మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త :
జిల్లాలోని విద్యుత్ వినియోగదారులు పీఎం సూర్య ఘర్ ముఫ్త్ బిజిలీ యోజన పథకాన్ని వినియోగించుకుని లబ్ధి పొందే విధంగా ప్రోత్సహించాలని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్ లోని తన ఛాంబర్ లో శుక్రవారం ఉదయం ఆయన సబ్సిడీతో కూడిన సౌర విద్యుత్ పథకం వినియోగంపై విద్యుత్ శాఖ అధికారులతో టెలి కాన్ఫరెన్స్ నిర్వహించి మండలాల వారీగా పురోగతిని సమీక్షించారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ విద్యుత్ వినియోగదారులు తమ విద్యుత్ బిల్లుల ఖర్చులను తగ్గించుకునేందుకు పీఎం సూర్య ఘర్ ముఫ్త్ బిజిలీ యోజన కేంద్ర ప్రభుత్వ పథకాన్ని ప్రజలందరూ సద్వినియోగం చేసుకునేలా విస్తృత అవగాహన పరచాలని సూచించారు. జిల్లాలో కొన్నిచోట్ల విద్యుత్ వినియోగదారులు ముందుకు వచ్చి దరఖాస్తు చేసుకున్నప్పటికీ వెంటనే సౌకర్యం కల్పించకపోవడం పట్ల జిల్లా కలెక్టర్ అసహనం వ్యక్తం చేస్తూ, వచ్చే సమావేశం నాటికి మంచి పురోగతి సాధించాలని, పెండింగ్ దరఖాస్తులపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు.
ఇది ఎంతో మంచి పథకం అని, ఒకసారి ఇంటి పైన సోలార్ రూఫ్ టాప్ ను ఏర్పాటు చేసుకోవడం ద్వారా సంవత్సరాల తరబడి దాని నుంచి లబ్ది పొందవచ్చని చెబుతూ సోలార్ రూఫ్ టాప్ ఏర్పాటు ముందస్తు ఖర్చు కోసం బ్యాంకులు సైతం రుణాలు మంజూరు చేస్తాయని ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ విద్యుత్ వినియోగదారులను కోరారు. ఈ టెలీ కాన్ఫరెన్స్ లో విద్యుత్ శాఖ ఎస్ఈ ఎం సత్యానందం, జడ్పీ సీఈవో కన్నమ నాయుడు, పీఎం సూర్య ఘర్ పథక నోడల్ అధికారి భాస్కరరావు, ఉద్యానవన శాఖ అధికారిణి జె జ్యోతి, ఎల్ డి ఎం జయవర్ధన్ తదితరులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News