-పాల్గొన్న ఎఐసీసీ నేత మోయప్ప, శైలజానాధ్, ఉత్తమ్ కుమార్ రెడ్డి, తులసిరెడ్డి, మస్తాన్ వలీ ఇతర నేతలు
-అఖిలభారత కాంగ్రెస్ అధ్యక్షునిగా రాహుల్ గాంధీ పేరును సూచిస్తూ ఏకగ్రీవ తీర్మానం
-రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర ను ద్విగ్విజయం చేయాలి
-ఈ దేశానికి రక్ష కాంగ్రెస్, అన్ని వర్గాల వారికి న్యాయం చేస్తూ.. దేశాన్ని అభివృద్ది చేసే సత్తా ఒక్క రాహుల్ గాంధీకే ఉందన్న సాకే శైలజానాథ్
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త:
విజయవాడలో ఈరోజు రాహుల్ గాంధీ చేపట్టిన జోడో యాత్రకు సంబంధించిన సన్నాహక సమావేశం నిర్వహించారు. సాకే శైలజానాథ్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో ఎఐసీసీ నుంచి మోయప్ప రెండు తెలుగు రాష్ట్రాల సమన్వయ కర్త ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఎపీసీసీకార్య నిర్వాహక అధ్యక్షులు తులసిరెడ్డి, శిరివెళ్ల ప్రసాద్ ఇతర సీనియర్ నేతలు పాల్గొన్నారు. సమావేశం అనేక మంది నాయకులు తమ అభిప్రాయాలు చెప్పారు. ఈ సందర్బంగా మోయప్ప మాట్లాడుతూ.. అందరూ కలిసి సమన్వయంతో పని చేయాలని, రాహుల్ గాంధీ యాత్ర విజయవంతం చేయాలని సూచించారు. ఎపీసీసీ అధ్యక్షులు సాకే శైలజానాథ్ మాట్లాడుతూ దేశాన్ని ఐక్యంగా ఉంచేలా రాహుల్ గాంధీ యాత్ర చేపట్టారని, సమావేశానికి వచ్చిన 360 మంది ఒక్కొక్కరు వంద మందిని సమీకరించినా.. ముప్పై వేల మంది యాత్ర లో ఉంటారని, ఆవిధంగా ప్లాన్ చేయాలని సూచించారు. ఇక నుంచి పనిచేసి చూపిన వారికే ప్రాధాన్యతలు ఇస్తామని, బ్యాంకు బ్యాలెన్స్ లు, వంశ చరిత్ర లను ఇక పట్టించుకోమని తేల్చి చెప్పారు. తాను పార్టీ కోసం పని చేస్తా.. వ్యక్తులు కోసం చేయనని, నరహరశెట్టి నరసింహారావు, ఇతర నేతల బాధలను నేను అర్దం చేసుకున్నానని, ఇక్కడ అంశాలని ఏఐసీసీ పెద్దలకు వివరిస్తానని ఆయన సభలో చెప్పారు. రేపు సాయంత్రానికి వివిధ రకాల కమిటీల ప్రతినిధులను ప్రకటిస్తామని, కీలకమైన ఫుడ్ కమిటీలో వెంకట్, ప్రతాపరెడ్డి, లక్ష్మీ నరసింహ ఉంటారని తెలిపారు. ప్రతి రోజూ పదివేల మందికి భోజన ఏర్పాటు ఉంటుందని, అదే విధంగా రోజుకొక ఇన్ ఛార్జి చొప్పున తాను, తులసిరెడ్డి, మస్తాన్ వలీ, రుద్రరాజు లు ఉంటారని సమావేశంలో ప్రకటించారు. 