-రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్యం, ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ మంత్రి టి.జి భరత్
-ఓర్వకల్లు, కొప్పర్తి, చిత్తూరు, తిరుపతి, విజయవాడ, గుంటూరు, పుట్టపర్తి, అనంతపురం పారిశ్రామిక పార్కులపై రివ్యూ
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
రాష్ట్రంలోని ఇండస్ట్రియల్ పార్కులలో సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్యం, ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ మంత్రి టి.జి భరత్ అన్నారు. మంగళగిరిలోని ఏపీఐఐసీ కార్యాలయంలో తిరుపతి, చిత్తూరు, విజయవాడ, గుంటూరు, కర్నూలు, కడప, పుట్టపర్తి, అనంతపురం ఇండస్ట్రియల్ పార్కుల జీ.యంలు, జెడ్.యంలతో మంత్రి టి.జి భరత్ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఓర్వకల్లు, కొప్పర్తితో పాటు ఇతర ఇండస్ట్రియల్ పార్కుల స్థలాలపై ఆరా తీశారు. ఏ పార్కులో ఎంత ల్యాండ్ ఉందో వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఇండస్ట్రియల్ పార్కు స్థలాలు ఆక్రమణకు గురికాకుండా చూసుకోవాలన్నారు. అన్ని మౌలిక సదుపాయాలు కల్పించాలని చెప్పారు. దీంతోపాటు ఏపీఐఐసీ భూముల కోర్టు కేసులపై మంత్రి వివరాలు అడిగారు. పార్కుల వద్ద ఆర్చ్ ఏర్పాటుచేసి ఎంత విస్తీర్ణం ఉందో వివరాలతో పాటు, మ్యాప్ పెట్టాలని సూచించారు. ఇండస్ట్రియల్ పార్కులను అభివృద్ధి చేస్తేనే పరిశ్రమల ఏర్పాటుకు పారిశ్రామికవేత్తలు ముందుకు వస్తారన్నారు. సీఎం చంద్రబాబు నాయకత్వంలో పరిశ్రమలు పెట్టేందుకు పారిశ్రామికవేత్తలు ఏపీకి వస్తున్నారన్నారు.