విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
కరోనా విపత్కర సమయంలో పేదలను ఆదుకునేందుకు ప్రతిఒక్కరూ సామాజిక బాధ్యతతో ముందుకు రావాలని ఏపీ బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్, సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు మల్లాది విష్ణు అన్నారు. 59వ డివిజన్ సింగ్ నగర్ లోని తెలుగు బాప్టిస్ట్ చర్చిలో బుధవారం ’ది గాడ్స్ వే’ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో ఇటీవల కరోనా బారినపడి కోలుకున్న కొంతమంది పాస్టర్లకు నిత్యావసరాల సరుకుల పంపిణీ జరిగింది. కార్యక్రమంలో ఎమ్మెల్సీ కరీమున్నీసా తో కలిసి శాసనసభ్యులు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. అనంతరం మల్లాది విష్ణు మాట్లాడుతూ కరోనా మహమ్మారి కారణంగా జనజీవనం అస్తవ్యస్తంగా మారిందన్నారు. పరిస్థితి నేటికీ అదుపులోకి రాలేదని.. కనుక ప్రతిఒక్కరూ సామాజిక బాధ్యతతో మెలుగుతూ రాష్ట్ర ప్రభుత్వానికి సహకరించాలని కోరారు. ఇటువంటి సమయంలో పేద పాస్టర్ల అవసరాలను గుర్తించి ది గాడ్స్ వే ఆర్గనైజేషన్ వారికి నిత్యావసరాలను అందించడం అభినందనీయమన్నారు. ఈ సందర్భంగా ఆర్గనైజేషన్ వ్యవస్థాపకులు డాక్టర్ స్పర్జియన్ కింగ్ సేవలను కొనియాడారు. తోటివారికి సహాయం చేయటం దైవకార్యంతో సమానమని పేర్కొన్నారు. కనుక ప్రతి ఒక్కరూ తమకు ఉన్నంతలో పేదలకు సహాయసహకారాలు అందించి దానగుణాన్ని చాటుకోవాలని కోరారు. కార్యక్రమంలో 59వ డివిజన్ కార్పొరేటర్ సుల్తానా, గాడ్స్ వే ఆర్గనైజేషన్ ఆంధ్ర ప్రదేశ్ కోఆర్డినేటర్ మేదర సురేష్ కుమార్, పల్లె ప్రభుదాసు, మంగళపూడి జోసఫ్ తదితరులు పాల్గొన్నారు.
