Breaking News

అంతరిక్ష విజ్ఞానంపై అవగాహన పెంపొందించాలి

-విద్యార్థులు శాస్ర్తవేత్తలుగా మారేందుకు ప్రోత్సాహం అందిస్తాం
-రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి  పవన్ కళ్యాణ్ 
– స్పేస్ కిడ్జ్ ఇండియా సంస్థ ప్రతినిధులతో భేటీ
-రాష్ట్రంలో స్పేస్ పార్క్ ఏర్పాటుపై చర్చ

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
అంతరిక్ష పరిశోధన ఫలాలను సక్రమంగా వినియోగించుకుంటే దేశం మరింత అభివృద్ధి పథంలో ముందుకెళ్తుందని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, అటవీ, పర్యావరణ, శాస్ర్త, సాంకేతిక శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. అంతరిక్ష విజ్ఞానంపై విద్యార్థి దశ నుంచే అవగాహన పెంపొందించడం అవసరమన్నారు. శాస్ర్తవేత్తలుగా మారేందుకు అవసరమైన ప్రోత్సాహం అందించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని తెలిపారు. ఆదివారం సాయంత్రం రష్యాకు చెందిన వ్యోమగామి సెర్గి కోర్సకొవ్, స్పేస్ కిడ్జ్ ఇండియా సంస్థ ప్రతినిధులు పవన్ కళ్యాణ్ తో సమావేశమయ్యారు. హైదరాబాద్ లోని ఉప ముఖ్యమంత్రివారి నివాసంలో జరిగిన ఈ సమావేశంలో వాళ్లు చేసిన పరిశోధనలు, తయారు చేసిన శాటిలైట్ల గురించి వివరించారు. ఇటీవల తయారు చేసినా అతి చిన్న శాటిలైట్ డిప్లయర్ ను చూపించి దాని పనితనాన్ని వివరించారు.
• స్పేస్ పార్క్ ఏర్పాటు చేయాలి
అంతరిక్ష విజ్ఞానంపై విద్యార్థులకు ఆసక్తి పెంచాలంటే రాష్ట్రంలో స్పేస్ పార్క్ ఏర్పాటు చేయాలని స్పేస్ కిడ్జి ఇండియా వ్యవస్థాపకురాలు, సీఈవో డా. కేశన్ కోరారు. స్పేస్ పార్క్ నాసా లో మాత్రమే ఉందని, మన దేశంలో ఎక్కడా లేదని తెలిపారు. ఆంధ్రప్రదేశ్ లో ఏర్పాటు చేస్తే విద్యార్థులకు అంతరిక్ష రంగంపై మరింత అవగాహన పెంచవచ్చని అన్నారు. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సానుకూలంగా స్పందించారు.
• రష్యా వ్యోమగామికి సత్కారం
ఈ సందర్భంగా వ్యోమగామి సెర్గి కోర్సకొవ్ ను పవన్ కళ్యాణ్ సత్కరించారు. చంద్రయాన్ -3 రాకెట్ నమూనాను బహుకరించారు. సెర్గి ఆరు నెలలపాటు అంతరిక్షంలో ఉన్నారు. అక్కడి విశేషాలను, అంత కాలం ఏ విధంగా ఉండగలిగారు, అక్కడ పరిశోధించిన అంశాల గురించి పవన్ కళ్యాణ్ ఆసక్తిగా తెలుసుకున్నారు. ఆయన కోసం ప్రత్యేకంగా తయారు చేయించిన రష్యన్ వంటకాలను రుచి చూపించారు. ఈ సమావేశంలో స్పేస్ కిడ్జ్ ఇండియా ప్రతినిధులు సభ్యులు యజ్ఞసాయి, ఎస్.బి. అర్జునర్, సాయి తన్య తదితరులు పాల్గొన్నారు.

Check Also

మద్దిరాలపాడు పర్యటనలో…

ఒంగోలు, నేటి పత్రిక ప్రజావార్త : మద్దిరాలపాడు పర్యటనలో భాగంగా తాళ్లూరి జగ్గయ్య (67), పార్వతి దంపతుల ఇంటికి ముఖ్యమంత్రి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *