-సందర్శకులను ఆకట్టుకుంటున్న ఆర్కిడ్ పింక్ పూలు.. రెండు కిలోమీటర్ల మేర కనువిందు
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త:
ప్రజా రాజధాని అమరావతికి ప్రధాన అనుసంధాన రహదారి అయిన సీడ్ యాక్సెస్ రోడ్డులో బాహీనియా బ్లాకియానా చెట్లకు పూసిన ఆర్కిడ్ పింక్ రంగు పుష్పాలు సందర్శకులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. వెంకటపాలెం సమీపంలో సుమారు రెండు కిలోమీటర్ల మేర విస్తరించిన ఈ పుష్పవనం ప్రకృతి ప్రేమికులకు కనువిందు చేస్తోంది.
అమరావతి అభివృద్ధి సంస్థ (ఏడీసీ) అధికారులు 2017లో సీడ్ యాక్సెస్ రోడ్డులోని బఫర్ జోన్లో సుమారు వెయ్యి బాహీనియా బ్లాకియానా మొక్కలను నాటారు. అప్పటి సీఎండీ డి. లక్ష్మీపార్థసారథి ప్రత్యేక చొరవతో ఈ చెట్లను ఏర్పాటు చేశారు. అధిక నీడనిచ్చే ఈ చెట్లు నవంబర్ నుంచి జనవరి వరకు పుష్పించి రహదారి పరిసరాలకు ప్రత్యేక శోభను తీసుకొస్తున్నాయి.
చెట్ల సంరక్షణకు ప్రత్యేక చర్యలు
ఏడీసీ గ్రీనరీ విభాగం అధికారులు ఈ చెట్లను ప్రత్యేకంగా సంరక్షిస్తున్నారు. ఏడాదికి రెండుసార్లు జూన్, జనవరి నెలల్లో కంపోస్టు, నత్రజని, భాస్వరం, పొటాషియం మిశ్రమం, వర్మీ కంపోస్టు వంటి ఎరువులను అందిస్తున్నారు. అవసరమైన పోషకాలను అందించేందుకు ప్రత్యేక ద్రావణాలను కూడా వినియోగిస్తున్నారు.
బాహీనియా బ్లాకియానా చెట్లు హాంకాంగ్ ఆర్కిడ్ ట్రీగా ప్రసిద్ధి చెందాయి. వీటి ప్రత్యేకమైన పుష్పాలు, పచ్చదనం రహదారి అందాలను మరింత పెంచుతున్నాయి. ఉదయం, సాయంత్రం వేళల్లో వాకర్లు ఈ చెట్ల నీడలో ఆహ్లాదకరంగా నడక సాగిస్తూ ప్రకృతి అందాలను ఆస్వాదిస్తున్నారు.