25 పార్లమెంటు నియోజకవర్గాలకు ఇన్ ఛార్జిలను త్వరలో ప్రకటిస్తామని, అక్టోబర్ నాలుగున వీరప్ప మోయిలీ అనంతపురం వస్తున్నారని, యాత్రకు సంబంధించిన ఏర్పాట్లు ఆయనకి వివరిస్తామన్నారు. ఇక ప్రచార కార్యక్రమాలు వరకు ఆయా జిల్లాల, నియోజకవర్గాల నేతలు చూసుకోవాలని, మోయప్ప నాయకత్వం లో అందరం కలిసి కట్టుగా పని చేద్దామని శైలజానాథ్ పిలుపునిచ్చారు. నాయకులు వాట్సప్ ప్రోగ్రామ్ లు పెట్టకండి.. క్షేత్ర స్థాయిలో ప్రచారం చేయండి అంటూ పరోక్షంగా చురకలు అంటించారు. జిల్లా ఇన్ ఛార్జి లు, సేవాదళ్ ప్రతినిధులు, సోషల్ మీడియా సిబ్బంది తో సమావేశం ఏర్పాటు చేస్తామని, మీడియా కూడా సహకారం అందించి దేశ రక్షణలో భాగస్వామ్యం కావాలని కోరారు. సమావేశం అనంతరం జరిగిన మీడియా సమావేశంలో శైలజానాథ్ మాట్లాడుతూ పలు తీర్మానాలను ఏకగ్రీవంగా ఆమోదించినట్లు చెప్పారు. ప్రజల పట్ల, దేశం పట్ల నిబద్దత కలిగిన రాహుల్ గాంధీని అఖిల భారత కాంగ్రెస్ అధ్యక్ష పదవిని స్వీకరించాలని, రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, అఖిలభారత కాంగ్రెస్ పార్టీ డెలిగేట్లను ఎన్నుకునే అధికారాన్ని అఖిలభారత అధ్యక్షులకు బదలాయిస్తూ తీర్మానం చేశామన్నారు. రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర ను ద్విగ్విజయం చేసేలా పని చేయాలని తీర్మానానికి ఆమోదించినట్లు చెప్పారు. కాంగ్రెస్ కోసం, దేశం కోసం రాహుల్ గాంధీ అఖిలభారత కాంగ్రెస్ అధ్యక్ష పదవి చేపట్టాలని ఎపీసీసీ తరపున కోరుతున్నామని శైలజానాథ్ అన్నారు.
రాహుల్ గాంధీ జోడో యాత్రకు సంబంధించి రెండు తెలుగు రాష్ట్రాలకు ఉత్తమ్ కుమార్ రెడ్డిని సమన్వయకర్తగా నియమించారు ఈరోజు విజయవాడ వచ్చిన ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా ఈసమావేశంలో పాల్గొని తన ఆలోచనలను, అభిప్రాయాలను వెల్లడించారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో కాంగ్రెస్ నేతల సహకారంతో యాత్ర ను నేనే పర్యవేక్షిస్తానని, దీని పై ఎపి నాయకులతో మాట్లాడటానికి విజయవాడ వచ్చినట్లు చెప్పారు. దేశ వ్యాప్తంగా ఈ యాత్ర కు మంచి స్పందన లభిస్తుందని, కాంగ్రెస్ పార్టీ కూడా ప్రజల్లోకి బలంగా వెళుతుందన్నారు. దేశంలో కుల,మతాలను రెచ్చగొడుతూ రాజకీయ లబ్ధి పొందుతున్నారని, అభివృద్ధి ఫలాలు దేశంలో అందరికీ అందాలని రాహుల్ గాంధీ యాత్ర మొదలు పెట్టారని గుర్తు చేశారు. ఎపి లో కూడా అందరూ కలిసి ఈ యాత్ర ను విజయవంతం చేసేలా కలిసి రావాలని, సమన్వయ లోపం ఉంటే వెంటనే నా దృష్టి కి తీసుకురావాలని కోరారు.
ఇక ఎపీలో రాహుల్ గాంధీ జోడో యాత్రకు సంబంధించిన పూర్తి షెడ్యూల్ ను తులసిరెడ్డి సమావేశంలో అందరికీ చదివి వినిపించారు. అంతేకాకుండా భవిష్యత్ కాంగ్రెస్ వ్యూహాలు, అంశాలను కూడా ఆయన ప్రస్తావించారు. 3571కి.మీ 148 రోజుల పాటు 68 లోక్ సభ నియోజకవర్గాల మీదుగా 12 రాష్ట్రాల్లో ఉంటుందని, కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు ఈ జోడో యాత్ర 203 అసెంబ్లీ నియోజకవర్గాలను కవర్ చేస్తూ సాగుతుందని చెప్పారు. ఎపి లో వంద కి.మి, నాలుగున్నర రోజులు, రెండు లోక్ సభ, నాలుగు అసెంబ్లీ నియోజకవర్గాలలో యాత్ర ఉంటుందని తెలిపారు. అక్టోబర్17న సాయంత్రం కర్నాటక నుంచి ఎపిలో యాత్ర అడుగు పెడుతుందని, రాయదుర్గం నియోజకవర్గం లో సాయంత్రం నాలుగు నుంచి ఏడు గంటల వరకు యాత్ర సాగుతుందన్నారు. 18న విశ్రాంతి తీసుకుని, 19 నుంచి 23వతేదీ వరకు కర్నాటక,ఆంధ్రా సరిహద్దులో యాత్ర జరుగుతుందని వివరించారు. బిజెపి దుష్టపాపన నుంచి దేశానికి విముక్తి కలిగించడం మొదటి లక్ష్యమని, ఎపిలో జగన్ ను ఓడించి కాంగ్రెస్ ను అధికారం లోకి తేవడం రెండో లక్ష్యమని, బిజెపి ఓడించి ఇంటికి పంపడం మూడో లక్ష్యమని, రాహుల్ గాంధీ ని దేశ ప్రధాని చేయడం నాలుగో లక్ష్యమని, ఈ దేశాన్ని సమైక్యతగా ఉంచేలా పని చేయడం ఐదో లక్ష్యంగా పెట్టుకుని అందరూ కలిసి కట్టుగా పని చేయాలని తులసిరెడ్డి కోరారు. కేంద్రం లో బిజెపి ప్రభుత్వం వైఫల్యాలను ఎండగట్టాలని, ప్రసంగాలు కాకుండా, బుల్లెట్ పాయింట్లు తో విమర్శలు సందించాలని సూచించారు. ఇక నుంచి Gdp.. గ్యాస్, డీజిల్, పెట్రోల్ అంశాలపై మోడీ బాదుడిని ప్రజల్లోకి తీసుకెళ్లాలని, రాష్ట్ర విభజన చట్టం హామీలు, ప్రత్యేక హోదా, స్టీల్ ప్లాంట్ అంశాలను ప్రజలకు వివరించాలన్నాకుయ ఎపి లో వైసిపి, టిడిపి, జనసేన లు మన ప్రధాన ప్రత్యర్థులని, వాళ్లకు ఓట్లు వేసేతే బీజేపీకి వేసినట్లేనని అన్నారు. డుప్లికేట్ కాంగ్రెస్ గా ఉన్న వైసిపి అవినీతి గురించి చెప్పాలని, ప్రత్యేక హోదా అంశాన్ని అస్త్రం గా చేసుఉకుని ముందుకు వెళ్లాలని క్యాడర్ దిశానిర్దేశం చేశారు. అంతే కాకుండా.. బిజెపి… అంటే… బాబు, జగన్, పవన్ కళ్యాణ్ అనే కొత్త సూత్రాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలన్నారు. కాంగ్రెస్ తోనే ఎపీకి అభివృద్ది సాధ్యమని, ప్రత్యేక హోదా, బుందేల్ ఖండ్ తరహా ప్యాకేజీ, విభజన చట్టం అమలు చేస్తామని తులసిరెడ్డి చెప్పారు. ఈ సమావేశంలో శిరివెళ్ల ప్రసాద్, మస్తాన్ వలీ, రుద్రరాజు, హర్షకుమార్, కమలమ్మ వంటి నాయకులు కూడా తమ అభిప్రాయాలను వెల్లడించారు.