-రాష్ట్ర రవాణా శాఖ మంత్రి మండిపల్లి రామ్ ప్రసాద్ రెడ్డి
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
వరద ముంపు ప్రభావిత ప్రాంతాల్లో ఆర్టీసీ ఉద్యోగులు చేసిన సేవలు అభినందనీయమని ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర రవాణా శాఖా మాత్యులు మండిపల్లి రామ్ ప్రసాద్ రెడ్డి అన్నారు. ఈ రోజు విద్యాధరపురంలోని ఆర్టీసీ సెంట్రల్ ఆసుపత్రిని ఆయన సందర్శించి వరదల వలన నష్ట పోయిన అన్ని విభాగాలను పరిశీలించారు. హాస్పిటల్ అధికారులతో, సిబ్బందితో మాట్లాడి అక్కడి పరిస్థితిని సమీక్షించారు. అనంతరం అధికారుల ఏర్పాటు చేసిన బస్సులో ప్రయాణించి విద్యాధరపురం డిపో, ట్రాన్స్ పోర్ట్ అకాడెమీ, జోనల్ స్టోర్స్,TYRES విభాగం, మరియు స్క్రాప్ యార్డు ప్రాంతాలను సందర్శించి, అక్కడి పరిస్ధితులను గమనించి వరద వలన ఆర్టీసీకి జరిగిన నష్టాన్ని స్వయంగా తిలకించారు.
అనంతరం మీడియా సమావేశంలోరవాణా శాఖ మంత్రి రామ్ ప్రసాద్ రెడ్డి మాట్లాడుతూ “గత10రోజులుగా విజయవాడలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా ఆర్టీసీ తీవ్రంగా నష్ట పోయిందని, ముఖ్యంగా 20 ఎకరాల పైబడి వున్న విద్యాధరపురం డిపో, పరిసరాలు పూర్తిగా నీట మునగడం పట్ల చాలా ఆవేదన వ్యక్తపరిచారు. ఈ పరిస్థితిని తానే స్వయంగా ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడుని కలిసి వివరిస్తానని తెలిపారు. మా అంచనా ప్రకారం ఏ.పి.ఎస్.ఆర్.టి.సి. కి సుమారుగా ఈ 10 రోజుల్లో రూ.30 కోట్లకు పైనే నష్టం జరిగిందని భావిస్తున్నట్లు ఆయన తెలియజేశారు. ఇలాంటి పరిస్థితుల్లో ఆర్టీసీని ఆదుకోవడానికి సెంట్రల్ డిజాస్టర్ ఫండ్ ద్వారా భర్తీ చేయమని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్తానని హామీ ఇచ్చారు. భారీగా కురిసిన వర్షాల వలన బస్సులు లేక ప్రయాణికులకు చాలా ఇబ్బందులు తలెత్తాయని ఆ విషయంలో చాలా చింతిస్తున్నట్లు వివరించారు. డిపోలోనూ, వర్క్ షాప్ లోనూ, హాస్పిటల్ లోనూ నీరు నిలిచిపోవడం వలన డిపో నిర్వహణకు ఇబ్బంది తలెత్తినదని వీలైనంత త్వరగా ఈ పరిస్థితిని అధిగమించి డిపో యధా స్థితికి వచ్చేలా చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు.
ఇంతకు ముందెన్నడూ లేని విధంగా విజయవాడలో వరదలు వలన అపార నష్టం జరిగిందని, వరద ప్రభావిత ప్రాంతాలలో ఆర్టీసీ మరియు ఆర్టీసీ ఉద్యోగులు చేసిన సేవలు అభినందనీయమని ఆయన తెలిపారు. అంతేకాకుండా వరద బాధిత ప్రాంతాల్లో 25 ఉచితబస్సులు ఏర్పాటు చేసి వివిధ ప్రాంతాలకు వారిని తరలించేందుకు ఆర్టీసీ ప్రత్యేక చర్యలు తీసుకుందని వివరించారు. వారందరికీఆర్టీసీ DGTల రవాణా ద్వారా నిత్యవసర వస్తువులు తరలించడంలో కూడా ఆర్టీసీ అధికారులు, వుద్యోగుల పాత్ర చాలా ఉందని ఆయన వివరించారు. అధే విధంగా, శానీటరీ సిబ్బంది కోసం 250 బస్సులను కూడా APSRTC ఏర్పాటు చేసింది. ఏది ఏమైనా కానీ ఆర్టీసీకి జరిగిన నష్టాన్ని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్ళి ఆదుకుంటామని రవాణా శాఖా మంత్రి ఎం. రామ్ ప్రసాద్ రెడ్డి తెలిపారు.
ఈ సందర్శనలో మంత్రి వెంట సంస్థ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్లు కె.ఎస్.బ్రహ్మానందరెడ్డి (అడ్మిన్), జి.వి.రవి వర్మ (ఇంజినీరింగ్), చంద్ర శేఖర్ (ఆపరేషన్స్) విజయవాడ జోన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ గోపీనాథ్ రెడ్డి మరియు ఎన్టీఆర్ జిల్లా ప్రజా రవాణా అధికారి ఎం.వై.దానం, తదితర అధికారులు, ఆర్టీసీ సిబ్బంది పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News