అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
ఆంధ్రప్రదేశ్ ను బెస్ట్ ఎనర్జీ ఎఫిషియంట్(ఉత్తమ ఇంధన సామర్థ్యం) రాష్ట్రంగా మార్చుతామని సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. రాష్ట్రంలో ఎలక్ట్రానిక్ రంగంలో మార్పులకు శ్రీకారం చుట్టామని అన్నారు. సచివాలయంలో ఈఈఎస్ఎల్(ఎనర్జీ ఎఫిషియన్సీ సర్వీసెస్ లిమిటెడ్) సీఈఓ విశాల్ కపూర్, ఆ సంస్థ ప్రతినిధులతో సీఎం చంద్రబాబు మంగళవారం సమావేశమై రాష్ట్రంలో ఎనర్జీ ఎఫిషియన్సీ పెంచడానికి చేపట్టే కార్యక్రమాలపై చర్చించారు. పీఎంఏవై పథకంలో భాగంగా ఇళ్లకు ఇంధన సామర్థ్య పరికరాలు సబ్సీడీలో అందించడం, సబ్సీడీలో ఈ-సైకిల్, ప్రభుత్వ ఉద్యోగులకు విద్యుత్ పరికరాలు సబ్సీడీలో అందజేయడంతో పాటు పలు అంశాలపై ఈఈఎస్ఎల్ సంస్థ ప్రతినిధులు సీఎంతో చర్చించారు. ఎలక్ట్రిక్ సైకిళ్లను సబ్సీడీలో డ్వాక్రా మహిళలకు, విద్యార్థులకు అందిస్తామని ఈఈఎస్ఎల్ సంస్థ పేర్కొంది. ఈ మేరకు ఎలక్ట్రికల్ సైకిల్ మోడల్స్ ను సీఎంకు చూపించారు. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు మాట్లాడుతూ….ఈఈఎస్ఎల్ తో గృహ నిర్మాణ, ఇంధన, పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి, మున్సిపల్ సహా పలు కీలక విభాగాలు కలిసి పనిచేస్తాయన్నారు. ఇంధన సామర్థ్యంలో రాష్ట్రానికి మళ్లీ పూర్వ వైభవాన్ని తీసుకొచ్చేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. ప్రజలకు, ప్రభుత్వానికి ఆర్థికంగా, పర్యావరణ పరంగా లబ్ధి చేకూరేలా విధానాలు ఉండాలని, ఆ మేరకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలని ఈఈఎస్ఎల్ ప్రతినిధులకు సూచించారు. ఆర్టీసీలో కూడా పెద్ద ఎత్తున విద్యుత్ వాహనాలను ప్రమోట్ చేస్తున్నామని, ప్రభుత్వ భవనాల్లో కూడా సోలార్ వినియోగం పెంచబోతున్నట్లు తెలిపారు. ఎనర్జీ జనరేషన్ తో పాటు సేవింగ్ కూడా ముఖ్యమని సీఎం అన్నారు. స్వల్పకాలి ప్రయోజనాలతో పాటు దీర్ఘకాలిక ప్రయోజనాలను కూడా దృష్టిలో పెట్టుకుని నిర్ణయాలు తీసుకుంటున్నామన్నారు. గతంలో రాష్ట్రంలో 25 లక్షల ఎల్ఈడీ వీధి దీపాలు ఏర్పాటు చేశామని, కానీ తర్వాత వచ్చిన ప్రభుత్వం వాటి నిర్వహణను గాలికొదిలేసిందని అన్నారు. దీని వల్ల 60 శాతం వీధి దీపాలు మాత్రమే వెలుగుతున్నాయని అన్నారు. త్వరలో మళ్లీ ఎల్ఈడీ దీపాల వెలుగులు తెచ్చేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు సీఎం వివరించారు. ఈ కార్యక్రమంలో సంస్థ సీఈఓ విశాల్ కపూర్, ప్రతినిధులు పాల్గొన్నారు.
Tags amaravathi
Check Also
నారావారిపల్లె గ్రామపంచాయతీ అభివృద్ధికి దిశా నిర్దేశం
తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : చంద్రగిరి మండలం నారావారిపల్లి గ్రామపంచాయతీ స్వర్ణ నారావారిపల్లె విజన్ లో భాగంగా ఆదర్శవంతంగా …