-రేపు పాఠశాలలు, ఇంటర్మీడియట్ కళాశాలలకు సెలవు
-పరిస్థితుల దృష్ట్యా మీకోసం కార్యక్రమం రద్దు
మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త :
అధిక వర్షాలు, వరదల నేపథ్యంలో లోతట్టు ప్రాంత ప్రజలను దగ్గరలోని సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు చర్యలు తీసుకున్నామని, వరద ఉధృతని ఎదుర్కొనేందుకు, ప్రజలను రక్షించేందుకు జిల్లా యంత్రాంగం నిత్యం అప్రమత్తంగా ఉందని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ స్పష్టం చేశారు. ఆదివారం సాయంత్రం జిల్లా కలెక్టర్ కలెక్టరేట్లోని కాన్ఫరెన్స్ హాల్ లో మీడియా సమావేశం నిర్వహించి అధిక వర్షాలు, వరదలపై తాజా పరిస్థితులను వెల్లడించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో వర్షాలు తగ్గుముఖం పట్టినప్పటికీ, కృష్ణానదికి ఎగువ నుంచి వరద ప్రవాహం కొనసాగడంతో దిగువన వరద ఉధృతి ఎక్కువగా పెరుగుతూ ఉందని తెలిపారు. ఈ నేపథ్యంలో లోతట్టు ప్రాంత లంక గ్రామాలలోని ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు గ్రామానికి ఒక బృందం చొప్పున అధికారులను నియమించడం జరిగిందన్నారు. ఆ బృందం ఇప్పటికే ఆయా గ్రామాలలో బోట్లు, బస్సులతో సిద్ధంగా ఉన్నారని, గత అనుభవాలతో ప్రస్తుత పరిస్థితులను తేలికగా తీసుకోవద్దని, ప్రజలందరూ అధికారులకు సహకరించి సురక్షిత ప్రాంతాలకు చేరుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఇప్పటికే జిల్లాలో దాదాపు 30కి పైగా పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేసి ప్రజలను తరలించామని, అక్కడ వారికి భోజనం, తాగునీరు ఇతర సదుపాయాలను కల్పించడం జరిగిందన్నారు. ప్రస్తుతం బుడమేరు పొంగి ప్రవహిస్తున్న నేపథ్యంలో జిల్లాలోని బుడమేరుపై 9 వంతెనలు ఉన్నాయని, అక్కడ ఎలాంటి ప్రమాదాలు జరగకుండా ఉండేందుకు పోలీసు, రెవెన్యూ సిబ్బందిని ఏర్పాటు చేసి ఆ వంతెనలపై రాకపోకలను నిషేధించినట్లు తెలిపారు.
కృష్ణానది పరివాహక ప్రాంతంలో వరద ప్రమాదాలను నిరోధించేందుకు బలహీనంగా ఉన్న కట్టలను ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన బృందాలతో ప్రదేశాలను గుర్తించామని, కట్టలను పట్టిష్టపరిచేందుకు ఇసుక బస్తాలు, ఇతర సామాగ్రిని సిద్ధంగా ఉంచినట్లు తెలిపారు. ప్రస్తుత పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని రేపు సోమవారం అన్ని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు, ఇంటర్మీడియట్ కళాశాలలకు సెలవు ప్రకటించినట్లు వెల్లడించారు. ప్రైవేట్ విద్యాసంస్థలు దీనిని ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అదేవిధంగా సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక మీకోసం కార్యక్రమం రద్దు చేసినట్లు తెలిపారు. ప్రజలు దీనిని గమనించి సహకరించాలని కోరారు. వాతావరణ పరిస్థితుల దృష్ట్యా మత్స్యకారులు ఎవరూ వేటకు వెళ్ళొద్దని, పంట్లు, నాటుపడవలతో నదిలో ప్రయాణించవద్దని సూచించారు. వరద నీటిలో ఈతకు వెళ్ళడం, స్నానాలకు వెళ్ళడం లాంటివి చేయరాదని, పశువులు, గొర్రెలు, మేకలు వంటి జంతువులను ముంపు ప్రాంతాల నుంచి సురక్షిత ప్రాంతలకు తరలించాలని అధికారులను ఆదేశించినట్లు తెలిపారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే జిల్లా యంత్రాంగానికి స్పష్టమైన ఆదేశాలు ఇచ్చిందన్నారు. అత్యవసరమైతే తప్ప ప్రజలు ఎవరూ ఇంటి నుంచి బయటకు రావద్దని విజ్ఞప్తి చేశారు.