Breaking News

తితిదే లడ్డూ వివాదానికి స్వస్తి పలకాలి

-సిట్‌ దర్యాప్తులో దోషులపై కఠిన చర్యలు చేపట్టాలి
-అందరివాడైన వెంకటేశ్వర స్వామికి మత రాజకీయాలు ఆపాదించడం తగదు
-తిరుమలకు జగన్‌ వెళ్తే అపవిత్రమనే వ్యాఖ్యలు తగదు
-సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
తిరుమల లడ్డూ వివాదం వ్యవహారంలో సీఎం చంద్రబాబు, ప్రభుత్వ పెద్దలు హుందాతనంగా వ్యవహరించి, ఈ అంశానికి స్వస్తిపలికేలా చూడాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ సూచించారు. సిట్‌ దర్యాప్తులో ఎంతటి పెద్దవారున్నారని తేలినప్పటికీ, వారిపై క్రిమినల్‌ చర్యలు తీసుకోవాలని, మతపరమైన వివాదాలకు తెరదించాలని కోరారు. విజయవాడ దాసరిభవన్‌లో శుక్రవారం పార్టీ రాష్ట్ర సహాయ కార్యదర్శి ముప్పాళ్ల నాగేశ్వరరావుతో కలిసి ఆయన విలేకరులతో మాట్లాడారు. రామకృష్ణ మాట్లాడుతూ, రాజకీయాలను, మతాన్ని రెండూ కలగలిపి చేసే ప్రకటనలను విడనాడాలని హితవు పలికారు. గత వారం రోజులుగా తిరుమల లడ్డూ సమస్య చుట్టూనే మీడియా, రాజకీయ నాయకుల వ్యాఖ్యలు తిరుగుతున్నాయని తెలిపారు. ఏదైనా కల్తీ జరిగిందనే దానిపై దర్యాప్తు చేయించాల్సిందేనని, ఇప్పటికే సీఎం చంద్రబాబు సిట్‌ దర్యాప్తునకు ఆదేశించారని, ముగ్గురు సీనియర్‌ ఐపీఎస్‌ అధికారులతో కమిటీ వేశారని గుర్తుచేశారు. ఆ కమిటీ నివేదిక ఆధారంగా ఎవరి పాత్ర ఉందో, వారిపై చర్యలు తీసుకోవాల్సి ఉందన్నారు. కోట్లాది మంది భక్తుల మనోభావాలు దెబ్బతినకుండా చర్యలు తీసుకోవాలని, ఈ విషయంతోపాటు కల్తీ ఎక్కడ జరిగినా చర్యలకు ఉపక్రమించాలని చెప్పారు. అంతేగానీ మొత్తం లడ్డూ సమస్య చుట్టూనే తిరుగుతూ మాట్లాడటం తగదన్నారు. ముఖ్యమంత్రి నుంచి మాజీ ముఖ్యమంత్రి వరకు అదే మాట్లాడతారని, అటు మంత్రులు, ఎమ్మెల్యేలకు ఇంకేమీ పనిలేనట్లుగా వ్యాఖ్యలు చేస్తున్నారని చెప్పారు. పార్టీ అధినేతలూ అదే ధోరణితో ఉన్నారని, అసలు దీనికి అంతూ..పంతూ ఉందా?, మీరేం మాట్లాడుతున్నారో మీకేమైనా తెలుస్తుందా? అని రామకృష్ణ ప్రశ్నించారు. నేతలు ఒకరికి మించి ఒకరు దిగజారి మాట్లాడుతున్నారని మండిపడ్డారు. వెంకటేశ్వర స్వామి దగ్గరకు మాజీ సీఎం జగన్‌ వెళ్తే అపవిత్రమవుతుందంటూ కొందరు వ్యాఖ్యానించడాన్ని తప్పుపట్టారు. వెంకటేశ్వర స్వామి దగ్గరకూ అందరూ వెళ్లొచ్చని తెలిపారు. పుణ్యాత్ములు, పాపాత్ములు, డబ్బున్నవారు, లేని వారంతా శ్రీవారిని దర్శించుకోవచ్చని, అందర్నీ ఆదర్శించేవారే వెంకటేశ్వర స్వామి అని స్పష్టంచేశారు. మరో అధికార ప్రతినిధేమో..