-ప్రైవేట్ ప్లేస్కూల్స్‌కి ధీటుగా అంగన్‌వాడీలలో మౌళిక వసతులు అంగన్‌వాడీ కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలి
-శాసనసభ్యులు గద్దె రామ్మోహన్
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
పుట్టిన బిడ్డకు తల్లిపాలకు మించిన ఔషదం మరోకటి లేదని రోగనిరోధక శక్తికి తల్లిపాలు ఎంతో దోహదపడుతాయని ప్రతి ఒక్కరు పిల్లలకు తప్పనిసరిగా తల్లిపాలను అందించాలని తూర్పు నియోజకవర్గ శాసనసభ్యులు గద్దెరామ్మోహన్ అన్నారు. జిల్లా మహిళా శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో స్థానిక సబ్‌కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో బుధవారం నిర్వహించిన తల్లిపాల వారోత్సవాలు ముగింపు కార్యక్రమానికి తూర్పు నియోజకవర్గ శాసనసభ్యులు గద్దెరామ్మోహన్ ముఖ్య అతిధిగా హాజరు అయ్యారు. ఈ సందర్శంగా ఏర్పాటు చేసిన సభలో శాసనసభ్యులు గద్దె రామ్మోహన్ మాట్లాడుతూ బిడ్డ పుట్టిన నాటి నుండి 6 నెలల పాటు కేవలం తల్లిపాలను మాత్రమే అందించాలన్నారు. 6 నెలల అనంతరం తల్లిపాలతో పాటు అదనపు ఆహారాన్ని అందించాలన్నారు. అప్పుడే పుట్టిన బిడ్డలో రోగనిరోధక శక్తి కలిగి ఆరోగ్యవంతంగా ఎదగగలుగుతారన్నారు. నేటి సమాజంలో మహిళలు సౌందర్యం తగ్గుతుందనే అపోహతో పాటు బిడ్డలకు చనుబాలు ఇవ్వకుండా పోతపాలను పడుతున్నారన్నారు. పోతపాలు బిడ్డ ఆరోగ్యానికి ఏమాత్రం శ్రేయస్కరం కాదన్నారు. తల్లిపాలలో ఉండే పోషకాలు తల్లి బిడ్డ ఎదుగుదలపై ప్రభావం చూపుతుందన్నారు. తల్లిపాలలో బిడ్డకు అవసరమైన పుట్టిన బిడ్డకు మొదటి 6 నెలలు ఎంతో కీలకమైన రోజులని శారీరక అవయవాల అభివృద్ధికి అయోడిన్ ప్రధాన పాత్ర పోషిస్తుందన్నారు. శిశు మరణాలు, మెంటల్ రిటార్డేషన్, కుంగిపోయిన ఎదుగుదల ఎండిమిక్ గాయిటర్ హైపోథైరాయిడిజం మొదలైన వాటి ప్రమాదం నుండి తల్లిపాలు మాత్రమే బిడ్డకు రక్షణ కల్పిస్తుందన్నారు. తల్లి పాలు బిడ్డకు ఎంతో అమృతంతో సమానమని రోగనిరోధక శక్తి అధికంగా ఉండే తల్లి పాలు బిడ్డ ఆరోగ్యానికి ఎంతో శ్రేయస్కరమనే విషయం పై మహిళలలో పూర్తి అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందన్నారు. తల్లిపాలపై అవగాహన కల్పించడం అభినందనీయమన్నారు. జిల్లా పరిష్యత్ మాజీ చైర్మన్ గద్దె అనూరాధ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం అంగన్‌వాడీ కేంద్రాల ద్వారా చిన్నారులకు సంపూర్ణ పోష్టికాహారాన్ని అందించాలని అధికారులను ఆదేశించడం జరిగిందన్నారు. ముఖ్యమంత్రివర్యులు నారా చంద్రబాబు నాయుడు మహిళా శిశు సంక్షేమం అంగన్‌వాడీల నిర్వహణ పై ప్రత్యేక శ్రద్ద పెట్టారన్నారు. అంగన్‌వాడీ కేంద్రాలను ప్రైవేట్ నర్సరీ స్కూల్స్‌కి ధీటుగా తీర్చిదిద్ది పేద బలహీన వర్గాల చిన్నారులకు ఆరోగ్యవంతమైన పోష్టికాహరాన్ని అందించాలన్న ఆలోచన చేయడం జరిగిందన్నారు. అంగన్‌వాడీ కేంద్రాలను పూర్తి స్థాయిలో సద్వినియోగం చేసుకోవాలని ఆమె కోరారు. జిల్లా మహిళ శిశు సంక్షేమ అధికారిణి జి. ఉమాదేవి మాట్లాడుతూ జిల్లాలోని 1475 అంగన్‌వాడీ కేంద్రాల ద్వారా 10 వేల మందికి పైగా గర్భిణీలకు, 7 వేల మందికి పైగా బాలింతలతో పాటు 7 నెలల నుండి 3 సంవత్సరాల వయస్సు గల సుమారు 97వేల మంది చిన్నారులకు సంపూర్ణ పోష్టికాహారంతో పాటు ఆటపాటలు విద్యాబుద్దులు నేర్పిస్తున్నట్లు ఆమె తెలిపారు. తల్లిపాలు విశిష్టతను చాటిచెప్పెందుకు అన్ని అంగన్‌వాడీ కేంద్రాలలో తల్లిపాల వారోత్సవాలను నిర్వహించి వైద్యుల ద్వారా గర్భిణీలకు, బాలింతలకు తల్లిపాల విశిష్టత ఆరోగ్య సంరక్షణ పై అవగాహన కల్పించడంతో పాటు సాముహిక సీమంతాలు నిర్వహించి గర్భీణీలు బాలింతలకు చిన్నారులకు పోష్టికాహార కిట్లను పంపిణీ చేసిన్నట్లు ఆమె తెలిపారు. అనంతరం గర్భిణీ స్త్రీలకు సాముహిక సీమంతాలను నిర్వహించారు. కార్యక్రమంలో కార్పోరేటర్ ముమ్మనేని ప్రసాద్, మహిళ శిశు సంక్షేమ శాఖ సిడిపివో జి. మంగమ్మ, సూపర్‌వైజర్ రెహన బేగం, అంగన్‌వాడీ సూపర్‌వైజర్లు కార్యకర్తలు మహిళలు పాల్గొన్నారు.