-రోజంతా కమాండ్ కంట్రోల్ సెంటర్ నుండి వ్యక్తిగత పర్యవేక్షణ
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
తుఫాను నేపధ్యంలో రాష్ట్రం అతాకుతలం అవుతుండగా విపత్తుల నిర్వహణ (రెవిన్యూ) ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్ పి సిసోడియా సహాయక చర్యల కోసం నేరుగా రంగంలోకి దిగారు. అతి భారీ వర్షాలు కురుస్తున్న నేపధ్యంలో ఉదయం నుండే అయా జిల్లాల యంత్రాంగాలను అప్రమత్తం చేస్తూ వచ్చిన సిసోడియా, శనివారం విపత్తుల నిర్వహణ సంస్ధ కార్యాలయం నుండి పరిస్ధితిని సమీక్షిస్తూ వచ్చారు. రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాలపై జిల్లా కలెక్టర్లను అప్రమత్తం చేసారు. అధికారులను సహాయ పునరావాస చర్యలలో నిమగ్నం అయ్యేలా అదేశాలు ఇచ్చారు. సిసోడియా విపత్తుల నిర్వహణ సంస్ధ లో ఏర్పాటు చేసిన కంట్రోల్ రూమ్ నుండి వివిధ శాఖల అధికారులతో టెలికాన్ఫరెన్ ద్వారా పలు సూచనలు చేసారు. విజయవాడ మొగల్రాజపురం సమీపంలోని సున్నం బట్టీల సెంటర్ వద్ద భారీవర్షాల కారణంగా కొండ చరియలు విరిగిపడ్డ సమాచారంతో నేరుగా అక్కడికి వెళ్లిన సిసోడియా, సహాయకచర్యలను పర్యవేక్షించి క్షత గాత్రులకు మెరుగైన వైద్య సహాయం అందించాలని జిల్లా కలెక్టర్ సృజనను అదేశించారు. ఈ సంఘటనలో నలుగురు మృతి చెందగా ముఖ్యమంత్రి ఒక్కొక్కరికి రూ. ఐదు లక్షల సహాయం ప్రకటించారు.
నగరంలోని లోతట్టు ప్రాంతాలను స్వయంగా పరిశీలించిన ఆయన, ఎప్పటి కప్పుడు తాజా సమాచారాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి అందిస్తూ, ఆయన ఆదేశాలకు అనుగుణంగా అధికారులకు సూచనలు చేసారు. చరవాణి సమీక్షలో అధికారులతో మాట్లాడుతూ ప్రజలు అప్రమత్తం చేయవలసిన బాధ్యత అందరిపైనా ఉందన్నారు. ప్రత్యేకించి ప్రాణనష్టం తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని, విద్యుత్త్ శాఖ ఈ విషయంలో కీలకంగా వ్యవహరించాలని స్ఫష్టం చేసారు. అపాయకర విద్యుత్త్ లైన్లను గుర్తించి తదనుగుణ చర్యలు తీసుకోవాలన్నారు. వృక్షాలు నేలకూలి, కరెంట్ తీగలు తెగిపడి ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని, మరోవైపు విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడితే తక్షణమే స్పందించేలా అధికారులు సిబ్బందితో సిద్ధంగా ఉండాలన్నారు.
అవసరమైన మేరకు పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేసి ఆ సమాచారాన్ని ప్రజలకు తెలిసేలా ప్రచారం చేయాలని సూచించారు. ఎదురయ్యే సమస్యలను ముందుగానే గుర్తించి ఎటువంటి ఇబ్బందులు కలగకుండా అన్ని రకాల ముందస్తు చర్యలు తీసుకోవాలన్నారు. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో రాష్ట్ర వ్యాప్తంగా మరో రెండు మూడు రోజుల భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తున్నాయని తెలిపారు. భారీ వర్ష సూచనలు కొనసాగుతాయన్న వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో లోతట్టు ప్రాంత ప్రజలను అప్రమత్తం చేయాలన్నారు. మత్స్యకారుల వేటకు వెళ్లకుండా చూడాలని, అవసరమైన సహాయక చర్యలు చేపట్టేందుకు అత్యవసర బృందాలను సిద్ధంగా ఉంచాలని కలెక్టర్లకు సూచించారు. వాగులు, వంకల వద్ద హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయాలన్నారు. మ్యాన్ హోల్సు వద్ద సూచికలు ఏర్పాటు చేయాలన్నారు. లోతట్టు ప్రాంతాలు, రోడ్లపై నీరు నిల్వ ఉండకుండా అన్ని చర్యల తీసుకోవాలని ఆదేశించారు. డ్రైనేజీ వ్యవస్థకు ఆటంకం లేకుండా పారిశుధ్య పనివార్లను సిబ్బందిని అప్రమత్తం చేయాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు.