Breaking News

మాది పేదల ప్రభుత్వం…ప్రజలకు అండగా ఉంటాం

-కష్టపడతాం రాష్ట్ర ఆదాయాన్ని పెంచుతాం…పేదలకు పంచుతాం
-వైసీపీ హయాంలో అప్పులు ఫుల్…ఆదాయం నిల్
-నిర్లక్ష్యంతో రాయలసీమను రాళ్ల సీమగా చేశారు
-సీమ రైతులకు డ్రిప్ సబ్సీడీలు ఇవ్వలేదు..కానీ సాక్షి పేపరుకు మాత్రం రూ.403 కోట్ల ప్రకటనలిచ్చారు.
-రోడ్లు, సాగునీటి ప్రాజెక్టులకు నిధులు ఖర్చు చేయ లేదు…సర్వేరాళ్లపై బొమ్మలకు రూ.700 కోట్లు తగలేశారు
-దొంగలను నమ్మి మోసపోవద్దు
-అవినీతి, విధ్వంసం, అసమర్థత‌తో బంగారం లాంటి రాష్ట్రాన్ని నాశనం చేశారు.
-రాళ్లపల్లి, రత్నగిరి వద్ద రిజర్వాయర్లు నిర్మించి సాగు, తాగు నీరు అందిస్తాం
-మడకశిరలో ఇండస్ట్రియల్ క్లస్టర్ ఏర్పాటు చేస్తాం.
-ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు
-మడకశిర నియోజకవర్గం, గుండుమలలో పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న సీఎం

మడకశిర, నేటి పత్రిక ప్రజావార్త :
అసమర్థత, అవినీతితో వైసీపీ ప్రభుత్వం రాయలసీమకు అన్ని విధాలా అన్యాయం చేసిందని సీఎం నారా చంద్రబాబు నాయుడు అన్నారు. సీమ రైతులకు కనీసం డ్రిప్ స‌బ్సిడీ కూడా ఇవ్వలేదని, సాక్షి మీడియాకు మాత్రం ప్రకటనల రూపంలో రూ.403 కోట్లు దోచిపెట్టారని, ఇది ఎవ‌రి సొమ్మని ఇచ్చుకున్నారని ప్రశ్నించారు. గత ఐదేళ్లలో సాగునీటి ప్రాజెక్టులపై నిధులు ఖర్చు చేయకుండా సర్వేరాళ్లపై తన బొమ్మలకు జగన్ రూ.700 కోట్లు తగలేశారని ధ్వజమెత్తారు. వైసీపీ హయాంలో ఆదాయం నిల్…అప్పులు ఫుల్ అని అన్నారు. ఐదేళ్లలో రూ.9.74 లక్షల కోట్లు అప్పులు చేశారని, ఆ అప్పులకు వడ్డీ రూపంలో ప్రతి యేటా రూ.72 వేల కోట్లు చెల్లించాల్సి ఉందన్నారు. రానున్న ఐదేళ్లలో కష్టపడి రాష్ట్ర ఆదాయాన్ని పెంచి పేదలకు పంచుతామని స్పష్టం చేశారు. సత్యసాయి జిల్లా, మడకశిర నియోజకవర్గం, గుండుమల గ్రామంలో ఎన్టీఆర్ భరోసా పింఛన్ల కార్యక్రమంలో సీఎం చంద్రబాబు పాల్గొన్నారు. రామన్న, ఓబుళమ్మ అనే వృద్ధులకు వారి ఇంటికెళ్లి పింఛను అందించారు. అనంతరం రంగనాథ్ అనే రైతుకు చెందిన మల్బరీ పంటను పరిశీలించి షెడ్డులో పట్టు పురుగుల పెంపకాన్ని పరిశీలించారు. గ్రామాన్ని కలియ తిరిగి ప్రజలను ఆప్యాయంగా ప‌ల‌క‌రించారు. అనంతరం ఏర్పాటు చేసిన ప్రజావేదిక కార్యక్రమంలో పాల్గొని ప్రసంగించారు. మొదటగా ఎన్నరూ చెన్నాగిదురా అని కన్నడలో పలకరించారు.

