-3,706 ఓట్ల భారీ మెజారిటీతో అఖండ విజయం – 20 మంది వార్డు సభ్యులతో ప్రమాణ స్వీకారం
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త:
వైఎస్సార్ గ్రామ సర్పంచ్‌గా ఎన్నికైన ఉప్పు నాగలక్ష్మి, గ్రామ ప్రజలు తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ గ్రామాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తానని హామీ ఇచ్చారు. వైఎస్సార్ కాలనీ కమ్యూనిటీ హాల్లో నూతనంగా ఎన్నికైన సర్పంచ్ ఉప్పు నాగలక్ష్మితో పాటు 20 మంది వార్డు సభ్యుల ప్రమాణ స్వీకార మహోత్సవం ఘనంగా నిర్వహించారు.
ఈ సందర్భంగా సర్పంచ్‌గా ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం ఉప్పు నాగలక్ష్మి మీడియాతో మాట్లాడుతూ.. తనకు ఈ అవకాశం కల్పించిన తెలుగుదేశం పార్టీ నాయకుడు బొమ్మసాని సుబ్బారావుకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. 3,706 ఓట్ల భారీ మెజారిటీతో అఖండ విజయాన్ని అందించిన వైఎస్సార్ గ్రామ ప్రజలకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేశారు. ముఖ్యంగా బడుగు, బలహీన వర్గాలకు అండగా నిలుస్తూ, పేద ప్రజల సంక్షేమం కోసం నిరంతరం కృషి చేస్తానని భరోసా ఇచ్చారు. తన విజయానికి అహర్నిశలు కృషి చేసిన తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. తనపై నమ్మకంతో ఓట్లు వేసి ఆశీర్వదించిన గ్రామ ప్రజలందరికీ ఎల్లప్పుడూ రుణపడి ఉంటానన్నారు. గ్రామంలో మౌలిక వసతుల కల్పన, తాగునీరు, పారిశుధ్యం, రహదారులు తదితర అత్యవసర సౌకర్యాల అభివృద్ధికి ప్రాధాన్యత ఇస్తానని పేర్కొన్నారు. రాజకీయాలకు అతీతంగా ప్రజలందరినీ కలుపుకొని గ్రామంలోని దీర్ఘకాలిక సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానన్నారు. ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ వైఎస్సార్ గ్రామ పంచాయతీని ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దడమే తన ప్రధాన లక్ష్యమని స్పష్టం చేశారు.
ఈ సందర్భంగా టీడీపీ నాయకుడు ఉప్పు విజయరాజు మాట్లాడుతూ.. వైఎస్సార్ గ్రామ పంచాయతీలోని 20 వార్డులకు గాను 18 వార్డుల్లో కూటమి అభ్యర్థులకు ఘన విజయం అందించిన గ్రామ ప్రజలకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.
ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో హాజరై నూతనంగా ఎన్నికైన సర్పంచ్, వార్డు సభ్యులకు శుభాకాంక్షలు తెలిపారు.
