-ప్రస్తుతం ఉన్న మద్యం పాలసీపై కెబినెట్ సబ్ కమిటీ సమీక్ష
-జిఓ విడుదల చేసిన ముఖేష్ కుమార్ మీనా
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
రాష్ట్రంలో నూతన మద్యం విధానం రూపకల్పనకు మంత్రివర్గ ఉప సంఘంను నియమిస్తూ ఆబ్కారీ శాఖ ముఖ్య కార్యదర్శి ముఖేష్ కుమార్ మీనా ఉత్తర్వులు జారీ చేసారు. ఐదుగురు మంత్రులతో కూడిన సబ్ కమిటీలో సభ్యులుగా మంత్రులు కొల్లు రవీంద్ర, నాదెండ్ల మనోహర్, కొండపల్లి శ్రీనివాస్, సత్యకుమార్ యాదవ్, గొట్టిపాటి రవిలను నియమించారు. ప్రస్తుతం ఉన్న మద్యం పాలసీని ఈ మంత్రివర్గ ఉప సంఘం సమీక్షించనుంది. వివిధ రాష్ట్రాల్లో ఉన్న మద్యం పాలసీలు, మద్యం దుకాణాలు, బార్లు, బెవరేజెస్ కంపెనీలు వంటి వాటిల్లో వివిధ రాష్ట్రాలు అమలు చేస్తున్న విధానాలను పరిశీలించనుంది. ఇప్పటికే వివిధ రాష్ట్రాల్లో పర్యటించి అధ్యయనం చేసి ఇచ్చిన అధికారుల నివేదికను పరిశీలించనుంది. మద్యం విధాన రూపకల్పనలో భాగంగా వివిధ వర్గాల నుంచి మంత్రి వర్గ సబ్ కమిటీ అభిప్రాయాలు సేకరించనుందని మీనా ఆ ఉత్తర్వులలో పేర్కొన్నారు. అత్యంత ఉత్తమమైన మద్యం పాలసీని తీసుకు రావాలన్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆలోచనలకు అనుగుణంగా అధికార యంత్రాంగం ఈ ఆదేశాలు జారీ చేసింది