ఈ పేదల ప్రభుత్వం మీకు అండగా ఉంటుంది
‘‘ఎన్డీయే ప్రభుత్వం ప్రజలకు జవాబు దారీ తనంతో ఉంటుంది. ఈ ప్రభుత్వం ఏం చేసినా మీ అందరికీ తెలియ‌జేసే చేస్తుంది. చరిత్రలో మొదటి సారి ఒకేరోజున 97 శాతం పింఛన్లు పంపిణీ చేశాం. అర్హులందరికీ ఇంటి వద్దే పింఛను అందించాం. నేను కూడా నేరుగా వచ్చి పింఛన్లు అందించాను. మీ పట్ల బాధ్యతగా, జవాబుదారీతనం, అందుబాటులో ఉండాలన్న ఉద్దేశ్యంతోనే ఈ విధానానికి శ్రీకారం చుట్టాం. దేశంలోనే పింఛన్ల పంపిణీని మొదట ప్రారంభించింది ఎన్టీఆర్. ఎన్టీఆర్ రూ.35 ఇస్తే దాన్ని నేను రూ.75 చేశారు. 2014లో అధికారంలోకి వచ్చాక రూ.200 నుండి వెయ్యికి పెంచి తర్వాత రూ.2,000 చేశాను. ఇప్పుడు రూ.3 వేల నుండి రూ.4 వేలకు ఒకేసారి పెంచాం. ఏప్రిల్, మే, జూన్ నెలలవి కూడా కలిపి జూలై నెలలో రూ.7 వేలు అందించాం. దివ్యాంగులకు రూ.3 వేల నుండి 6 వేలకు ఒకేసారి పెంచాం. శాశ్వత వికలాంగులుగా ఉన్నవారికి రూ.15 వేలు అందిస్తున్నాం. కిడ్నీ సమస్యతో బాధపడుతున్న వారికి రూ.10 వేలు అందిస్తున్నాం. బాధ్యత గల ప్రభుత్వం అందరినీ ఆదుకుంటోంది. గత నెల రూ.4,408 కోట్లు ఈనెల రూ.2,730 కోట్లు పింఛను రూపంలో లబ్ధిదారులకు అందించాం. యేడాదికి రూ.33,500 కోట్లు పింఛన్లకు ఖర్చు చేయబోతున్నాం. ఈ గుండుమల గ్రామంలోనే 398 మందికి రూ.16.82 లక్షలు ఇస్తున్నామంటే అదీ పేదలపై మా ప్రభుత్వానికి ఉన్న ప్రేమ. ఈ ప్రభుత్వం పేదల ప్రభుత్వం..మీకు అండగా ఉంటుంది.’’ అని అన్నారు.

