అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు బుడమేరు వరద ముంపు ప్రాంతాల్లో ఏరియల్ పర్యటన జరిపారు. గన్నవరం ఎయిర్ పోర్టు నుంచి హెలికాఫ్టర్ ద్వారా బయలుదేరి ముంపు ప్రాంతాలను పరిశీలించారు. మధ్యాహ్నం 2.15 గంటల నుంచి గంటన్నరపాటు ముఖ్యమంత్రి ఆయా ప్రాంతాలను పరిశీలించారు. ముందుగా బుడమేరు డ్రైన్ కు గండ్లు పడిన ప్రాంతాలను పరిశీలించారు. భారీ వరద, గండ్లు కారణంగా ఏయే ప్రాంతాలు నీటమునిగాయి అనేది పరిశీలించారు. బుడమేరు ప్రవాహాలు, వరద ఎటునుంచి ఎటు వెళ్తుంది అనేది పరిశీలించారు. బుడమేరు ఆక్రమణ తీరుపై తనతో పాటు ఉన్న అధికారులను అడిగి తెలుసుకున్నారు. అటునుంచి ప్రకాశం బ్యారేజ్ దిగువ ప్రాంతాల్లో చంద్రబాబు హెలికాప్టర్ పర్యటన సాగింది. బ్యారేజ్ దిగువన కృష్ణా నదీ లంక గ్రామాలను పరిశీలించారు. కృష్ణా నది సముద్రంలో కలిసే హంసల దీవి ప్రాంతాన్ని చూశారు. తరువాత కొల్లేరు ప్రాంతాన్ని పరిశీలించారు. కొల్లేరు పరిసర ప్రాంతాల్లో వరద తాకిడిని పరిశీలించారు. ఈ సందర్భంగా గతంలో వచ్చిన ప్రవాహాలు, ఇతర సమాచారాన్ని అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఏయే ప్రాంతాల్లో ఎంత మేర పంటలు నీట మునిగాయి అనేది కూడా పరిశీలించారు.
సరుకుల పంపిణీలో పాల్గొన్న సిఎం
అనంతరం ముఖ్యమంత్రి గన్నవరం ఎయిర్ పోర్ట్ నుంచి మధురానగర్ వచ్చారు. అక్కడ స్థానికులతో మాట్లాడి సహాయక చర్యలు, ప్రభుత్వం నుంచి అందుతున్న సాయం, పారిశుధ్యం తదితర పనులను పరిశీలించారు. అక్కడ నుంచి సింగ్ నగర్ వెళ్లిన ముఖ్యమంత్రి వంతెన కింద నిత్యావసరాల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా పలువురు మహిళలతో సిఎం మాట్లాడారు. మొదటి రెండు రోజులు ఇబ్బందులు పడినా..తరువాత ప్రభుత్వం నుంచి వస్తున్న సాయం పట్ల వాళ్లు సంతృప్తి వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రికి ధన్యవాదాలు తెలిపి ఆయనతో కరచాలనం చేశారు. ప్రభుత్వం ఉచితంగా ఇస్తున్న 6 నిత్యావసర వస్తువులు ఉన్న బండిని తోసుకుంటూ వెళ్లి కొందరికి అందజేశారు. వాటి నాణ్యత గురించి అడిగి వివరాలు తెలుసుకున్నారు. అనంతరం కలెక్టరేట్ కు వచ్చిన సిఎం సరుకుల పంపిణీ, పారిశుధ్య కార్యక్రమంపై సమీక్ష నిర్వహించారు.
Prajavartha Online Telugu News