-గుడ్ మార్నింగ్ విజయవాడ సెంట్రల్ కార్యక్రమంలో ఎమ్మెల్యే మల్లాది విష్ణు
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
తెలుగుదేశం నాయకుల అవినీతి భాగోతం తొలి కౌన్సిల్ సమావేశంలోనే బహిర్గతమైందని ఏపీ బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్, సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు మల్లాది విష్ణు అన్నారు. గుడ్ మార్నింగ్ విజయవాడ సెంట్రల్ కార్యక్రమంలో భాగంగా 57వ డివిజన్ న్యూ ఆర్.ఆర్.పేటలో ఆయన విస్తృతంగా పర్యటించారు. స్థానిక కార్పొరేటర్ ఇసరపు దేవి రాజారమేష్ తో కలిసి సుందరమ్మ దిబ్బ, సుబ్బరాజు నగర్, అరుణోదయ నగర్ ప్రాంతాలను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. పారిశుద్ధ్యంపై ఎక్కువ ఫిర్యాదులు అందడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. రైల్వే వంతెన కింద పేరుకుపోయిన చెత్తను తొలగించాలని ఆదేశించారు. బుడమేరు కాల్వలో పూడికను తొలగించాలన్నారు. కాలనీలను ఎప్పటికప్పుడు పరిశుభ్రంగా ఉంచాలని.. దీనిపై సచివాలయ సిబ్బంది, శానిటరీ ఇన్ స్పెక్టర్ నిరంతరం పర్యవేక్షణ ఉండాలన్నారు. ఆయా వివరాలను పుస్తకంలో నమోదు చేయాలన్నారు. పలు కాలనీలలో వీధి దీపాలను అమర్చడంతో పాటు.. పాత విద్యుత్ స్తంభాలను తొలగించాలని ఎలక్ట్రికల్ సిబ్బందికి సూచించారు. సుందరమ్మ దిబ్బ ఒకటవ లైన్ ఆరంభంలో వాహనదారులు సైడ్ కాల్వలో పడిపోకుండా చప్టాపై సైడ్ వాల్స్ నిర్మించాలని అధికారులకు సూచించారు. డివిజన్ లోని ప్రమాదకర మలుపుల వద్ద స్పీడ్ బ్రేకర్లు తప్పనిసరిగా ఏర్పాటు చేయాలన్నారు. పార్కులోని చెత్తను, పిచ్చిమొక్కలను తొలగించి.. స్థానికులకు అందుబాటులోకి తీసుకురావాలని అధికారులను ఆదేశించారు. మరోవైపు తమకు 1994లో రాష్ట్రప్రభుత్వం మంజూరుచేసిన పట్టాలను రిజిస్ట్రేషన్లు చేయించవలసిందిగా సుబ్బరాజునగర్, అరుణోదయనగర్ వాసులు ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకురావడం జరిగింది. రెవెన్యూ అధికారులు ఇప్పటికే సర్వే నిర్వహించారని.. త్వరలోనే సమస్యను పరిష్కరిస్తామని శాసనభ్యులు తెలియజేశారు. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఏ ఒక్కరికీ అన్యాయం జరగదని హామీనిచ్చారు.
కౌన్సిల్ లో తెలుగుదేశం సభ్యుల తీరు జుగుప్సాకరం…
తెలుగుదేశం హయాంలో నగరంలో జరిగిన టిడ్కో ఇళ్ల కుంభకోణం, నకిలీ బాండ్ల వ్యవహారం తొలి కౌన్సిల్ సమావేశంలోనే బహిర్గతమైందని మల్లాది విష్ణు అన్నారు. టీడీఆర్ బాండ్ల వ్యవహారంపై ఏసీబీ విచారణకు కౌన్సిల్ తీర్మానించడం జరిగిందన్నారు. దీనిపై చర్చను పక్కదారి పట్టించేందుకే తెలుగుదేశం సభ్యులు కౌన్సిల్ లో గందరగోళం సృష్టించే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. కౌన్సిల్ సమావేశంలో తెలుగుదేశం సభ్యులు వ్యవహరించిన తీరు జుగుప్సాకరమన్నారు. ఆస్తి పన్ను అంశంపై ఈ నెల 19వ తేదీన చర్చకు అజెండాలో పెట్టడం జరిగిందన్నారు. అయినా కూడా తెలుగుదేశం సభ్యులు కావాలనే సభలో రాద్ధాంతం చేశారని మండిపడ్డారు. గత తెలుగుదేశం హయాంలో మాదిరిగా సభలో గందరగోళం సృష్టించి బాధ్యతల నుంచి తప్పించుకుందామంటే కుదరదన్నారు. ఈ ప్రభుత్వంలో ప్రతి అంశంపై కూలంకషంగా చర్చ జరుగుతుందని మల్లాది విష్ణు గారు తెలియజేశారు. కార్యక్రమంలో స్థానిక నాయకులు చెన్నకేశవరెడ్డి, కాళ్ల ఆదినారాయణ, ఎన్ఎస్ఆర్, పఠాన్ నజీర్ ఖాన్, చెన్నారెడ్డి, శ్రీనివాసరెడ్డి, మున్సిపల్, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు.