-శ్రీశైల భ్రమరాంబిక మల్లికార్జున స్వామి వార్లకు ప్రత్యేక పూజలు..
-శ్రీశైలం డ్యాం వద్ద కృష్ణమ్మకు జలహారతి.. సారె సమర్పణ
-ఏపీజెన్కో కుడిగట్టు జల విద్యుత్ కేంద్రాన్ని పరిశీలించిన సీఎం..
-సున్నిపెంట నీటి వినియోగదారుల సంఘం ప్రతినిధులతో ముఖాముఖి..
-రాయలసీమలో కరువు అనేమాట లేకుండా చేయడం మనందరి సంకల్పం కావాలని సీఎం పిలుపు
-ఐదేళ్లలో మొత్తం రాష్ట్రంలో రూ.69 వేల కోట్లు సాగునీటి ప్రాజెక్టులకు ఖర్చుపెట్టిన ఘనత మనది
-రైతాంగం మీద మమకారం ఉన్న ప్రభుత్వం మనది
-సముద్రంలోకి పోయే నీళ్లన్నీ రాయలసీమకు పంపిస్తే, అన్ని రిజర్వాయర్లు పూర్తైతే రాబోయే 5 సంవత్సరాలు కూడా కరువు అనేమాట లేకుండా ప్రణాళికలు తయారు చేసే బాధ్యత మాది
-రాయలసీమను రతనాల సీమగా తయారు చేస్తాను
-నంద్యాల జిల్లా శ్రీశైలం పర్యటనలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు
శ్రీశైలం/నంద్యాల జిల్లా, నేటి పత్రిక ప్రజావార్త :
ద్వాదశ జ్యోతిర్లింగాలలో రెండవది… ఆరవ అష్టాదశ శక్తిపీఠం… ఇలలో వెలసిన కైలాసంగా ప్రసిద్ధి చెందిన శ్రీశైలం శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి వార్లను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గురువారం దర్శించుకున్నారు. ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తరువాత తొలిసారి నంద్యాల జిల్లాలో పర్యటించిన ఆయన.. అచ్చతెలుగు పంచెకట్టులో మల్లన్న, అమ్మవార్ల సేవలో పాల్గొని తరించారు.
అంతకుముందు.. ఆలయ సంప్రదాయం ప్రకారం ముఖ్యమంత్రికి పూర్ణకుంభంతో ఆలయ అర్చకులు స్వాగతం పలికి, వేదమంత్రాలతో ఆశీర్వచనం చేశారు. ముందుగా.. రత్నగర్భ గణపతిని దర్శించుకున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అనంతరం శ్రీశైల మల్లికార్జున స్వామిని, శ్రీ భ్రమరాంబ అమ్మవారిని దర్శించుకుని అర్చన కార్యక్రమంలో పాల్గొని భక్తిశ్రద్ధలతో ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్వామివారి మండపంలో వేద పండితులు వేదాశీర్వచనం చేసి ముఖ్యమంత్రికి తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఆలయం బయట.. ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి దాదాపు రూ.12 కోట్ల ఖర్చుతో శ్రీ స్వామి అమ్మవార్లకు బహుకరించిన బంగారు రథాన్ని ముఖ్యమంత్రి పరిశీలించారు.
అనంతరం.. నీలం సంజీవరెడ్డి సాగర్ (శ్రీశైలం) ప్రాజెక్టు వద్దకు చేరుకుని రాయలసీమ నీటిపారుదలకు సంబంధించిన అన్ని ప్రాజెక్టుల ముఖచిత్ర మ్యాప్ ను ముఖ్యమంత్రి పరిశీలించారు. ఈ సందర్భంగా శ్రీశైలం డ్యాం ఎస్ఈ రామచంద్ర మూర్తి సాగునీటి ప్రాజెక్టుల వివరాలను సీఎంకు నివేదించారు.
కృష్ణా నదికి జల హారతి ఇచ్చిన తర్వాత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కృష్ణమ్మకు చీర సారె నీటిలో వదిలి వాయనం సమర్పించారు. అనంతరం.. శ్రీశైలం కుడిగట్టు పవర్ ప్రాజెక్టును పరిశీలించారు.
అనంతరం.. సున్నిపెంట నీటి వినియోగదారుల సంఘం ప్రతినిధులతో చంద్రబాబు ముఖాముఖి నిర్వహించారు.
ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు మాట్లాడుతూ ఏమన్నారంటే..
అందరికీ నమస్కారం.. తమ్ముళ్లూ హుషారుగా ఉన్నారా.. ఆడబిడ్డలు మీరు బాగున్నారా. మంచి రోజులు వచ్చాయి. రాబోయే రోజుల్లో అన్ని మంచి రోజులే ఉండాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తున్నాను. ఇప్పుడే భ్రమరాంబ మల్లిఖార్జునస్వామి దర్శనం చేసుకున్నాను. అక్కడి నుంచి నేరుగా మీ దర్శనం చేసుకున్నాను. అంతకుమందు శ్రీశైలంలో జలహారతి ఇచ్చాం. ఇప్పుడు మడకశిరకు వెళ్లాలి. అక్కడ పేదవాళ్ల పింఛన్ పంపిణీ కార్యక్రమాలు ఏవిధంగా జరిగాయో సమీక్ష చేయాలి.
శ్రీశైలం కృష్ణమ్మ ఏవిధంగా పరవళ్లు తొక్కుతుందో అంతకుమించిన ఉత్సాహం మీలో కనిపిస్తోంది. 20 సంవత్సరాల కంటే ముందే జూలై నెలలోనే శ్రీశైలం నిండింది. మీరు మొన్న ఆశీర్వదించారు. మల్లన్న ఆశీర్వదించాడు. కృష్ణమ్మ గలగలా పారుతోంది. ఇంక రాయలసీమలో కరువు అనేమాట లేకుండా చేయడం మనందరి సంకల్పం కావాలి. దేనికైనా ఒక దూరదృష్టి ఉండాలి. రాయలసీమలో ఉండే అందరూ ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఇది ఎన్టీ రామారావు గారి కల.
మొట్టమొదటిసారిగా కృష్ణా జలాలను మిగులు జలాలను మనం వాడుకోవచ్చని చెప్పింది, తెలుగుజాతి అవసరాలకు వాడుకోవచ్చని చెప్పిన ఏకైక నాయకుడు నందమూరి తారకరామారావు గారు. ఆరోజు ఆయన ఒకటే ఆలోచించారు. అనేక ప్రాజెక్టులు.. తెలుగు గంగ, మీరు గుర్తు పెట్టుకోవాలి. తెలుగు గంగ ప్రాజెక్టు ద్వారా తమిళనాడుకి నీళ్లు ఇవ్వాలంటే పైపులు భూమిలో వేసి తీసుకువెళ్లాలంటే నా రాయలసీమకు నీళ్లు ఇచ్చిన తర్వాతనే చెన్నైకి నీళ్లు వెళ్తాయని చెప్పి సాధించిన వ్యక్తి నందమూరి తారకరామారావు.
హంద్రీ-నీవా, ఎస్సార్బీసీ, నగరి-గాలేరు అన్ని కాలువలు, రిజర్వాయర్లు ప్రారంభించింది ఆయన.. అవి పూర్తి చేసింది నేను. నేను కూడా రాయలసీమలోనే పుట్టాను. కానీ మీరు ఇంకా వెనుకబడి ఉన్నారు. రాజకీయాలకు అర్హతలేని వ్యక్తికి పట్టం కట్టారంటే ఎక్కడో మనలో ఇంకా చిన్న లోపం ఉంది. నేను అడుగుతున్నా ఒక్కసారి మీరందరూ ఆలోచించండి. ఐదేళ్లలో ప్రారంభించింది మనమే, పూర్తి చేసింది మనమే. ఐదేళ్లలో మొత్తం రాష్ట్రంలో రూ.69 వేల కోట్లు సాగునీటి ప్రాజెక్టులకు ఖర్చు పెట్టాం.
మీరు చూస్తే.. ఈయన ఐదేళ్లు ఉన్నాడు. నేను ఆ పేరు కూడా చెప్పను, మీకు నచ్చిన పేరు పెట్టుకోవచ్చు. ఖర్చు పెట్టిన డబ్బులు చూస్తే.. రూ.19 వేల కోట్లు. రూ.69 వేల కోట్లు ఎక్కడ? రూ.19 వేల కోట్లు ఎక్కడ?. అప్పుడు బడ్జెట్ రూ.7 లక్షల కోట్లు ఐదేళ్లలో. ఇప్పుడు రూ.12 లక్షల కోట్లు. రూ.12 లక్షల కోట్లలో ఆయన పెట్టింది రూ.4,400 కోట్లు పెడితే మన హయాంలో రూ.13,600 కోట్లు సంవత్సరానికి ఖర్చు పెట్టాం. అదీ రైతాంగం మీద మన ప్రభుత్వం చిత్తశుద్ధి.
