-ప్రత్యేకంగా బడుగు, బలహీన వర్గాల ప్రాంతాల్లో ఈ దేవాలయాల నిర్మాణానికి చర్యలు
-ఉప ముఖ్యమంత్రి & రాష్ట్ర దేవాదాయశాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
ఏడాది కాలంలో రాష్ట్రంలోని పలు బడుగు, బలహీన వర్గాల ప్రాంతాల్లో దాదాపు 1400 దేవాలయాలను నిర్మించేందుకు కార్యాచరణ ప్రణాళిక రూపొందించి అమలు చేస్తున్నట్లు ఉప ముఖ్యమంత్రి, దేవాదాయ, ధర్మాదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ తెలిపారు. మంగళవారం అమరావతి సచివాలయం నాల్గో బ్లాక్ పబ్లిసిటీ సెల్లో ఆయన పాత్రికేయులతో మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ వై.ఎస్.జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు ఈ కార్యాచరణ ప్రణాళికను రూపొందించి రాష్ట్ర వ్యాప్తంగా 26 జిల్లాల్లోని పలు గ్రామాల్లో ఈ దేవాలయాలను నిర్మించనున్నామన్నారు. ఈ మొత్తం దేవాలయాల్లో రాష్ట్ర దేవాదాయ, ధర్మాదాయ శాఖ 1,060 దేవాలయాలను నిర్మిస్తుండగా మిగిలిన దేవాలయాలను నిర్మించేందుకు సమరత సేవా ఫౌండేషన్ అనే స్వచ్చంధ సంస్థ ముందుకు వచ్చిందన్నారు. ఒక్కొక్క దేవాలయం నిర్మాణానికి టి.టి.డి. శ్రీవాణి ట్రస్టు రూ.10 లక్షల ఆర్థిక సహాయాన్ని అందజేయడం జరుగుచున్నదని, ఇందులో రూ.8 లక్షలను దేవాలయ నిర్మాణానికి, మిగిలిన రూ.2 లక్షలను దేవతామూర్తుల విగ్రహాల కొనుగోలుకు వెచ్చించాల్సి ఉంటుందని తెలిపారు. ఈ దేవాలయాల నిర్మాణాల్లో కాంట్రాక్టర్ల ప్రమేయం ఏమాత్రం ఉండదని, జి.ఎస్.టి. కూడా వర్తించదని ఆయన తెలిపారు. అయితే ప్రభుత్వం సమకూర్చే రూ.10 లక్షలకు అదనంగా స్థానికంగా ఉన్న ప్రజలు మరికొంత సొమ్మును దేవాలయ నిర్మాణానికి వెచ్చించేందుకు ముందుగు వస్తే, అటు వంటి దేవాలయాల నిర్మాణ పనులను వారికే అప్పగించడం జరుగుతుందన్నారు. శ్రీ వేంకటేశ్వర స్వామి వారి దేవాలయాలకి సంబందించి స్వామి వారి విగ్రహాన్ని టి.టి.డి. వారే ఉచితంగానే సమకూర్చడం జరుగుతుందని, ఇతర దేవతా మూర్తుల దేవాలయాలకు అవసరమైన విగ్రహాలను 25 శాతం రాయితీపై టి.టి.డి. వారే సమకూర్చడం జరుగుతుందన్నారు. ఈ దేవాలయాల నిర్మాణ బాధ్యతలను ఏ.ఇ. స్థాయి అధికారులకు అప్పగించడం జరిగిందని, అవసరం ఉన్న చోట అదనంగా ఏ.ఇ.లను కాంట్రాక్టు విధానంపై నియమించడం కూడా జరుగుచున్నదని తెలిపారు. ఈ దేవాలయాలన్నింటిలో స్వామి వారి దూపదీప నైవేద్యాలకు అవసరమైన నిధులను ప్రభుత్వమే సమకూర్చడం జరుగుతుందన్నారు.
విధులపై నిర్లక్ష్యం వహించే ఉద్యోగులపై కఠిన చర్యలు…
రాష్ట్ర దేవాదాయ, ధర్మాదాయ శాఖ పరిధిలోని పలు దేవాలయాల్లో పనిచేసే ఉద్యోగులు ఏమాత్రం విధులపై నిర్లక్ష్యం వహించినా కఠిన చర్యలు తీసుకొనేందుకు ఏ మాత్రము వెనుకాడేది లేదని ఉప ముఖ్యమంత్రి, దేవాదాయ, ధర్మాదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ స్పష్టం చేశారు. ఈ మధ్య కాలంలో విజయవాడ శ్రీ దుర్గా మల్లీశ్వర స్వామివారి దేవాలయంలో ఏ.సి.బి. తనిఖీలు నిర్వహిస్తున్న సమయంలో విధులపై నిర్లక్ష్యం వహించినట్లుగా గుర్తించిన 15 మంది ఉద్యోగుల విషయంలో ఆ దేవాలయం ఎగ్జిక్యూటివ్ అధికారి పూర్తి స్థాయిలో సమీక్షించి ఐదారు మంది ఉద్యోగులను పూర్తి స్థాయి బాధ్యులుగా నిర్ణయించి వారికి చార్జి షీట్లను కూడా జారీచేయడం జరిగిందన్నారు. ఈ అంశానికి సంబందించి సంబంధిత దేవాలయం ఇ.ఓ. పత్రికా ముఖంగా ప్రకటన కూడా ఇవ్వనున్నట్లు ఆయన తెలిపారు.