్నతికి అధికారులందరూ పాటుపడాలని పేర్కొన్నారు. సంచార జాతుల ప్రజల విద్యా, వైద్యం, ఆర్థిక, సాంఘిక తదితర రంగాల్లో ముందుకు వెళ్లడానికి జిల్లా యంత్రాంగం చేస్తోందన్నారు.
ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ మహేష్ కుమార్ రావిరాల, అడిషనల్ ఎస్పి వెంకట రామాంజనేయులు, డిఆర్‌ఒ ఎం. వెంకటేశ్వర్లు, ఆర్‌డిఒ ఐ. కిషోర్ , జిల్లా విద్యాశాఖ అధికారిణి తాహెరా సుల్తానా, ఆంద్రప్రదేశ్ రాష్ట్ర విముక్త సంచార జాతుల నాయకులు టి.రామారావు, డిఎస్పి మాసుం బాషా, మచిలీపట్నం ఎంపిడిఓ, డ్వామా ప్రాజెక్ట్ డైరెక్టర్ జీ.వి సూర్య నారాయణ, ఎస్సి, ఎస్టీ బీసీ వివిధ సంక్షేమ శాఖల జిల్లా అధికారులు, వివిధ ఉన్నత పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

గ్రామ, వార్డు సచివాలయాల్లో రేషనలైజేషన్

-మూడు కేటగిరీలుగా సచివాలయాల విభజన -కనీసం 2500 మందికి ఒక గ్రామ, వార్డు సచివాలయం -మల్టీపర్పస్ ఫంక్షనరీస్, టెక్నికల్ ఫంక్షనరీలుగా …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *