గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త :
గుంటూరు నగరపాలక సంస్థ పరిధిలో చేపట్టే అభివృద్ధి పనులు నిర్దేశిత నాణ్యతా ప్రమాణాలు పాటించాలని, పనులను నేరుగా పరిశీలించిన తర్వాతనే బిల్లుల చెల్లింపుకు ప్రాసెస్ చేస్తామని నగర కమిషనర్ పులి శ్రీనివాసులు ఐఏఎస్ స్పష్టం చేశారు. బుధవారం కమిషనర్ నల్లకుంట, రామిరెడ్డి నగర్, రవీంద్ర నగర్, శ్యామల నగర్, పట్టాభిపురం, రత్నగిరీ నగర్, జన్మభూమి నగర్ తదితర ప్రాంతాల్లో నూతనంగా ఏర్పాటు చేసిన సిసి రోడ్లు, డ్రైన్లను ఇంజినీరింగ్, ప్రజారోగ్య అధికారులతో కలిసి పరిశీలించారు.
ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ నగరపాలక సంస్థ పరిధిలో చేపట్టే అభివృద్ధి పనుల్లో నిర్దేశిత నాణ్యతా ప్రమాణాలు పాటించాలని, పనులు జరిగే సమయంలో ఎమినిటి కార్యదర్శులు అక్కడే ఉండి పనులను పరిశీలించాలన్నారు. పనులను ప్రత్యక్ష్ణ పరిశీలన చేసిన అనంతరం బిల్లుల చెల్లింపుకు ప్రాసెస్ చేస్తామని తెలిపారు. చేపట్టిన పనులు నిర్దేశిత గడువుకు ముందే డ్యామేజి జరిగితే సంబందిత కాంట్రాక్టర్, పర్యవేక్షణ చేసిన ఇంజినీరింగ్ అధికారులు భాధ్యత వహించాలని స్పష్టం చేశారు. నూతనంగా ఏర్పాటు చేసే రోడ్లకు తప్పనిసరిగా డ్రైన్ల నిర్మాణం కూడా చేపట్టాలని, డ్రైన్ టు డ్రైన్ ఉండేలా ప్రతిపాదనలు ఉండాలన్నారు. కల్వర్ట్ లపై మ్యాన్ హోల్స్ ఉండాలన్నారు.నల్లకుంట 8వ లైన్, శ్యామల నగర్ జీరో లైన్లలో నూతన కల్వర్ట్ ల ఏర్పాటుకు ప్రతిపాదనలు సిద్దం చేయాలని ఏఈలను ఆదేశించారు. రామిరెడ్డి నగర్ లోని పలు ప్రాంతాల్లో రోడ్ల మీదకు ర్యాంప్ లు ఉండడం, భవన నిర్మాణ వ్యర్ధాలు రోడ్ల పక్కన ఉండడంపై స్థానికుల ఫిర్యాదు మేరకు స్థానిక 94 వార్డ్ సచివాలయ ప్లానింగ్ కార్యదర్శి ఎస్కే.అస్మాకి షోకాజ్ నోటీసు ఇవ్వాలని పట్టణ ప్రణాళిక అధికారులను ఆదేశించారు.
సచివాలయ కార్యదర్శులతో మాట్లాడుతూ ప్రతి రోజు ఉదయం తమ సచివాలయం పరిధిలో పర్యటిస్తూ ప్రజల సమస్యలను అడిగి తెలుసుకోవాలన్నారు. అడ్మిన్, ఎమినిటి కార్యదర్శులు ఆస్తి, నీటి పన్ను బకాయిల వసూళ్లకు ప్రత్యేక శ్రద్ధ చూపాలని ఆదేశించారు.
అనంతరం బృందావన్ గార్డెన్స్ లోని అన్నమయ్య వాకింగ్ ట్రాక్ ని పరిశీలించి, ట్రాక్ అభివృద్ధి పనులకు ప్రతిపాదనలు సిద్దం చేయాలని ఇంజినీరింగ్ అధికారులను ఆదేశించారు. అభివృద్ధి పనుల్లో స్థానిక వాకర్స్ అసోసియేషన్ భాగస్వామ్యం కావాలని కోరారు. ఈ సందర్భంగా వాకర్స్ అసోసియేషన్ సభ్యులు కమిషనర్ ని శాలువాతో సత్కరించారు.
పర్యటనలో ఈఈ కోటేశ్వరరావు, డిఈఈలు మధుసూదన్, రమేష్ బాబు, శ్రీనివాస్, ఏఈలు, శానిటరీ ఇన్స్పెక్టర్లు, సచివాలయ కార్యదర్శులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News