-కేంద్రం తక్షణమే ప్రకటించాలి
-రాజధానిపై మోదీ, జగన్ డ్రామాలు
-సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ
-దిల్లీలో ధర్నాకు బయల్దేరిన రాజధాని రైతులకు సీపీఐ అభినందనలు
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
రాష్ట్రానికి ఏకైక రాజధానిగా అమరావతినే కొనసాగించాలని, ఆ దిశగా కేంద్ర ప్రభుత్వం ప్రకటించాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ డిమాండ్ చేశారు. ఈనెల 17వ తేదీన దిల్లీలో జంతర్‌మంతర్ వద్ద అమరావతి రాజధాని ప్రాంత రైతులు చేపట్టనున్న ధర్నాలో గురువారం విజయవాడ నుంచి రైలులో బయల్దేరిన రైతుల బృందానికి రామకృష్ణతోపాటు ఏఐకేఎస్ అధ్యక్షులు రావుల వెంకయ్య, పార్టీ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు జంగాల అజయ్‌కుమార్, రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కేవీవీ ప్రసాద్, విజయవాడ నగర సీపీఐ కార్యదర్శి జి.కోటేశ్వరరావు, సీపీఐ, అనుబంధ సంఘాల నేతలు, కార్యకర్తలు రైతులకు అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా మూడు రాజధానులు వొద్దు, అమరావతే ముద్దు అంటూ రాజధాని రైతులతో కలిసి పార్టీ శ్రేణులు నినదించారు. అనంతరం రామకృష్ణ మాట్లాడుతూ నాడు అమరావతి రాజధానికి ప్రధాని మోదీ శంకుస్థాపన చేశారని, రాజధాని ప్రాంతంలో నిర్మాణాల కోసం నిధులు కేటాయించారని గుర్తుచేశారు. రాజధాని అంశంపై సీఎం జగన్‌తో ప్రధాని మోదీగానీ, అమిత్‌షాగానీ ఒక్క మాట చెబితే పరిష్కారమవుతుందన్నారు. ఇప్పటికైనా రాజధానిపై కేంద్రం స్పష్టత ఇవ్వాలని, మోదీ, జగన్ డ్రామాలు కట్టిపెట్టి, అమరావతే ఏకైక రాజధానిగా ప్రకటించాలన్నారు. రాజధాని ప్రాంతం వారితోపాటు ప్రత్యేకంగా 29 గ్రామాల రైతులు దాదాపు వెయ్యి రోజుల నుంచి పోరాటాలు కొనసాగిస్తున్నారని పేర్కొన్నారు. ఇంత సుదీర్ఘకాల పోరాటాన్ని దేశంలో ఎక్కడా కొనసాగలేదన్నారు. దిల్లీ సరిహద్దులో రైతుల చేపట్టిన పోరాటం ఒక్క ఏడాది మాత్రమే జరిగిందని వివరించారు. మూడేళ్ల నుంచి పోరాటం జరుగుతున్నప్పటికీ కేంద్రం ఏ మాత్రం పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. అటు ప్రధాని మోదీ సైతం తెలంగాణలో వైఎస్ షర్మిల అరెస్టుపై ఆరా తీస్తారేగానీ, అదే ప్రధాని మోదీ సుదీర్ఘకాలంపాటు ఉద్యమిస్తున్న రాజధాని ప్రాంత మహిళలపై పోలీసులు అక్రమంగా కేసులు నమోదు చేసి, అరెస్టులు చేసినా పట్టనట్టు ఉండటం దుర్మార్గమన్నారు. రాష్ట్రంలోని ఒక్క వైసీపీ మినహా అన్ని పార్టీలు రాజధాని రైతుల ఉద్యమానికి సంఫీుభావం తెలుపుతున్నాయన్నారు. దిల్లీలో రైతులు చేపట్టనున్న ధర్నా విజయవంతం కావాలని రామకృష్ణ ఆకాంక్షించారు. ఇప్పటికైనా కేంద్రం స్పందించి అమరావతే ఏకైక రాజధానిగా ప్రకటించాలని డిమాండ్ చేశారు.