గత పాలకులు విలాసాలకు అలవాటు పడ్డారు
‘‘చరిత్రలో ఎప్పుడూ లేనంతటి విజయాన్ని అందించిన ఘనత మీకే దక్కుతుంది. ఉమ్మడి అనంతపురం జిల్లాలో 14కు 14 ఎమ్మెల్యే సీట్లు, 2 ఎంపీ సీట్లు గెలిపించారు. కూటమికి 164 సీట్లు ఇచ్చి వైసీపీకి 11 మాత్రమే ఇచ్చారు. ఆ 11లో 7 సీట్లు కూడా సీమ నుండే వారికి వచ్చాయి. రాయలసీమకు ద్రోహం చేసిన వ్యక్తికి 7 సీట్లు ఇచ్చారు. పాలన ఎలా ఉండకూడదో గ‌త ఐదు సంవ‌త్స‌రాలు మీరు చూశారు. పాలన ఎలా ఉండాలో కూటమి ప్రభుత్వం చూపిస్తుంది. గడిచిన ఐదేళ్లలో చరిత్రలో చూడని నష్టాన్ని చూశాం. అన్ని వ్యవస్థలు నిర్వీర్యమ‌య్యాయి. అవినీతి, విధ్వంసం, అసమర్థ పాలనతో బంగారం లాంటి రాష్ట్రాన్ని నిర్వీర్యం చేశారు. ఐదేళ్లలో విధ్వంసం పరాకాష్టకు చేరింది. ఎక్కడబట్టినా దోపిడీ చేశారు. ప్రజల ఆస్తులకు రక్షణగా ఉండాల్సిన వ్యక్తులు దోచుకుని ఇబ్బంది పెట్టారు. ప్రభుత్వంలో ఉండే వ్యక్తులు ప్రభుత్వ ఆదాయాన్ని పెంచాలి…సంపద సృష్టించి మళ్లీ పేదలకు ఇవ్వాలి. కానీ గత ప్రభుత్వంలో ఆదాయం నిల్…అప్పులు మాత్రం ఫుల్ గా ఉన్నాయి. విలాసవంతమైన జీవితానికి గత పాలకులు అలవాటు పడ్డారు. పేదలు ఇళ్లు కట్టుకోవడానికి డబ్బులు ఇవ్వలేదు కానీ రూ.500 కోట్లతో రుషికొండపై ప్యాలెస్ కట్టుకన్నారు. మనం ఏమన్నా రాజులమా, నియంతలమా.? నా పర్యటనలో హంగామాలు ఉన్నాయా.? పరదాలు కట్టామా..చెట్లు నరికేశామా.? ఎవర్నైనా అరెస్టు చేశామా.? అందుకే చెప్తున్నా మేము పాలకులం కాదు..సేవకులం. నియంతలు కూడా చేయనన్ని దుర్మార్గ పనులు గత పాలకులు చేశారు. దొరికింది దోచుకున్నారు. ఇప్పటికే ఏడు శ్వేత పత్రాలు విడుదల చేసి గత ప్రభుత్వ అక్రమాలు, తప్పిదాలు మీ క‌ళ్ల ముందు పెట్టాను.’’ అని వివరించారు.

రతనాల సీమ చేసే బాధ్యత మాది

‘‘ఒకప్పుడు ఉమ్మడి అనంతపురం జిల్లా కరవు జిల్లా. నీళ్లు లేక కరవుతో అల్లాడుతుంటే పశువుల కోసం ప్రత్యేకంగా క్యాంప్ లు ఏర్పాటు చేశాం. నీళ్లిస్తే బంగారం పండించే రైతాంగం ఉమ్మడి అనంత జిల్లాలో ఉంది. నిర్లక్ష్యంతో రాయలసీమను రాళ్ల సీమ చేశారు….ఆ రాళ్ల సీమను మళ్లీ రతనాల సీమ చేసే బాధ్యత మాది. భగవంతుడు ఇక్కడ మంచి వాతావరణం ఇచ్చారు. పట్టు పరిశ్రమ బాగా ఉంది. నలుగురికి ఉపాధి కల్పించే అవకాశం ఉంటుంది. మనం మంచి పని చేస్తున్నాం కాబట్టి వరుణ దేవుడు కూడా కరుణిస్తున్నారు. మేము చెప్పేవి విన్నాక మీ ఇంట్లో చర్చించండి…వాటిని అనుస‌రిస్తే మీ జీవితాలు మారడానికి అవకాశం ఉంటుంది.‘‘ అని సీఎం పేర్కొన్నారు.

అబద్ధాలతో బతికిపోవాలనుకుంటున్నారు
‘‘కొంతమందికి అబద్ధాలు చెప్పడం పుట్టుకతో వచ్చిన విద్య. వాటితోనే బతికిపోవాలనుకుంటున్నారు. వారి మాటలు నమ్మితే కుక్కతోక పట్టకుని గోదావరి ఈదినట్లే ఉంటుంది. గత ఐదేళ్లలో మీ మొహంలో నవ్వుందా.? పర్యటనకు వస్తే స్కూళ్లన్నీ మూయించారు…ఇప్పుడు మేం మూయించామా.? బలవంతంగా జనాన్ని తరలించారు…ఇప్పుడు మేము తరలించామా.? పింఛన్ల కార్యక్రమాల కోసం వేల మందిని మీటింగులకు బలవంతంగా తీసుకొచ్చారు..కానీ నేను మీ దగ్గరకే వస్తా…నా దగ్గరకు రావాల్సిన అవసరం లేదు.’’ అని సీఎం స్పష్టం చేశారు.

