ఎన్‌సీడీ స్క్రీనింగ్‌లో మరో నాలుగు ఆరోగ్య పరీక్షలు

-ఇకపై తొమ్మిది రకాల వ్యాధుల గుర్తింపునకు ప్రత్యేక కార్యాచరణ
-750 ఐబ్రెస్ట్ పరికరాలతో 10 లక్షల మంది మహిళలకు రొమ్ము క్యాన్సర్ పరీక్షలు
-ఎఫ్‌ఆర్‌ఎస్ విధానంలో స్క్రీనింగ్ వివరాల నమోదు
-అధికారులను ఆదేశించిన వైద్యారోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త:
రాష్ట్ర ప్రజల ఆరోగ్య పరిరక్షణకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో కీలక ముందడుగు వేస్తోంది. అసంక్రమిత వ్యాధులను ప్రాథమిక దశలోనే గుర్తించి, బాధితులకు సకాలంలో వైద్య సేవలు అందించాలనే లక్ష్యంతో 2026–27 ఆర్థిక సంవత్సరంలో ఎన్‌సీడీ (నాన్ కమ్యూనికబుల్ డిసీజెస్) స్క్రీనింగ్ కార్యక్రమాన్ని మరింత విస్తరించనుంది. ఇప్పటివరకు ఐదు రకాల వ్యాధులకు నిర్వహిస్తున్న పరీక్షలకు అదనంగా మరో నాలుగు ఆరోగ్య సమస్యలను చేర్చడంతో మొత్తం తొమ్మిది రకాల పరీక్షలు నిర్వహించనున్నారు.
ఇప్పటివరకు అధిక రక్తపోటు, మధుమేహం, నోటి క్యాన్సర్, రొమ్ము క్యాన్సర్, గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ పరీక్షలు నిర్వహిస్తుండగా, తాజాగా ఊబకాయం, కొవ్వు కాలేయ వ్యాధి, దీర్ఘకాలిక శ్వాసకోశ సమస్యలు, మానసిక ఆరోగ్య సమస్యలను కూడా స్క్రీనింగ్ పరిధిలోకి తీసుకురానున్నారు. కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం 18 ఏళ్లు పైబడిన వారందరికీ ప్రతి ఆర్థిక సంవత్సరంలో ఈ పరీక్షలు నిర్వహించేందుకు వైద్యారోగ్య శాఖ ఏర్పాట్లు చేస్తోంది.
త్వరలో ప్రారంభం కానున్న స్క్రీనింగ్ కార్యక్రమంపై వైద్యారోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ అధికారులతో వర్చువల్ సమావేశం నిర్వహించి సమీక్షించారు. పరీక్షల నిర్వహణ, సాంకేతిక విధానాలు, క్షేత్రస్థాయి సిబ్బంది బాధ్యతలపై దిశానిర్దేశం చేశారు. గతంలో అమలు చేసిన ఓటీపీ విధానానికి బదులుగా ముఖ గుర్తింపు (ఎఫ్‌ఆర్‌ఎస్) ఆధారంగా లబ్ధిదారుల వివరాలను నమోదు చేయాలని ఆదేశించారు. ఆన్‌లైన్ వేదిక సిద్ధమైన వెంటనే పరీక్షలు ప్రారంభించేందుకు అధికారులు సన్నద్ధంగా ఉండాలని స్పష్టం చేశారు.
ఊబకాయం, కాలేయ వ్యాధులపై ప్రత్యేక దృష్టి
మారుతున్న జీవనశైలి, ఆహారపు అలవాట్ల కారణంగా పెరుగుతున్న ఊబకాయ సమస్యను ముందుగానే గుర్తించేందుకు ప్రత్యేక పరీక్షలు నిర్వహించనున్నారు. జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే గణాంకాల ప్రకారం అధిక బరువు, ఊబకాయం ఉన్న మహిళల శాతం 36.3 నుంచి 47.9 శాతానికి, పురుషుల్లో 31.3 నుంచి 41.5 శాతానికి పెరిగింది. అధిక బరువు ఉన్నవారిని గుర్తించి, వారి ఆరోగ్య పరిస్థితిని అంచనా వేయడంతో పాటు ఆహార నియమాలు, వ్యాయామం, బరువు నియంత్రణపై అవగాహన కల్పించనున్నారు.
ఊబకాయం, మధుమేహం, అధిక రక్తపోటు, థైరాయిడ్ సమస్యలు ఉన్నవారిలో కొవ్వు కాలేయ వ్యాధి ముప్పును కూడా పరిశీలిస్తారు. అవసరమైన వారికి వైద్యుల సలహాలు, చికిత్స అందించనున్నారు.