జగన్‌ భార్య క్రైస్తవులు అయినప్పుడు..జగన్‌ తిరుమలకు ఎలా వెళ్తాడంటూ వ్యాఖ్యలు చేయడాన్ని రామకృష్ణ తప్పుపట్టారు. డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ భార్య క్రైస్తవులు కాదా?, మరి ఆయన తిరుమలకు ఎలా వెళ్తున్నాడని ప్రశ్నించారు. నాడు వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి ఐదేళ్లపాటు ముఖ్యమంత్రిగా ఉండి..శ్రీవారికి పట్టు వస్త్రాలు సమర్పించిన విషయాన్ని గుర్తుచేశారు. ఆ తర్వాత జగన్‌ ఐదేళ్లపాటు సీఎంగా ఉండి స్వామి వారికి పట్టు వస్త్రాలను ఇచ్చారని, పట్టు వస్త్రాలు ఇవ్వడమంటేనే ఒక ప్రాధాన్యతగల అంశమని చెప్పారు. అప్పుడు జగన్‌పై ఏమీ మాట్లాడకుండా, నేడు సాధారణ భక్తుని వలే తిరుమలకు జగన్‌ వెళ్తానంటే డిక్లరేషన్‌ ఇవ్వాలని అడగటమేమిటని, ఇది సరైన పద్ధతి కాదని చెప్పారు. సీఎం చంద్రబాబు సుదీర్ఘకాలంపాటు సీఎంగా ఉన్న వ్యక్తి, దేశంలోనే సీనియర్‌ లీడర్‌ అని, ఇలాంటి అంశాల్ని అదుపు చేయాల్సిన అవసరముందని సూచించారు. రాష్ట్రంలో చంద్రబాబు ప్రభుత్వానికి మంచి అవకాశం వచ్చిందని, ఎన్నో సమస్యలు పరిష్కరించాల్సి ఉందని చెప్పారు. ఇటీవల వరదల బాధితుల సాయంలో గిరిజన ప్రాంతాలకు ఒక్క రూపాయి అందలేదని, బాధితులంతా గగ్గోలు పెడుతున్నారని మండిపడ్డారు. ప్రజా సమస్యల పరిష్కారంపై దృష్టి సారించాలని, ప్రజల మధ్య భావోద్వేగాలు సృష్టించడం, మతం, కులాలను రెచ్చగొట్టే చర్యలను విడనాడాలని కోరారు. అసలు వెంకటేశ్వర స్వామి అందరిని ఆదర్శించేవాడని, మీరు ఆ స్వామిని ముందుపెట్టి రాజకీయాలు చేయడం, దాని చుట్టూనే మాట్లాడటం తగదని మండిపడ్డారు. ఇప్పటికే సిట్‌ ద్వారా దర్యాప్తునకు ఆదేశించినందువల్ల వెంటనే నివేదికలు రప్పించుకోవాలని కోరారు. ఇక మతం అజెండాతో రాజకీయాలు చేయడం సరికాదన్నారు. దేవాలయాలను కేంద్రం పరిధిలోకి తీసుకుంటామని చెబితే, ఇంకా దానికి జవాబేమి ఉంటుందన్నారు. అందుకే ఈ తరహా వివాదాలకు స్వస్తిపలకాలని సూచించారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

విశాఖ రైల్వేజోన్‌ ఏర్పాటు చేస్తూ గెజిట్‌ విడుదలపై సీఎం చంద్రబాబు హర్షం

-రాష్ట్ర ప్రజల చిరకాల స్వప్నం నెరవేరిందని ముఖ్యమంత్రి వ్యాఖ్య అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : విశాఖ కేంద్రంగా దక్షిణ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *