ప్ర‌శాంత వాతావ‌ర‌ణంలో పంచాయ‌తీ ఎన్నిక‌లు..

– పోలింగ్ కేంద్రాల‌ను సంద‌ర్శించిన రాష్ట్ర ఎన్నిక‌ల సంఘం క‌మిష‌న‌ర్ అనిల్‌చంద్ర పునేఠా
– జిల్లా క‌లెక్ట‌ర్ డా. జి.ల‌క్ష్మీశ‌తో క‌లిసి పోలింగ్ స‌ర‌ళిని ప‌రిశీలించి సంతృప్తి వ్య‌క్తంచేసిన క‌మిష‌న‌ర్‌
– పోలింగ్ కేంద్రాల్లో వీడియోగ్రఫీ, సీసీటీవీల‌తో పటిష్ట పర్యవేక్షణ
– కలెక్టర్ ల‌క్ష్మీశ నేతృత్వంలో జిల్లాలో ఎన్నికల నిర్వహణపై ప్రశంసలు

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త:
పంచాయ‌తీ ఎన్నిక‌ల పోలింగ్ నేప‌థ్యంలో రాష్ట్ర ఎన్నిక‌ల క‌మిష‌న్ క‌మిష‌న‌ర్ అనిల్ చంద్ర పునేఠా గురువారం క్షేత్ర‌స్థాయిలో వివిధ పోలింగ్ కేంద్రాల‌ను ప‌రిశీలించారు. ఈ సంద‌ర్భంగా అనిల్‌చంద్ర పునేఠా ఎన్‌టీఆర్ జిల్లా క‌లెక్ట‌ర్ డా. జి.ల‌క్ష్మీశ‌తో క‌లిసి విజ‌య‌వాడ రూర‌ల్ ఎనికేపాడులోని శ్రీ విజ్ఞాన విహార స్కూల్ పోలింగ్ కేంద్రాన్ని త‌నిఖీ చేశారు. పోలింగ్ కేంద్రంలో ఎన్నికల నిర్వహణ, పోలింగ్ ఏర్పాట్లు, సిబ్బంది విధులను ప‌రిశీలించారు. ఓటర్లకు కల్పించిన సౌకర్యాలు, పోలింగ్ ప్రక్రియ నిర్వహణ తీరును ప‌రిశీలించారు. ఎన్నికలు ప్రశాంతంగా, నిష్పక్షపాతంగా, పారదర్శకంగా నిర్వహించేందుకు తీసుకున్న చర్యలను ప‌రిశీలించి సంతృప్తి వ్య‌క్తం చేశారు. అదేవిధంగా పోలింగ్ కేంద్రంలో భద్రతా ఏర్పాట్లు, ఎన్నికల నియమావళి అమలు తీరును కూడా ప‌రిశీలించారు. ఎన్నికల నిర్వహణలో ప్ర‌తిద‌శ‌లోనూ అప్రమత్తంగా ఉండాలని, నిబంధనలను పక్కాగా అమలు చేయాలని అధికారులకు సూచించారు. అనంత‌రం మీడియాతో మాట్లాడుతూ క్షేత్రస్థాయిలో అభ్యర్థుల ఏజెంట్లు, ఓటర్లతో మాట్లాడినప్పుడు ఎటువంటి ఇబ్బందులు, సమస్యలు లేదా ఫిర్యాదులు లేవని వెల్లడైందన్నారు. ఎన్నికల ప్రక్రియలో పారదర్శకత, భద్రతకు అత్యంత ప్రాధాన్యతనిస్తూ ప్రతి పోలింగ్ కేంద్రంలో వీడియోగ్రఫీ, సీసీటీవీ పర్యవేక్షణ ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఏవైనా అభ్యంతరాలు, ఫిర్యాదులు వచ్చిన పక్షంలో సీసీటీవీ దృశ్యాలను పరిశీలించే అవకాశం ఉంటుందని పేర్కొన్నారు. ప్రజాస్వామ్య ప్రక్రియలో ప్రజలు ఉత్సాహంగా పాల్గొంటున్నారని, చెన్నైలో ఐటీ రంగంలో పనిచేస్తున్న కొందరు ఉద్యోగులు సైతం ప్రత్యేకంగా తమ స్వగ్రామాలకు వచ్చి ఓటు హక్కును వినియోగించుకోవడం అభినందనీయమని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ పేర్కొన్నారు. రెండో విడత గ్రామ పంచాయతీ ఎన్నికలు నవంబర్ 29న, మూడో విడత ఎన్నికలు డిసెంబర్ 2న నిర్వహించనున్నట్లు వెల్లడించారు.
జిల్లా క‌లెక్ట‌ర్ ల‌క్ష్మీశ సార‌థ్యంపై ప్ర‌శంస‌లు:
ఎన్టీఆర్ జిల్లాలో కలెక్టర్ డా. జి.లక్ష్మీశ సమర్థవంతమైన నాయకత్వంలో జిల్లాస్థాయి నుంచి గ్రామస్థాయి వరకు అధికారులు, సిబ్బంది సమన్వయంతో పనిచేస్తున్నారని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ అనిల్ చంద్ర పునేఠా ప్రశంసించారు. ఎన్నికల నిర్వహణలో పటిష్టమైన ఏర్పాట్లు చేపడుతూ, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు తావులేకుండా ప్రశాంత వాతావరణంలో పోలింగ్ సజావుగా జరిగేలా యంత్రాంగం చేస్తున్న కృషి అభినందనీయమని పేర్కొన్నారు. సందర్శనలో జిల్లా పంచాయతీ అధికారి టి.సీతామహాలక్ష్మి, విజయవాడ ఆర్డీవో వెన్నెల శీను, త‌హ‌శీల్దార్ బి.సుగుణ‌కుమారి త‌దిత‌రులు పాల్గొన్నారు.