అగ్నిప్రమాద బాధిత కుటుంబానికి ఎమ్మెల్యే బోండా ఉమా ఆర్థిక సాయం

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త:
విద్యుత్ తీగలలో ఏర్పడిన లోపం కారణంగా ఇల్లు దగ్ధమై సర్వస్వం కోల్పోయిన బాధితుడికి విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు ఆర్థిక సాయం అందించారు. విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలోని 72వ డివిజన్ శాంతినగర్ రెండో లైన్‌లోని లోటస్ ల్యాండ్‌మార్క్ సమీపంలో నివాసం ఉంటున్న వి. నాగేంద్రబాబు ఇంట్లో ఇటీవల విద్యుత్ తీగలలో ఏర్పడిన లోపం కారణంగా అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో ఇల్లు పూర్తిగా దగ్ధమై ఇంట్లోని సామగ్రి అంతా కాలిపోయింది. దీంతో బాధిత కుటుంబం నిరాశ్రయులైంది. ఈ విషయం తెలుసుకున్న నాగేంద్రబాబు ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావును కలిసి తన పరిస్థితిని వివరించారు. వెంటనే స్పందించిన ఎమ్మెల్యే బాధితుడిని పరామర్శించి ధైర్యం చెప్పారు. తక్షణ సాయంగా తన సొంత నిధుల నుంచి రూ.10 వేల నగదును అందజేశారు. ప్రభుత్వ పరంగా కూడా తగిన సహాయం అందేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో విజయ్ కృష్ణ సూపర్ బజార్ అధ్యక్షుడు వెలగా సురేష్, ఘంటా కృష్ణమోహన్, నగేష్, సాంబశివరావు తదితరులు పాల్గొన్నారు.