-క్షేత్రస్థాయిలో చంపావతి నదీ కాలుష్య పరిస్థితి స్వయంగా పరిశీలన
-ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న వారిని పరామర్శించిన పవన్ కళ్యాణ్
-జిల్లా అధికారులతో తాగునీటి సరఫరా మెరుగుదలపై విస్తృతంగా సమీక్ష
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
తాగునీటి సరఫరాలో జరిగిన కొన్ని లోపాల కారణంగా అతిసారం బారిన పడి ప్రాణాలు కోల్పోయిన కుటుంబాలకు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నేనున్నాననే భరోసా నింపారు. విజయనగరం జిల్లా గుర్ల గ్రామంలో ఇటీవల అతిసారం ప్రబలి పలువురు మృతి చెందారు. మరికొందరు ఆస్పత్రి పాలయ్యారు. ప్రభుత్వం తరఫున పవన్ కళ్యాణ్ సోమవారం గుర్ల ప్రాంతంలో క్షేత్రస్థాయిలో పరిస్థితిని పరిశీలించారు. అధికారులతో సమీక్ష చేసి అతిసారానికి గల కారణాలు తెలుసుకున్నారు. విజయనగరం కలెక్టరేట్లో జిల్లా అధికారులతో సమీక్ష నిర్వహించారు. బాధితులతో మాట్లాడటమే కాదు… క్షేత్రస్థాయిలో తాగునీటి సరఫరా జరుగుతున్న తీరును ఆయన క్షుణ్నంగా తెలుసుకునే ప్రయత్నం చేశారు. మృతుల కుటుంబాలతో మాట్లాడి వారికి తగిన భరోసా కల్పించారు. ప్రభుత్వం పరిహారం అందించే లోగా తన సొంత డబ్బు నుంచి మృతుల కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ.లక్ష సాయం ప్రకటించి మరోసారి తన ఉదారతను చాటారు.
నీటి పరీక్షలు చేయించి.. కాలుష్యాన్ని పసిగట్టి…
విశాఖపట్నం విమనాశ్రయం నుంచి నేరుగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గుర్ల పర్యటనకు వెళ్లారు. దారి వెంబడి పార్టీ శ్రేణులు ఆయనకు స్వాగతం పలికారు. కారు అద్దం నుంచే వారికి అభివాదం చేస్తూ ముందుకు కదిలారు. మొదటిగా నెల్లిమర్ల ఆర్ఎస్ రైల్వే స్టేషన్ సమీపంలో చంపావతి నది పై ఉన్న ఎస్ఎన్ రక్షిత మంచి నీటి పథకం పంపింగ్ హౌస్ ను ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు పరిశీలించారు. అక్కడ నీటి శుద్ధి కోసం ఉపయోగిస్తున్న ఫిల్టర్ బెడ్లను స్వయంగా పరిశీలించారు. అక్కడే ఉన్న అధికారులతో నీటి నాణ్యత ఎలా ఉందనేది శాస్త్రీయంగా పరీక్షలు జరిపించి మరీ పరిశీంచారు. నీటిలో ఉండాల్సిన కారకాలు ఎంత మోతాదులో ఉన్నది అధికారులను అడిగి తెలుసుకున్నారు. నీటి శుద్ధి ప్రక్రియ, రక్షిత మంచినీరు సమీప గ్రామాలకు అందుతున్న తీరును అధికారులు పవన్ కళ్యాణ్ కి వివరించారు. నీటి కాలుష్యం ఎక్కడ, ఎలా అవుతుందన్న దానిపై పవన్ కళ్యాణ్ ఆరా తీశారు. తాగు నీటి సరఫరా విషయంలో జాగ్రత్తలు పాటించాలని రక్షిత మంచినీటి సరఫరా శాఖ అధికారులకు, జల వనరుల శాఖ అధికారులకు పవన్ కళ్యాణ్ సూచించారు. పాత కాలంనాటి ఫిల్టర్ బెడ్లు, మంచినీటి సరఫరా వ్యవస్థ మెరుగుపరిచేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని, వాటికి మరమ్మతులకు ప్రతిపాదనలు పంపాలని చెప్పారు. తాగునీటి సరఫరా విషయంలో ఏమాత్రం అలసత్వం వహించవద్దని, గ్రామీణులకు స్వచ్ఛమైన తాగునీరు అందించేందుకు ప్రభుత్వం చిత్తశుద్ధిగా ఉందని చెప్పారు. నిధుల కొరత లేదని, అవసరమైతే కేంద్ర ప్రభుత్వ పథకాల నిధులు వినియోగించుకుని గ్రామీణలకు స్వచ్ఛమైన తాగునీరు అందించే ఏర్పాట్లు చేయాలని అధికారులకు సూచించారు.
