మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త :
జిల్లాలో ఆదర్శ సౌర గ్రామాల ఏర్పాటుకు అర్హత ఉన్న గ్రామాలను గుర్తించాలని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ అధికారులను ఆదేశించారు. శుక్రవారం మధ్యాహ్నం కలెక్టరేట్ లోని కలెక్టర్ చాంబర్లో జిల్లా కలెక్టర్ అధ్యక్షతన ఆదర్శ సౌర గ్రామాల ఏర్పాటుపై జిల్లా స్థాయి కమిటీ సమావేశం జరిగింది.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ సౌరశక్తిని ప్రోత్సహించేందుకు జిల్లాకు ఒక సౌరశక్తితో పనిచేసే గ్రామాన్ని రూపొందించాలనే లక్ష్యంతో ప్రధానమంత్రి-సూర్య ఘర్: ముఫ్త్ బిజిలీ యోజన ఆదర్శ సౌర గ్రామాల కోసం కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే మార్గదర్శకాలను జారీ చేసిందన్నారు. ఈ నేపథ్యంలో ఆదర్శ సౌర గ్రామాల కోసం మొదటిగా జిల్లాలో 5 వేలు పైబడి జనాభా కలిగిన ఐదు రెవెన్యూ గ్రామాలను వచ్చే సమావేశం నాటికి గుర్తించాలని సూచించారు.
ఆయా గ్రామాలలోని ప్రభుత్వ భవనాలు, వీధి దీపాలు, మంచినీటి సరఫరా పథకాలు తదితర విద్యుత్ వినియోగానికి సంబంధించిన వాటికి పూర్తి స్థాయిలో సౌరశక్తి ఫలకాలు అమర్చడం జరుగుతుందన్నారు. ఆరు నెలల సమయం గడిచిన అనంతరం పునరుత్పాదక ఇంధన సామర్థ్యం ఆధారంగా ఆదర్శ సౌర గ్రామాన్ని గుర్తించడం జరుగుతుందన్నారు.
ఎంపికైన ఆదర్శ సౌర గ్రామానికి కేంద్ర ఆర్థిక సహాయం కింద రూ.కోటి నిధులు అందించడం జరుగుతుందని కలెక్టర్ తెలిపారు. ఈ సమావేశంలో విద్యుత్ శాఖ ఎస్ఈ ఎం సత్యానందం, జడ్పీ సీఈవో కన్నమ నాయుడు, పీఎం సూర్య ఘర్ పథక నోడల్ అధికారి భాస్కరరావు తదితరులు పాల్గొన్నారు.