శ్వాసకోశ సమస్యలకు ముందస్తు పరీక్షలు
పొగాకు వినియోగం, గాలి కాలుష్యం, వృత్తిపరమైన దుమ్ము తదితర కారణాలతో వచ్చే దీర్ఘకాలిక శ్వాసకోశ వ్యాధులను గుర్తించేందుకు ప్రత్యేక స్క్రీనింగ్ చేపట్టనున్నారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో వైద్యాధికారులు పరీక్షలు నిర్వహిస్తారు. అవసరమైన వారిని ప్రాంతీయ, జిల్లా ఆసుపత్రులకు రిఫర్ చేస్తారు. అక్కడ స్పైరోమీటర్ల సహాయంతో శ్వాస సామర్థ్యాన్ని పరీక్షించి తగిన వైద్యం అందిస్తారు.
మానసిక ఆరోగ్యానికి టెలీ మానస్ సేవలు
శారీరక ఆరోగ్యంతో పాటు మానసిక ఆరోగ్యానికి కూడా ఈ కార్యక్రమంలో ప్రాధాన్యత కల్పించారు. కుంగుబాటు, ఆందోళన, జ్ఞాపకశక్తి సమస్యలు, మానసిక భ్రాంతులకు సంబంధించిన అంశాలతో ప్రత్యేక ప్రశ్నావళి రూపొందించారు. మానసిక సమస్యల ముప్పు ఉన్నట్లు గుర్తించిన వారికి టెలీ మానస్ ద్వారా ప్రాథమిక పరీక్షలు నిర్వహిస్తారు. అవసరమైన వారికి జిల్లా మానసిక ఆరోగ్య కార్యక్రమం ద్వారా వైద్య సేవలు అందిస్తారు. మానసిక వైద్యుల సలహాలు, కౌన్సెలింగ్ కోసం 14416 టోల్ ఫ్రీ నంబర్ సేవలను వినియోగించుకోవచ్చు.
వృద్ధులు, దీర్ఘకాలిక రోగులకు ఇంటి వద్దే సేవలు
మంచానికే పరిమితమైన వృద్ధులు, పక్షవాత బాధితులు, చివరి దశ క్యాన్సర్ రోగులు, రోజువారీ పనులు చేసుకోలేని వారిని ప్రత్యేకంగా గుర్తించనున్నారు. గ్రామస్థాయి ఆరోగ్య సిబ్బంది వారి ఇళ్లకు వెళ్లి ఆరోగ్య పరిస్థితిని పరిశీలిస్తారు. అవసరమైన వారికి వైద్య పరీక్షలు, సంచార వైద్య సేవల ద్వారా చికిత్స అందిస్తారు. రోగుల సంరక్షణ, ఆహారం, పరిశుభ్రత, నొప్పి నివారణ తదితర అంశాలపై కుటుంబ సభ్యులకు అవగాహన కల్పిస్తారు. ఇందుకోసం క్షేత్రస్థాయి వైద్య, ఆరోగ్య సిబ్బందికి ప్రత్యేక శిక్షణ ఇవ్వనున్నారు.
అభా ఐడీతో ఆరోగ్య వివరాల అనుసంధానం
స్క్రీనింగ్ ప్రక్రియలో పారదర్శకత, కచ్చితత్వం కోసం ఎఫ్‌ఆర్‌ఎస్ విధానాన్ని అమలు చేయనున్నారు. అవసరమైన గుర్తింపు నిర్ధారణ కోసం బయోమెట్రిక్ వివరాలను కూడా సేకరిస్తారు. ప్రతి ఒక్కరికీ ఆయుష్మాన్ భారత్ హెల్త్ అకౌంట్ (అభా) ఐడీని అనుసంధానించి, వారి ఆరోగ్య రికార్డులను డిజిటల్ విధానంలో భద్రపరుస్తారు. పరీక్షలు, వ్యాధి నిర్ధారణ, చికిత్స, తదుపరి వైద్య పరిశీలన వివరాలను ఎప్పటికప్పుడు నమోదు చేస్తారు. ఏఎన్‌ఎంలు, కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ల యాప్‌ల ద్వారా ఈ వివరాలను జిల్లా, రాష్ట్ర స్థాయిలో పర్యవేక్షిస్తారు.