సీమ ప్రాజెక్టులపై గత ప్రభుత్వం నిర్లక్ష్యం
‘‘2014-19 మధ్య సాగునీటి ప్రాజెక్టులపై రూ.68 వేల కోట్లు ఖర్చు చేశాం. కానీ గత ప్రభుత్వం ఎంత ఖర్చు పెట్టింది.? మడకశిరకు హంద్రీనీవా కాలువ నేనే తీసుకొచ్చి నీళ్లు ఇచ్చాను. రైతులకు గిట్టుబాటు లేకపోతుండటంతో ఇన్ ఫుట్ సబ్సీడీ విధానాన్ని నేనే ప్రారంభించా. ఇతర జిల్లాల్లో పింఛను తీసుకునే వారికి కనీస భూమి ఐదు ఎకరాల లోపు ఉండాలి…కానీ ఈ జిల్లాలో పింఛన్ తీసుకునేవారికి 10 ఎకరాలు ఉండొచ్చనే నిబంధనను తీసుకొచ్చాం. నీరు లేకపోవడంతో పంటలు ఎండిపోతున్నాయని 90 శాతం సబ్సీడీతో డ్రిప్ ఇరిగేష‌న్ ప‌రిక‌రాలు అందించాం. జిల్లాలో 47 లక్షల ఎకరాల భూమి ఉంటే సాగు అవుతున్న‌ది కేవ‌లం 11 లక్షల ఎకరాలు మాత్రమే. నేరుగా సాగునీరు అందుతున్న‌ది కూడా కేవ‌లం 2 లక్షల ఎకరాలకు మాత్రమే. టీడీపీ హయాంలో సీమలో రూ.12,500 కోట్లు సాగునీటి ప్రాజెక్టులపై ఖర్చు చేశాం. జీడిపల్లి, బైరివానితిప్ప, పేరూరు, గొల్లపల్ల రిజర్వాయర్, మారాల, చెర్లోపల్లి ప్రాజెక్టు పనులు ప్రారంభించాం. గొల్లపల్లి రిజర్వాయర్ పూర్తి చేసి కియా పరిశ్రమను కూడా తీసుకొచ్చాం. ఎడారిగా మారుతుందనుకున్న జిల్లాకు కియా కార్ల పరిశ్రమను తెచ్చాం. ఈ జిల్లాకు నీరిస్తే అన్ని ప్రాంతాలకంటే అగ్రస్థానంలో ఉంటుంది. ఉదయమే శ్రీశైలం వెళ్లి మల్లన్ను దర్శించుకుని కృష్ణమ్మకు హారతి ఇచ్చాను. మనమంతా ప్రకృతిని ఆరాదించాలి…నదుల్ని ప్రేమించాలి. నదులకు హారతి ఇవ్వడం ఆనవాయితీగా రావాలి. గోదావరి, కృష్ణా పుష్కరాల సమయంలో ఆ న‌దుల‌కు హారతి ఇచ్చే కార్యక్రమాన్ని ప్రవేశపెట్టాం. పుష్కరాలు జరిగిన చోటుకు దేవతలు వస్తారని మన పెద్దలు చెప్పారు. 20 ఏళ్లలో ఎప్పుడూ జూలైలో శ్రీశైలం నిండలేదు…కానీ ఈ యేడాది నిండింది. రెండేళ్లుగా సరైన వర్షాలు లేవు…ప్రాజెక్టుల నిర్మాణం పట్టించుకోలేదు. అనంత జిల్లాను సస్యశ్యామలం చేస్తాం. పండ్లు, మల్బరీ, వక్క తోటలను ప్రోత్సహిస్తాం. గిట్టబాటు ధర అందిస్తాం. మళ్లీ బిందు సేద్యాన్ని అందుబాటులోకి తీసుకొస్తాం. పోలవరం ప్రాజెక్టు పూర్తి చేసి, నందుల అనుసంధానం చేస్తే రాష్ట్రానికి కరవు రాదు. ప్రతి ఎకరాకు నీళ్లు ఇవ్వొచ్చు. హంద్రీనీవా పూర్తి చేసి రైతులకు నీళ్లు అందిస్తాం.’’ అని హామీ ఇచ్చారు.