ప్రాథమిక ఆరోగ్యం కేంద్రంలో బాధితులకు పరామర్శ
అతిసారం బారిన పడిన గుర్ల గ్రామస్థులు చికిత్స పొందుతున్న గుర్ల ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ స్వయంగా వెళ్లారు. పంపింగ్ హౌస్ నుంచి నేరుగా ఆస్పత్రికి చేరుకున్న పవన్ కళ్యాణ్ అతిసారం బారిన పడి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ప్రస్తుతం చికిత్స పొందుతున్న వారిని పరామర్శించారు. బాధితులకు అందుతున్న వైద్యంపై ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. కేసులు సంఖ్య పూర్తిగా తగ్గిందని, గత మూడు రోజులుగా వాటర్ ట్యాంకర్ ద్వారా నాగవళి నీరు అందించడంతో గ్రామంలో ఎవరికి వాంతులు, విరేచనాలు లేవని వైద్యులు పవన్ కళ్యాణ్ కి వివరించారు.
అత్యవసర వైద్యం నిమిత్తం వచ్చే కేసులను నిర్లక్ష్యం చేయవద్దని, అవసరం అయితే మెరుగైన వైద్యానికి విశాఖపట్నం, విజయనగరం తీసుకువెళ్లాలని అధికారులకి సూచించారు. అత్యవసర సమయంలో విధుల్లో 24 గంటలు అందుబాటులో ఉండాలని వైద్యులకు, సిబ్బందికి సూచించారు.
బాధిత కుటుంబాలకు పరామర్శ… జిల్లా అధికారులతో సమీక్ష
గుర్ల గ్రామంలో ప్రత్యేక వేదిక వద్ద ఇటీవల అతిసారంతో మృతి చెందిన బాధిత కుటుంబాలను పవన్ కళ్యాణ్ పరామర్శించారు. వారి కుటుంబ పరిస్థితిని, ఆర్థిక స్థితిగతులను అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వం నుంచి తగిన పరిహారం అందేలా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తో మాట్లాడతానని హామీ ఇచ్చారు. బాధితులకు ఏ సమస్య వచ్చినా తమ పార్టీ నాయకులకు తెలియజేయాలని బాధిత కుటుంబాలకు సూచించారు. అనంతరం అక్కడే తాగు నీటి ట్యాంకర్ల ద్వారా అందుతున్న నీటి నాణ్యతను మళ్లీ మరోసారి పరిశీలించారు. తాగు నీరు సురక్షితంగా ఉందని తెలుసుకొని, ఇదే నీటిని పరిస్థితి అదుపులోకి వచ్చే వరకు సరఫరా చేయాలని అధికారులను ఆదేశించారు. అనంతరం జిల్లా కలెక్టరేట్ కు బయలుదేరి జిల్లా అధికారులతో సమీక్ష నిర్వహించారు. తాగునీటి సరఫరా విషయంలో జాగ్రత్తగా ఉండాలని, నిరంతరం సరఫరాను పర్యవేక్షించాలన్నారు. జల్ జీవన్ మిషన్ నిధులను ఉపయోగించుకొని తాగునీటి సరఫరా వ్యవస్థను మెరుగుపర్చడానికి తగిన చర్యలు తీసుకోవాలని జిల్లా అధికారులకు సూచించారు. గుర్ల వంటి ఘటన జరిగినపుడు వెంటనే తగు రీతిన స్పందించడమే కాకుండా, అన్ని శాఖల అధికారులు సమన్వయం చేసుకొని పని చేయాలన్నారు. ప్రజాక్షేమానికి కూటమి ప్రభుత్వం తగిన ప్రాధాన్యం ఇస్తుందని, అదే స్ఫూర్తితో అధికారులు పని చేయాల్సిన అవసరం ఉందని చెప్పారు. సమావేశంలో ప్రజాప్రతినిధులు, జిల్లా అధికారులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News