750 ఐబ్రెస్ట్ పరికరాలతో 10 లక్షల మంది మహిళలకు పరీక్షలు
రొమ్ము క్యాన్సర్‌ను ముందస్తుగా గుర్తించేందుకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపడుతోంది. ఎంపిక చేసిన గ్రామ ఆరోగ్య కేంద్రాల్లో 750 ఐబ్రెస్ట్ పరీక్షా పరికరాలను అందుబాటులోకి తీసుకురానున్నారు. వీటి ద్వారా 10 లక్షల మంది మహిళలకు రొమ్ము క్యాన్సర్ సంబంధిత స్క్రీనింగ్ నిర్వహించనున్నారు. ఈ పరికరాల ద్వారా రేడియేషన్ లేకుండా పరీక్షలు నిర్వహించే అవకాశం ఉంటుంది. అనుమానాస్పద ఫలితాలు వచ్చిన మహిళలకు శిక్షణ పొందిన వైద్యులు తదుపరి పరీక్షలు నిర్వహించి అవసరమైన చికిత్సకు పంపిస్తారు.
మహిళా సంఘాల భాగస్వామ్యంతో ఆరోగ్య అవగాహన
మహిళలు పెద్ద సంఖ్యలో ఆరోగ్య పరీక్షల్లో పాల్గొనేలా గ్రామీణ, పట్టణ పేదరిక నిర్మూలన సంస్థల సహకారం తీసుకోనున్నారు. స్వయం సహాయక సంఘాల సభ్యుల భాగస్వామ్యంతో ఆరోగ్య అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తారు. ఆశా కార్యకర్తలు, వైద్య సిబ్బంది, నూరా హెల్త్ బృందాలు ప్రజలకు వ్యాధులపై అవగాహన కల్పిస్తాయి. మందుల వినియోగం, తదుపరి పరీక్షలపై డిజిటల్ సందేశాలు పంపించేలా ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ విధానాన్ని కృష్ణా జిల్లాలోని బొల్లపాడు, ఎన్టీఆర్ జిల్లాలోని రాయపాడు గ్రామాల్లో ప్రయోగాత్మకంగా అమలు చేస్తున్నారు.
క్యాన్సర్ చికిత్సా కేంద్రాల బలోపేతం
రాష్ట్రంలోని ప్రభుత్వ వైద్య కళాశాలల ఆసుపత్రుల్లో ఉన్న 17 క్యాన్సర్ నివారణ, పరీక్షా కేంద్రాలను మరింత బలోపేతం చేయనున్నారు. ప్రతి మంగళవారం, గురువారం 222వ నంబరు ఓపీ ద్వారా క్యాన్సర్ అనుమానితులకు ప్రత్యేక వైద్య పరీక్షలు, నిర్ధారణ, నిపుణుల సలహాలు అందిస్తారు. కీమోథెరపీ ప్రారంభించిన రోగులకు నిరంతర చికిత్స అందించేందుకు 23 డే కేర్ కీమోథెరపీ కేంద్రాలను అనుసంధానిస్తారు.
ప్రభుత్వ వైద్య కళాశాలల ఆసుపత్రుల సదుపాయాలు లేని ప్రాంతాల్లో తొలిదశగా తొమ్మిది జిల్లా ఆసుపత్రుల్లో క్యాన్సర్ నిర్ధారణ సేవలను బలోపేతం చేస్తారు. ప్రాంతీయ, జిల్లా ఆసుపత్రుల్లో అసంక్రమిత వ్యాధుల ప్రత్యేక విభాగాలు, వృద్ధుల సంరక్షణ కేంద్రాలను అభివృద్ధి చేయడంతో పాటు అవసరమైన చోట ఫిజియోథెరపీ సేవలు కూడా అందుబాటులోకి తీసుకురానున్నారు. ఈ సేవల కోసం 333వ నంబరు ఓపీని కేటాయించనున్నారు.
‘ఒకే లక్ష్యం – ఒకే బృందం.. అసంక్రమిత వ్యాధులపై సమష్టి పోరాటం’ అనే నినాదంతో ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా అమలు చేయనున్నట్లు ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ కె.వి.ఎన్. చక్రధర్ బాబు వివరించారు. ప్రజలకు సమగ్ర ఆరోగ్య సేవలు అందించడంతో పాటు వ్యాధులను తొలిదశలోనే గుర్తించి ప్రాణాపాయ పరిస్థితులను నివారించడమే ఈ విస్తృత స్క్రీనింగ్ కార్యక్రమ ప్రధాన లక్ష్యమని అధికారులు వెల్లడించారు.