సంపద సృష్టించి పేదలకే పంచుతాం
‘‘మన భవిష్యత్ మార్చుకోవడం మనం చేతుల్లోనే ఉంది. నీరు సంపద సృష్టిస్తుంది…ఆ సందప ఆదాయాన్ని పెంచుతుంది. ప్రభుత్వానికి ఆదాయం వస్తే పేదలకు పింఛన్లు, పిల్లలను బాగా చదివించవచ్చు. అప్పులు తెస్తే అప్పుల్లోనే కూరుకుపోతాం. దుర్మార్గుల వల్ల జీవితాలు నష్టపోతాయి. పేదరిక నిర్మూలన జరగాలి. ఈ గ్రామంలో పేదరికం లేని కుటుంబం రావాలి. పేదలందరికీ పింఛన్లు, సంక్షేమాలు అందిస్తేనో సమస్య పరిష్కారం కాదు…శాశ్వతంగా పేదరికం పోతే న్యాయం జరుగుతుంది.’’ అని అన్నారు.

రాళ్లపల్లి, రత్నగిరి వద్ద రిజర్వాయర్ల నిర్మాణం
‘‘హంద్రీనీవాలో భాగంగా మడకశిర నియోజకవర్గంలో రాళ్లపల్లి, రత్నగిరి వద్ద రిజర్వాయర్లు నిర్మిస్తాం. ఈ రెండు రిజర్వాయర్లు నిర్మిస్తే ఈ ప్రాంతానికి సాగు, తాగునీరు సమస్య పరిష్కారం అవుతుంది. ఆర్.అనంతపురం వద్ద 1600 ఎకరాల భూమి ఉంది…అందులో ఇండస్ట్రియల్ క్లస్టర్ ఏర్పాటు చేస్తాం. ఇక్కడి వాళ్లు ఉపాధి కోసం బెంగళూరు వెళ్తున్నారు…కానీ ఇక్కడి వారికి ఇక్కడే ఉపాధి కల్పిస్తాం. త్వరలోనే నైపుణ్య గణన ప్రారంభిస్తాం… యువతలో నైపుణ్యం పెంచి పని చేసే విధానానికి శ్రీకారం చుడతాం. పరిశ్రమలు తీసుకొచ్చి ఉద్యోగాలు కల్పిస్తాం. వక్క రైతుల కోసం వక్క మార్కెట్ ఏర్పాటు చేసి శాశ్వత పరిష్కారం చూపిస్తాం. మడకశిర పట్టణానికి రింగు రోడ్డును రూ.60 కోట్లతో నిర్మిస్తాం. అన్ని గ్రామాలకు కుళాయి ద్వారా నీళ్లిస్తాం. అగలి మండలంలో గాయత్రి కాలనీలో ప్రభుత్వ భూమిలో పరిశ్రమలు ఏర్పాటు చేస్తాం. సప్తదేవత ఆలయాన్ని అభివృద్ధి చేస్తాం. మడకశిరను రెవెన్యూ డివిజన్ చేసే అంశంపై నిర్ణయం తీసుకుంటాం. పుట్టపర్తి నుండి వచ్చే జాతీయ రహదారి 7ను 44వ జాతీయ రహదారికి అనుసంధానం చేసి పెనుకొండ, గుడిబండ, మడకశిర, అమరావపురంను హైవేతో అనుసంధాన చేస్తాం. హిరియోరికి జాతీయ రహదారిని అనుసంధానం చేస్తాం. గ్రామాల్లో మౌలిక సదుపాయాలు కల్పిస్తాం. పేదలందరికీ ఇళ్లు కట్టించే బాధ్యత మా ప్రభుత్వం తీసుకుంటుంద. గ్రామీణ‌ ప్రాంతాల్లో 3 సెంట్లు, పట్టణ ప్రాంతాల్లో 2 సెంట్లు స్థలం ఇస్తాం. కొత్తగా కట్టే ఇళ్లకు రూ.4 లక్షలు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల తరపున అందిస్తాం.’’ అని స్పష్టం చేశారు.

అన్ని కులాలకు న్యాయం జరగాలి
‘‘ఈ రోజే సుప్రీం కోర్టు వర్గీకరణపై తీర్పు ఇచ్చింది. 1996లోనే నేను సామాజిక న్యాయం కోసం ఏబీసీడీ వర్గీకరణ విధానం తీసుకొచ్చా. నాడు తీసుకున్న నిర్ణయం సబబేనని సుప్రీం కోర్టు తీర్పు ఇచ్చింది. మేము సామాజిక న్యాయం కోసం ముందుకు వెళ్లాం. అన్ని కులాలు, అన్ని మతాలకు న్యాయం జరగాలి. ప్రధాని మోదీ కూడా ఎస్సీ వర్గీకరణకు ఆమోదం తెలిపారు…ఇది శుభపరిణామం. ఎవరికీ అన్యాయం జరగకుండా అందరికీ న్యాయం జరిగేలా ఏబీసీడీ వ‌ర్గీక‌ర‌ణ‌తో సామాజిక న్యాయం చేస్తాం. ఎంత చేసినా మీ రుణం తీర్చుకోలేను. పేదరికం లేని సమాజం నిర్మిస్తాం. నేను ఏ పని చేసినా మీ కోసమే ఆలోచిస్తా. పేదవాడికోసమే ఆలోచిస్తా. నేను ఏ ఒక్కరి వాడిని కాదు…మీ అందరి వాడిని. మీరు బాగుంటే చూసి ఆనందించాలనే ఆలోచనలో నాలో ఉంది. సంపద సృష్టించి ప్రపంచంలో అగ్రభాగాన ఉంచుతాం. రైతులను ఆదుకుంటాం. సోలార్ ప్రాజెక్టుకు కూడా ముందుకు వస్తే ఏర్పాటు చేస్తాం. మన ఊరిలోనే కరెంట్ ఉత్పత్తి చేసుకోవచ్చు. మీ ఇల్లు, పొలాలకు ఇక్కడి నుండే విద్యుత్తు ఇవ్వొచ్చు. దొంగలను నమ్మి మోసపోవద్దు. మోసపోతే మళ్లీ నష్టపోతాం. ఆగస్టు 15న అన్నా క్యాంటీన్లు ప్రారంభిస్తాం. పేదవాడికి రూ.5లకే అన్నం పెడతాం. కష్టపడతాం…సంపాదిస్తాం…ఆదాయం పెంచుతాం…పేదలకు ఆదాయాన్ని పంచడం నిరంతరం కొనసాగుతుంది. నా సంకల్పం…పేదరికం లేని దేశం..పేదరికం లేని రాష్ట్రం…పేదరికం లేని గ్రామం. నా సంకల్పానికి మీరంతా అండగా ఉండాలి. ఈ గ్రామంలో ఎన్నికల్లో టీడీపీకి మెజారిటీ వచ్చింది. ఎంఎస్ రాజు పోరాట యోధుడు…ఇప్పుడు అభివృద్ధి కోసం పోరాడతారు. మడకశిరకు ఏం కావాలో అది చేస్తాం. అనంతపురం జిల్లాను అగ్రభాగాన పెట్టే బాధ్యత మేము తీసుకుంటాం.’’ అని సీఎం చంద్రబాబు హామీ ఇచ్చారు.

Check Also

మద్దిరాలపాడు పర్యటనలో…

ఒంగోలు, నేటి పత్రిక ప్రజావార్త : మద్దిరాలపాడు పర్యటనలో భాగంగా తాళ్లూరి జగ్గయ్య (67), పార్వతి దంపతుల ఇంటికి ముఖ్యమంత్రి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *