– జిల్లా కలెక్టర్ ఆమోదంతో నేరుగా ఉద్యాన రైతుల ఖాతాల్లో జమ
– జిల్లా ఉద్యాన అధికారి పి.బాలాజీ కుమార్
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ఎన్‌టీఆర్ జిల్లాలో 2,387 మంది రైతులకు రూ. 3.23 కోట్ల మేర వివిధ ఉద్యాన పథకాల (2023-34)కు సంబంధించి మొదటి విడతగా రూ. 3.23 కోట్లు ప్రభుత్వ రాయితీ విడుదలైందని.. జిల్లా కలెక్టర్ ఆమోదంతో రైతుల ఖాతాల్లో ఈ రాయితీ మొత్తాన్ని నేరుగా జమచేయడం జరుగుతోందని జిల్లా ఉద్యాన అధికారి పి.బాలాజీ కుమార్ తెలిపారు. ఈ మేరకు ఆయన శనివారమిక్కడ ఓ ప్రకటన విడుదల చేశారు. రాష్ట్రీయ కృషి వికాస యోజన కింద 267 మంది రైతులకు రూ. 0.965 కోట్లు, జాతీయ వంట నూనెల మిషన్-ఆయిల్‌పాం కింద 661 మంది రైతులకు రూ. 1.614 కోట్లు, ఉద్యాన పంటల సమగ్రాభివృద్ధి పథకం కింద 1,459 మంది రైతులకు 0.649 కోట్లు రాయితీ విడుదలైనట్లు తెలిపారు. 2023-24కు సంబంధించి రెండో విడత నిధులు, 2022-23, 2021-22, 2020-21 సంవత్సరాలకు సంబంధించిన రాయితీ నిధులు కూడా త్వరలో విడుదలకానున్నట్లు రాష్ట్ర ఉద్యాన సంచాలకులు తెలియజేసినట్లు వెల్లడించారు. ఈ నేపథ్యంలో 2024-25కు సంబంధించి వివిధ ఉద్యాన పథకాల పరిధిలో రాయితీ పొందేందుకు రైతులు ముందుకు రావాలని ఆయన కోరారు. పథకాల వివరాలకు ఉద్యాన రైతులు తమ గ్రామంలోని రైతుసేవా కేంద్రంలోని గ్రామ వ్యవసాయ/ఉద్యాన సహాయకులను సంప్రదించాలని బాలాజీ కుమార్ సూచించారు.