

-డ్రోన్ షోకు ఐదు గిన్నిస్ వరల్డ్ రికార్డులు..
-పున్నమి ఘాట్‌లో డ్రోన్ షో తిలకించిన సీఎం చంద్రబాబు
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ఏపీని డ్రోన్ హబ్‌గా తీర్చిదిద్దటమే లక్ష్యంగా ప్రభుత్వం పని చేస్తుంది. గుంటూరు జిల్లా మంగళగిరిలోని సీకె కన్వెన్షన్‌లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మంగళవారం ఈ సమ్మిట్‌ను ప్రారంభించారు. రెండు రోజులపాటు జాతీయ స్థాయిలో ఈ సమ్మిట్ జరగనుంది. కాగా, విజయవాడ కృష్ణా నది తీరంలో పున్నమి ఘాట్ వద్ద డ్రోన్ షో జరిగింది. దేశంలో తొలిసారిగా 5,500 డ్రోన్లతో భారీ ప్రదర్శన, లేజర్ షో నిర్వహించారు. 8 వేల మంది డ్రోన్ షో వీక్షించేలా ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. డ్రోన్ షో వీక్షించేలా విజయవాడలో నాలుగు చోట్ల డిస్ప్లేలు సైతం ఏర్పాటు చేశారు. డ్రోన్ షో సందర్భంగా ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలను చంద్రబాబు ఆసక్తిగా తిలకించారు.
డ్రోన్లు వివిధ కళాకృతులతో అందరినీ అలరించాయి. విమానం, బుద్ధుడు, గ్లోబ్ పై భారతదేశ మ్యాప్, డ్రోన్ కల్చర్, 1911 నాటి పోస్టల్ స్టాంపు, భారత త్రివర్ణ పతాకం… ఇలా వివిధ రూపాల్లో డ్రోన్ లైటింగ్ షో కనులవిందు చేసింది. ఈ కార్యక్రమానికి ప్రజలు భారీగా తరలివచ్చారు. కాగా, ఈ డ్రోన్ షోను ప్రజలు వీక్షించేందుకు వీలుగా విజయవాడలో ఐదు చోట్ల డిజిటల్ స్క్రీన్లు ఏర్పాటు చేశారు. సీఎం చంద్రబాబు, కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు తదితరులు ఈ భారీ ఈవెంట్ కు హాజరై అత్యంత ఆసక్తితో తిలకించారు. ఈ కార్యక్రమంలో, సీఎం చంద్రబాబు డ్రోన్ హ్యాకథాన్ విజేతలకు నగదు బహుమతులు ప్రదానం చేశారు డ్రోన్ షో సందర్భంగా పున్నమి ఘాట్ వద్ద ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాల్లో ‘కృష్ణం వందే జగద్గురుం’ కళా ప్రదర్శన ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. మొత్తమ్మీద ఈ డ్రోన్ షో ఏపీ ప్రభుత్వ విజన్ ను చాటేలా, టెక్నాలజీ పట్ల సీఎం చంద్రబాబు అనురక్తిని వెల్లడించేలా సాగింది. 5,500 డ్రోన్లతో దేశంలోనే అతిపెద్ద ప్రదర్శనను తొలిసారిగా నిర్వహించారు. దీంతో డ్రోన్ షో ఐదు ప్రపంచ రికార్డులను నెలకొల్పింది. ఈ సందర్భంగా డ్రోన్ షో అనంతరం గిన్నిస్ బుక్ ప్రతినిధులు సీఎం చంద్రబాబు నాయుడుకు గిన్నిస్ బుక్ రికార్డు సర్టిఫికెట్లను అందజేశారు.
ఈ కార్యక్రమానికి కేంద్ర పౌరవిమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు, రాష్ట్రమంత్రి కొండపల్లి శ్రీనివాస్ రాష్ట్ర మంత్రులు, ఎమ్మెల్యేలు, అధికారులు తదితరులు హాజరయ్యారు.
Prajavartha Online Telugu News