హంద్రీ-నీవా.. ఐదేళ్లలో రూ.5,520 కోట్లు మనం ఖర్చు పెడితే ముష్టి రూ.515 కోట్లు ఖర్చు పెట్టారు. గాలేరు-నగరి సుజల స్రవంతికి మనం రూ.2,056 కోట్లు పెడితే రూ.448 కోట్లు ఖర్చు పెట్టాడు. రాయలసీమలోనే మనం రూ.12 వేల కోట్లు ఖర్చు పెడితే ఇతను ఖర్చు పెట్టింది రూ.2,011 కోట్లు. మీరు ఆమోదిస్తారా?. బ్రిజేష్ కుమార్ ట్రిబ్యూనల్ వచ్చినప్పుడు రాయలసీమకు మిగులు జలాలు అవసరం లేదని ఆనాటి పాలకులు ఇస్తే దానికోసం పోరాడాం. మిమ్మల్ని అందరినీ ఒకటే కోరుతున్నా. ఏ వ్యక్తి వల్ల, ఏ పార్టీ వల్ల మనకు న్యాయం జరిగింది, జరుగుతుంది అనే ఆలోచన మీలో ఉండాలి. మొన్న ఈ ఆలోచన మీకు వచ్చింది, అది ఎప్పుడూ ఇలాగే ఉండాలి. మొన్నటివరకు మీ ముఖాల్లో నవ్వు కూడా లేదు. దానికి కారణం నవ్వితే కొట్టించే నాయకుడు. ఎవరైనా చనిపోతే ఏడిస్తే కొట్టే నాయకుడు. అంటే మన మనోభావాలు లెక్క లేకుండా ప్రవర్తించే నాయకుడు అవునా? కాదా?. భయంతో బ్రతికాం, స్వేచ్ఛ లేదు మనకు. అలాంటిది ఈరోజు మీరంతా ఏం చేయాలన్నా చేసే శక్తి వచ్చింది అంటే అది ప్రజాస్వామ్యం ఇచ్చింది. దాన్ని కాపాడింది తెలుగుదేశం, జనసేన, బీజేపీ. మొన్న ఎన్నికలు ఒక సునామీ. ఒక్కొక్క సీటులో 90 వేల మెజారిటీ. నేను ఆరోజే చెప్పాను. రాబోయేది సునామీ. ఈ సునామీలో చిత్తుచిత్తుగా ఊడ్చుకుపోతారు అని చెప్పాం అదే జరిగింది.
మీరందరూ ఓట్లేశారు గానీ.. మీకు ఎన్నో హామీలు ఇచ్చాను చేయాలి. కానీ ఖజానా ఖాళీగా కనబడుతోంది ఏమీ లేదక్కడ. ఈరోజు కేంద్రంలో ఉండే ఎన్డీఏ ప్రభుత్వం ముందుకొచ్చి కలిసి పోటీ చేశాం కాబట్టి నన్ను అర్థం చేసుకున్నారు. అందుకే అందరినీ గెలిపించిన ఘనత ఈ తెలుగుజాతిది, ఈ రాష్ట్ర ప్రజానీకానిది. దానివల్ల నిలదొక్కుకునే శక్తి వచ్చింది.కానీ నేను ఒకటే ఆలోచిస్తున్నా. మీ అందరికీ ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాను. నేను నేరుగా మల్లిఖార్జునస్వామి దర్శనం చేసుకుని నేను సంకల్పం చేసి అదేమాదిరి కృష్ణమ్మ తల్లికి జలహారతి ఇచ్చి నా బాధ్యత నేను చేశా. కానీ ఈ సంవత్సరం చూస్తుంటే శ్రీశైలం ఇప్పటికే నిండిపోయింది, ఇంకొక రెండు మూడు రోజుల్లో నాగార్జునసాగర్ నిండుతోంది, పులిచింతల నిండుతోంది. సముద్రంలోకి పోయే నీళ్లన్నీ రాయలసీమకు పంపిస్తే, అన్ని రిజర్వాయర్లు పూర్తైతే రాబోయే 5 సంవత్సరాలు కూడా కరువు అనేమాట లేకుండా ప్రణాళికలు తయారు చేసే బాధ్యత మాది అని మీ అందరికీ హామీ ఇస్తున్నా.
నీరు అనేది చాలా ముఖ్యం. నీరు ఉన్నప్పుడు దాని విలువ తెలియదు. ఈ నీటి సమస్య శాశ్వతంగా పరిష్కారం చేసుకోగలిగితే.. సాగునీటి వల్ల బ్రహ్మండంగా పంటలు పండించే అవకాశం వస్తుంది. ఆహారధాన్యాల కొరత తీరే పరిస్థితి వస్తుంది. రాయలసీమలో ముఖ్యంగా నేను ఒకటే ఆలోచిస్తున్నా.. ప్రతి ఎకరాకు నీళ్లివ్వాలి. ఆ నీళ్లివ్వడం కూడా పండ్ల తోటలు, ఉద్యాన పంటలే ఎక్కువ పండించాలి. ఒకప్పుడు రాయలసీమ రతనాల సీమ. తర్వాత వచ్చిన పాలకుల వల్ల ఇది రాళ్ల సీమగా మారిపోయింది. ఈ రాయలసీమను రతనాల సీమగా తయారు చేస్తానని నేను మీకు హామీ ఇచ్చాను. ఇది సాధ్యం.
ప్రతి ఎకరాకు నీళ్లు ఇవ్వగలిగితే మీరు పండ్ల తోటలు వేస్తే ఇండస్ట్రీస్ తీసుకొస్తే ఇప్పటికే ఇన్ఫ్రాస్ట్రక్చర్ చూస్తున్నారు. రాయలసీమలో 4 ఎయిర్‌పోర్టులు ఉన్నాయి. అన్ని ప్రాంతాలకు అనుసంధానంగా నేషనల్ హైవేస్ వచ్చేశాయి. కరెంట్ కూడా ఇక్కడే ఉత్పత్తి అవుతోంది. ఒకప్పుడు హైడల్ అంటే నీటితో కరెంట్ ఉత్పత్తి చేసేది. ఇప్పుడు ఎండ, గాలితో కూడా కరెంట్ ఉత్పత్తి చేస్తున్నాం. ఇవన్నీ మనం చేసుకోగలిగితే రాయలసీమలో పెద్దఎత్తున ఇండస్ట్రీస్ వస్తే వేరే ప్రాంతాలవాళ్లు ఈ ప్రాంతానికి వచ్చే పరిస్థితి వస్తుంది. వ్యవసాయ ఆధార పరిశ్రమలు రావాలి. ఫుడ్ ప్రాసెసింగ్‌కి ఎక్కువ రావాలి. మనం పండించే పంటలు ప్రపంచం మొత్తం విక్రయించాలి. ఇది జరగాలంటే లాజిస్టిక్స్ పర్మిట్ చేయాలి. అలాంటివన్నీ చేయడానికి ముందుకుపోతాం. ఎందుకంటే నీళ్లున్నాయ్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది, బ్రహ్మాండంగా పనిచేసే రాయలసీమ ప్రజానీకం ఉన్నారు. మిమ్మల్ని ఉపయోగించుకుంటే ఇవన్నీ సాధ్యం.
ఈ కార్యక్రమంలో రాష్ట్ర న్యాయ మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్ఎండి ఫరూక్, రోడ్లు భవనాలు, మౌలిక సదుపాయాలు, పెట్టుబడుల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి, జల వనరుల శాఖ మంత్రి డా. నిమ్మల రామానాయుడు, విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్, శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి, నంద్యాల పార్లమెంటు సభ్యులు బైరెడ్డి శబరి, డోన్ ఎమ్మెల్యే కోట్ల జయ సూర్యప్రకాష్ రెడ్డి, నందికొట్కూరు ఎమ్మెల్యే గిత్త జయసూర్య, ఆళ్లగడ్డ ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ, పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరిత రెడ్డి, జిల్లా కలెక్టర్ రాజకుమారి, డిఐజీ కే ప్రవీణ్ కుమార్, జిల్లా ఎస్పీ అధిరాజ్ సింగ్ రాణా తదితరులు పాల్గొన్నారు.