-ప్రస్తుతం ఉన్న వాటి రిపేర్లు, కొత్తవి ఏర్పాటుకు అవసరమైన ప్రతిపాదనలు..
-శాఖల సమన్వయంతో నవ హారతులకు సిద్దం చేయండి..
-జిల్లా కలెక్టర్ డా. జి. సృజన
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
దసరా ఉత్సవాలకు ముందుగానే పవిత్ర సంగమం వద్ద నవ హారతులకు ఏర్పాట్లు పూర్తి చేసి సిద్ధం చేయాలని జిల్లా కలెక్టర్ డా. జి. సృజన అధికారులకు ఆదేశించారు. ఇబ్రహీంపట్నం సమీపంలో కృష్ణా, గోదావరి పవిత్ర సంగమం వద్ద నవ హారతులకు చేయవలసిన ఏర్పాట్లపై దేవాదాయ, ఆర్‌అండ్‌బి, రెవెన్యూ, ఇరిగేషన్, పర్యాటక, పోలీస్, సిఆర్‌డిఏ, ఏడిసి, ట్రాన్స్‌కో అధికారులతో కలెక్టరేట్‌లో శనివారం జిల్లా కలెక్టర్ జి. సృజన సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ దసరా ఉత్సవాల నాటికి ముందుగానే పవిత్ర సంగమం వద్ద నవ హారతులను నిర్వహించేందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేసి సిద్దం చేయాలన్నారు. ప్రస్తుతం ఉన్న వాటికి రిపేర్లు నిర్వహించాలని అవసరమైన వాటికి ప్రతిపాదనలను తయారు చేయాలన్నారు. ఆధ్యాత్మిక, పర్యాటక కేంద్రంగా పవిత్ర సంగమ ప్రదేశాన్ని తీర్చిదిద్దేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటుందన్నారు. దీనిలో భాగంగా నవ హారతులను పునరుద్దరించి పవిత్ర సంగమ ప్రదేశానికి పూర్వ వైభవం తీసుకువచ్చేందుకు శాఖల సమన్వయంతో అన్ని ఏర్పాట్లు చేయాలని ఇందుకు అవసరమైన ప్రతిపాదనలను సోమవారం నాటికి అందజేయాలన్నారు. జాతీయ రహదారి నుండి పవిత్ర సంగమానికి చేరుకునే రెండు వైపుల రహదారికి తాత్కాలిక మరమ్మతులు నిర్వహించి శాశ్వత రహదారి నిర్మాణానికి అవసరమైన ప్రతిపాదనలు రూపొందించాలని ఆర్‌అండ్‌బి అధికారులను కలెక్టర్ ఆదేశించారు. రహదారి కృంగిపోకుండా పటిష్టంగా ఉండేందుకు కాలవగట్లకు బండ్ నిర్మించేందుకు, పాడైన ఘాట్‌లో మరమ్మతులు చేపట్టేందుకు ప్రతిపాదనలు రూపొందించాలని ఇరిగేషన్ అధికారులకు ఆదేశించారు. పవిత్ర సంగమ ప్రాంతంలో విద్యుత్ వెలుగులకు పస్తుత హైమాక్స్ లైట్లకు రిపేర్లు, కొత్తవి ఏర్పాటుకు అవసరమైన ప్రతిపాదనలు రూపొందించాలని ట్రాన్స్‌కో అధికారులను ఆదేశించారు. పర్యాటకులు, భక్తుల కదలికలను ఎప్పటికప్పుడు పరిశీలించేందుకు వీలుగా అవసరమైన సిసికెమెరాలను ఏర్పాటు చేయాలని సిఆర్‌డిఏ అధికారులను కలెక్టర్ ఆదేశించారు. ఆ ప్రాంతంలో ప్రస్తుతం ఉన్న ముళ్ళకంపలు, పొదలను తొలగించి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలని, పర్యాటకులకు భక్తులకు వీలుగా వాష్‌రూమ్స్, డ్రస్ ఛేజ్ రూమ్స్, త్రాగునీటి ఏర్పాటుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని కొండపల్లి మున్సిపల్ అధికారులను ఆదేశించారు. ప్రస్తుతం తాత్కాలిక వైద్య శిభిరాన్ని ఏర్పాటు చేసి శాశ్వత వైద్యకేంద్రానికి అవసరమైన ప్రతిపాదనలు రూపొందించాలని వైద్య శాఖ అధికారులను ఆదేశించారు. భవిష్యత్‌లో పవిత్ర సంగమ ప్రాంతాన్ని ఆధ్యాత్మిక పర్యాటక కేంద్రంగా మరింత అభివృద్ది చేసేందుకు ఇంకనూ అవసరమైన ప్రతిపాదనలు రూపొందించాలని జిల్లా కలెక్టర్ సృజన అధికారులను ఆదేశించారు.
సమావేశంలో జాయింట్ కలెక్టర్ డా. నిధి మీనా, డిఆర్‌వో వి. శ్రీనివాసరావు, ఆలయ ఇవో కె.ఎస్ రామరావు, ఇఇ ఎల్. రమ, ఆర్‌అండ్‌బి ఎస్ ఇ.కె.వి విజయశ్రీ, ఇరిగేషన్ ఇఇ పి.వి.ఆర్. కృష్ణారావు, కొండపల్లి మునిసిపల్ కమీషనర్ బి. రమ్యకీర్తన, సిఆర్‌డిఏ సిఇ పి.శివప్రసాద్‌రాజు, యంపిడివో రామకృష్ణనాయక్, ఏపిసిపిడిసిఎల్ ఇఇ జి.బి. శ్రీనివాసరావు, ఏడి సిసి జెడి వి. ఎస్. ధర్మజ, ఇబ్రహింపట్నం తహాశీల్థార్ వై. వెంకటేశ్వర్లు, సంబంధిత శాఖల అధికారులు ఉన్నారు.