ఎంఎస్ఎంఈల అభివృద్ధికి ప్రభుత్వ నిర్ణయాలు స్వాగతార్హం

-పెట్టుబడిదారుల ప్రయోజనాల పరిరక్షణకు ఏపీ ఛాంబర్స్ హర్షం
-అధ్యక్షుడు పొట్లూరి భాస్కరరావు

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త:
రాష్ట్రంలో సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల (ఎంఎస్ఎంఈ) అభివృద్ధికి, పెట్టుబడిదారుల ప్రయోజనాల పరిరక్షణకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకున్న కీలక నిర్ణయాలను ఏపీ ఛాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ ఫెడరేషన్ స్వాగతించింది.
ఏపీ క్యాబినెట్ ఆమోదించిన ఏపీ ఎంఎస్ఎంఈ రైట్ టు బిజినెస్ బిల్లు–2026, ఇన్వెస్ట్‌మెంట్ ప్రొటెక్షన్ బిల్లులు రాష్ట్ర పారిశ్రామిక రంగ అభివృద్ధికి దోహదపడతాయని ఏపీ ఛాంబర్స్ అధ్యక్షుడు పొట్లూరి భాస్కరరావు తెలిపారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పారిశ్రామిక అభివృద్ధికి, వ్యాపార అనుకూల వాతావరణ కల్పనకు చేస్తున్న కృషిని అభినందించారు.
ఎంఎస్ఎంఈ రైట్ టు బిజినెస్ బిల్లు ద్వారా పరిశ్రమల స్థాపనకు అవసరమైన అనుమతులు, విధానపరమైన ప్రక్రియల్లో జాప్యం తగ్గి ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు ప్రయోజనం కలుగుతుందని పేర్కొన్నారు. ఇన్వెస్ట్‌మెంట్ ప్రొటెక్షన్ బిల్లు పెట్టుబడిదారుల్లో విశ్వాసాన్ని పెంపొందించి, రాష్ట్రానికి కొత్త పెట్టుబడులను ఆకర్షించడంతో పాటు ఉపాధి అవకాశాల కల్పనకు దోహదపడుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
దేశంలో ఒక రాష్ట్రం తొలిసారిగా చేపడుతున్న వినూత్న చొరవగా ఇన్వెస్ట్‌మెంట్ ప్రొటెక్షన్ బిల్లును ఆయన అభివర్ణించారు.
ఈ రెండు బిల్లులను రాష్ట్ర శాసనసభలో త్వరితగతిన ఆమోదించి చట్టాలుగా అమలు చేయాలని ఏపీ ఛాంబర్స్ కోరింది. బిల్లుల రూపకల్పన, విధివిధానాల ఖరారులో పరిశ్రమలు, వ్యాపార వర్గాల తరఫున అవసరమైన సూచనలు, సలహాలు అందించేందుకు తమ సంస్థ సిద్ధంగా ఉందని పొట్లూరి భాస్కరరావు వెల్లడించారు.