రోడ్డు మీద గుంత క‌నిపిస్తే మ‌న‌మిత్ర‌కు ఫొటో షేర్ చేయండి

-పౌరుల‌కు ప్ర‌భుత్వం విజ్ఞ‌ప్తి

అమ‌రావ‌తి, నేటి పత్రిక ప్రజావార్త:
గుంత‌ల ర‌హిత ర‌హ‌దారుల ఆంధ్ర‌ప్ర‌దేశ్ సాధ‌నే ల‌క్ష్యంగా రాష్ట్ర ప్ర‌భుత్వం విప్ల‌వాత్మ‌క చ‌ర్య‌లు చేప‌డుతోంది. మ‌న‌మిత్ర వాట్సాప్ గ‌వ‌ర్నెన్స్ ద్వారా ఇందులో ప్ర‌జ‌ల‌ను భాగ‌స్వాములు చేసేలా వినూత్న కార్య‌క్ర‌మం చేప‌డుతోంది. రాష్ట్రంలో ఎక్క‌డైనా స‌రే ప్ర‌జ‌లు త‌మ ప్రాంతంలో ర‌హ‌దారుల‌పై గుంత‌లు క‌నిపిస్తే పౌరులు వాటిని ఫొటో తీసి వెంట‌నే మ‌న‌మిత్ర వాట్సాప్ గ‌వ‌ర్నెన్స్‌కు షేర్ చేయాల‌ని ప్ర‌భుత్వం ప్ర‌జ‌ల‌కు విజ్ఞ‌ప్తి చేస్తోంది. గుంత‌ల ర‌హిత ఆంధ్ర‌ప్ర‌దేశ్ ల‌క్ష్య సాధ‌న దిశ‌గా ప్ర‌భుత్వ కీల‌క అడుగు వేసింది. రాష్ట్రంలో రహదారులపై గుంతల సమస్యలను గుర్తించి, వాటి పరిష్కారానికి ప్రజలను భాగస్వాములను చేస్తూ రియల్ టైమ్ గవర్నెన్స్ సొసైటీ (ఆర్టీజీఎస్‌) మనమిత్ర వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా ప్రత్యేక ఫిర్యాదు సదుపాయాన్ని అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ మేర‌కు ఆర్టీజీఎస్‌ ఒక ప్ర‌క‌ట‌న విడుద‌ల చేసింది. పౌరులు త‌మ ప్రాంతంలో ర‌హ‌దార్ల‌పై గుంత‌లు క‌నిపిస్తే వెంట‌నే వాని ఫొటో తీసి మ‌న‌మిత్ర వాట్సాప్ గ‌వ‌ర్నెన్స్ నెంబ‌రు 9552300009కు పంపాల‌ని కోరింది. అలా పౌరులు పంపిన ఆ ఫొటోల‌ను వెంట‌నే ఆ ర‌హ‌దారి ఏ శాఖ‌కు సంబంధించిదో ఆ శాఖకు పంపుతారు. ఆ శాఖ వారు స్పందించి ఆ గుంత‌ల‌ను పూడ్చి ఆ స‌మ‌స్య‌ల‌ను ప‌రిష్క‌రిస్తారు. ప్ర‌జ‌లు ఈ స‌దుపాయాన్ని స‌ద్వినియోగం చేసుకోవాల‌ని ప్ర‌భుత్వం కోరింది.

ఎలా చేయాలంటే

1. మ‌న‌మిత్ర వాట్సాప్ గ‌వ‌ర్నెన్స్ నంబ‌రు 9552300009కు హాయ్ అని మెసేజ్ పంపాలి

2. అందులో సేవ‌ల అప్ష‌న్‌ను ఎంపిక చేసుకోవాలి

3. పాట్‌హోల్ గ్రీవెన్సెస్ (Pothole Grievances) ఆప్ష‌న్ ఎంపిక చేసుకోవాలి

4. రిజిస్ట‌ర్ పాట్‌హోల్ గ్రీవెన్స్ (Register Pothole Grievance_) ఎంపిక చేసుకోవాలి

5. ప్లీజ్ ఫిల్ ది ఫామ్ ఆఫ్ పాట్‌హోల్ గ్రీవెన్స్ టు స‌బ్‌మిట్ యువ‌ర్ కంప్లైంట్ అని వ‌స్తుంది. దాన్ని ఓపెన్ చేయాలి.

6. ఆధార్ వెరిఫికేష‌న్ కోసం మీ ఆధార్ నెంబ‌రు చేసి మీకు వ‌చ్చే ఓటీపీ న‌మోదు చేయాలి

7. మీ ప్రాంతంలో రోడ్డుమీద ఉన్న గుంత ఫొటో తీసి అప్‌లోడు చేయాలి

8. ఆ గుంత ఉన్న ప్రాంతం క‌రెంటు లొకేష‌న్ షేర్ చేస్తే చాలు

మీరు పంపిన ఫొటోతో కూడిన స‌మ‌స్య‌పై గ్రీవెన్స్ న‌మోదైన‌ట్లు మీకు స‌మాచారం వ‌స్తుంది.

మీరు పంపిన ఆ గుంత‌ ఫొటో, క‌రెంటు లొకేష‌న్ ఆధారంగా ఆ రోడ్డు ఏ శాఖ‌కు చెందిన‌దో గుర్తిస్తారు. పంచాయ‌తీరాజ్ శాఖ‌, పుర‌పాల‌క శాఖ‌, రోడ్లు భ‌వ‌నాల శాఖ‌, స్టేట్ హైవేస్‌, నేష‌న‌ల్ హైవేస్ ఇలా అది ఏ శాఖ‌కు సంబంధించిన‌ది అయితే వారికి ఆ స‌మ‌స్య వెంట‌నే చేరిపోతుంది. దానిపై ఆ శాఖ అధికారులు త‌గు చ‌ర్య‌లు తీసుకుని ప‌రిష్క‌రిస్తారు. దానికి సంబంధించిన తాజా స్థితిని కూడా ఆ స‌మ‌స్య‌ను షేర్ చేసిన పౌరుడు తెలుసుకునే వీలు క‌ల్పించారు. త‌మ ప‌రిస‌ర ప్రాంతాల్లో రోడ్ల‌పై గుంత‌లు క‌నిపించిన‌ప్పుడు ప్ర‌జ‌లు నిర్ల‌క్ష్యం చేయ‌కుండా వాటికి సంబంధించిన ఫొటోలు తీసి మ‌న‌మిత్ర ద్వారా ప్ర‌భుత్వానికి తెలియ‌జేయాల‌ని ప్ర‌భుత్వం ప్ర‌జ‌ల‌కు విజ్ఞ‌ప్తి చేసింది. గుంత‌ల ర‌హిత ర‌హ‌దారులున్న ఆంధ్ర‌ప్ర‌దేశ్ సాధించాల‌నే దిశ‌గా ప్ర‌భుత్వం కృషి చేస్తోంది. ఈ బృహ‌త్కార్యంలో ప్ర‌జ‌లంతా భాగ‌స్వాములు కావాల‌ని ప్ర‌భుత్వం పిలుపునిచ్చింది.