-శాఖాధిపతులతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించిన కమిషనర్ ధ్యానచంద్ర
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త:
విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర సోమవారం ఉదయం నగరపాలక సంస్థ శాఖాధిపతులతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించి, నగరంలో పారిశుధ్య నిర్వహణ, తాగునీటి సరఫరా, ఇంజనీరింగ్ పనులు, పచ్చదనం పెంపు, రెవెన్యూ వసూళ్లు, పట్టణ ప్రణాళిక తదితర అంశాలపై సమీక్షించారు.
ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ, ఇంజనీరింగ్ అధికారులు అప్రమత్తంగా ఉంటూ నగరంలో భూగర్భ డ్రైనేజీలు పొంగిపొర్లకుండా ఎప్పటికప్పుడు అవసరమైన చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ఇంజనీరింగ్ సిబ్బంది క్షేత్రస్థాయిలో పర్యటించి రహదారులపై గుంతలను గుర్తించి, వాటికి తక్షణ మరమ్మతులు చేపట్టి రహదారులను ప్రజలకు సౌకర్యవంతంగా తీర్చిదిద్దాలన్నారు. ప్రతిరోజూ తాగునీటి నాణ్యత పరీక్షలు నిర్వహించి, ప్రజలకు శుద్ధమైన తాగునీరు అందేలా నిరంతరం పర్యవేక్షించాలని సూచించారు.
ప్రజారోగ్య శాఖ అధికారులు నగరంలో వ్యర్థాలను ఎప్పటికప్పుడు సేకరించి, సేకరించిన వ్యర్థాలను ఎక్సెల్ ప్లాంట్‌కు తరలించేలా చర్యలు తీసుకోవాలన్నారు. వ్యర్థాల విభజన, వాటి ద్వారా సంపద తయారు చేసే ప్రక్రియను నిరంతరం పర్యవేక్షించాలని తెలిపారు. గార్బేజ్ వల్నరబుల్ పాయింట్లను తరచూ తనిఖీ చేస్తూ, ఆయా ప్రాంతాల్లో వ్యర్థాలు పేరుకుపోకుండా ప్రత్యేక చర్యలు చేపట్టాలని ఆదేశించారు.
నగరంలో పచ్చదనాన్ని మరింత మెరుగుపరిచేందుకు చర్యలు తీసుకోవాలని, ప్రస్తుతం ఉన్న మొక్కల సంరక్షణపై ప్రత్యేక దృష్టి సారించాలని కమిషనర్ సూచించారు. మొక్కలకు అవసరమైన నీటిని క్రమం తప్పకుండా అందిస్తూ వాటి పెరుగుదలను పర్యవేక్షించాలన్నారు.
రెవెన్యూ శాఖ అధికారులు నగరపాలక సంస్థకు రావాల్సిన పన్ను వసూళ్లను వేగవంతం చేయాలని ఆదేశించారు. టౌన్ ప్లానింగ్ అధికారులు అనధికార నిర్మాణాలను నిరంతరం పర్యవేక్షిస్తూ నిబంధనల మేరకు చర్యలు చేపట్టాలన్నారు.
నగరంలోని శ్మశాన వాటికల్లో మౌలిక సదుపాయాలకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని, పారిశుధ్య నిర్వహణను నిరంతరం పర్యవేక్షించాలని సంబంధిత అధికారులను కమిషనర్ ధ్యానచంద్ర ఆదేశించారు.
