-ఈ రాత్రికి కాకినాడకు చేరుకోనున్న మత్స్య కారులు
-జిల్లా కలెక్టర్ ఎం.ఎన్. హరేంధిర ప్రసాద్
కాకినాడ, నేటి పత్రిక ప్రజావార్త:
యు.కొత్తపల్లి మండలం ఉప్పాడ సుబ్బంపేట గ్రామానికి చెందిన ఏడుగురు మత్స్యకారులు సముద్రం లో గల్లంతైన ఘటనకు సంబంధించి ఉపశమనం కలిగించే సమాచారం అందిందని, వారందరూ క్షేమంగా ఉన్నారని జిల్లా కలెక్టర్ ఎం.ఎన్. హరేంధిర ప్రసాద్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు.
ప్రస్తుతం మత్స్యకారులు అనకాపల్లి జిల్లా రాంబిల్లి సమీపంలో సురక్షితంగా ఉన్నారని, వారు కాకినాడ కు తిరిగి బయలుదేరారని, ఈ రోజు రాత్రి సుమారు 12 గంటల సమయానికి కాకినాడకు చేరుకునే అవకాశం ఉందని వెల్లడించారు.
తుఫాను సమయంలో నిలిచిపోయిన కమ్యూనికేషన్..
ఉప్పాడ సుబ్బంపేట గ్రామానికి చెందిన IND-AP-E6-MO-927 నంబరు గల మరపడవలో పడవ యజమాని గరికిన సింహాద్రితో పాటు సిబ్బంది సూరాడ కోదండరావు, గంపల ప్రకాష్, తిర్రి నారాయణ, సూరాడ చిన్న, మేరుగు నారాయణ, కందాల రాము ఈ నెల 4వ తేదీన చేపల వేట నిమిత్తం సముద్రంలోకి వెళ్లారని కలెక్టర్ తెలిపారు.
అయితే, అక్వాన్ తుఫాను ప్రభావం సమయంలో వీరు ఒడిశా రాష్ట్రంలోని పారాదీప్ తీరం సమీపంలో ఉండగా, ఈ నెల 19వ తేదీ నుంచి వారితో కమ్యూనికేషన్ సంబంధాలు తెగిపోయాయని పేర్కొన్నారు. దీంతో మత్స్యకారుల కుటుంబ సభ్యులు తీవ్ర ఆందోళనకు గురయ్యారని తెలిపారు.
కోస్ట్ గార్డ్, నేవీ, పోలీసు, మత్స్యశాఖల సమన్వయం తో గాలింపు చర్యలు..
మత్స్యకారులతో సంబంధాలు తెగిపోయిన విషయం తెలిసిన వెంటనే జిల్లా మత్స్యశాఖ అధికారులు అప్రమత్తమై కాకినాడ కోస్ట్ గార్డ్, పారాదీప్ కోస్ట్ గార్డ్, చెన్నైలోని మారిటైమ్ రెస్క్యూ కోఆర్డినేషన్ సెంటర్ (MRCC) అధికారులకు సమాచారం అందించారని కలెక్టర్ వివరించారు.
సమాచారం అందిన వెంటనే సంబంధిత శాఖల అధికారుల సమన్వయంతో గాలింపు చర్యలు ప్రారంభించామని, కోస్ట్ గార్డ్, పోలీసు, మత్స్యశాఖ అధికారులు నిరంతరం పరిస్థితిని పర్యవేక్షిస్తూ మత్స్యకారుల ఆచూకీ కోసం చర్యలు చేపట్టారని తెలిపారు.అవసరమైన సమాచారాన్ని సంబంధిత అధికారుల మధ్య ఎప్పటికప్పుడు సమన్వయం చేసుకుంటూ గాలింపు ప్రక్రియను కొనసాగించామని పేర్కొన్నారు.
రాంబిల్లి సమీపంలో మత్స్యకారుల ఆచూకీ..
కుటుంబ సభ్యులకు కలెక్టర్ భరోసా..
నిరంతర గాలింపు చర్యల ఫలితంగా ఏడుగురు మత్స్యకారులు అనకాపల్లి జిల్లా రాంబిల్లి సమీపంలో క్షేమంగా ఉన్నట్లు సమాచారం అందిందని కలెక్టర్ తెలిపారు.జిల్లా యంత్రాంగం అధికారులు పడవలో ఉన్న మత్స్యకారులతో ఫోన్ ద్వారా మాట్లాడి వారి క్షేమసమాచారాన్ని తెలుసుకున్నారని వెల్లడించారు.
మత్స్యకారులందరూ సురక్షితంగా ఉన్నారని, వారు కాకినాడకు తిరుగు ప్రయాణమయ్యారని, ఈ రోజు రాత్రి సుమారు 12 గంటలకు చేరుకునే అవకాశం ఉందని తెలిపారు. మత్స్యకారుల ఆచూకీ లభించడంతో వారి కుటుంబ సభ్యులు ఊరట చెందారని, కుటుంబ సభ్యులు ఇకపై ఆందోళన చెందాల్సిన అవసరం లేదని కలెక్టర్ భరోసా ఇచ్చారు.
గాలింపు చర్యల్లో సహకరించిన అధికారులకు కృతజ్ఞతలు..
సముద్రంలో గల్లంతైన మత్స్యకారుల ఆచూకీ కోసం నిరంతరం శ్రమించిన కోస్ట్ గార్డ్, చెన్నై MRCC, పోలీసు, మత్స్యశాఖ అధికారులకు జిల్లా కలెక్టర్ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. వివిధ శాఖల మధ్య సమన్వయం, అధికారుల నిరంతర పర్యవేక్షణ, సహాయక చర్యల కారణంగా మత్స్యకారుల ఆచూకీ తెలుసుకోగలిగామని పేర్కొన్నారు.
మత్స్యకారులు సముద్ర భద్రతా నిబంధనలు తప్పనిసరిగా పాటించాలి..
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మత్స్యకారులకు పలు సూచనలు చేశారు.
వాతావరణ శాఖ తుఫానులు, అల్పపీడనాలు, భారీ వర్షాలు, బలమైన గాలుల హెచ్చరికలు జారీ చేసినప్పుడు ఎట్టి పరిస్థితుల్లోనూ చేపల వేటకు సముద్రంలోకి వెళ్లరాదని స్పష్టం చేశారు.
చేపల వేటకు వెళ్లే సమయంలో ప్రతి పడవలో తప్పనిసరిగా పనిచేసే కమ్యూనికేషన్ పరికరాలు, మొబైల్ ఫోన్లు, ఇతర అత్యవసర సమాచార సాధనాలు అందుబాటులో ఉంచుకోవాలని సూచించారు. పడవలోని ప్రతి మత్స్యకారుడు లైఫ్ జాకెట్ ధరించేలా చర్యలు తీసుకోవాలని, అవసరమైన భద్రతా పరికరాలను వెంట తీసుకెళ్లాలని తెలిపారు.
అలాగే, సముద్రంలో ఉన్న సమయంలో వాతావరణ పరిస్థితులను ఎప్పటికప్పుడు గమనిస్తూ, ఒడ్డున ఉన్న కుటుంబ సభ్యులకు, సంబంధిత మత్స్యశాఖ అధికారులకు తమ ప్రయాణ వివరాలు, ప్రస్తుత స్థానం, క్షేమసమాచారాన్ని క్రమం తప్పకుండా తెలియజేయాలని సూచించారు.
మత్స్యకారుల ప్రాణ భద్రత అత్యంత ముఖ్యమని, సముద్రంలో చేపల వేటకు వెళ్లే ప్రతి ఒక్కరూ ప్రభుత్వ శాఖలు జారీ చేసే హెచ్చరికలు, భద్రతా సూచనలు తప్పనిసరిగా పాటించాలని జిల్లా కలెక్టర్ విజ్ఞప్తి చేశారు.
