– షెడ్యూల్ ప్రకారం ప్రత్యేక బృందాలతో కొనసాగుతున్న ప్రక్రియ
– ప్రక్రియ పటిష్ట పర్యవేక్షణకు జిల్లాస్థాయి కమిటీ
– జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
సమాజంలోని అన్ని వర్గాల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం వివిధ పథకాలు, కార్యక్రమాలు అమలుచేస్తోందని.. ఈ క్రమంలోనే ఆరోగ్య పెన్షన్లకు సమాన, పారదర్శకమైన, జవాబుదారీతనంతో కూడిన ప్రయోజనాలు అందించాలనే ఉద్దేశంతో పెన్షన్ల ధ్రువీకరణ, పునఃపరిశీలన ప్రక్రియ చేపడుతున్నట్లు జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా చేపట్టిన రూ. 15 వేల పెన్షన్ల (వీల్ ఛెయిర్, బెడ్‌కు పరిమితమైన/ సివియర్ మస్కులర్ డిస్ట్రోఫీ కేసులు, ప్రమాద బాధితులు) ధ్రువీకరణ, పునఃపరిశీలన ప్రక్రియను మంగళవారం కలెక్టర్ లక్ష్మీశ.. ఇబ్రహీంపట్నం మండలం, గుంటుపల్లిలోని సచివాలయం-1 పరిధిలో పరిశీలించారు. హెల్త్ పెన్షన్ లబ్ధిదారు తుకారాం రాజాను పరామర్శించి, ఆరోగ్య పరిస్థితిని తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ లక్ష్మీశ మాట్లాడుతూ ప్రత్యేక బృందాలతో 358 పెన్షన్ల పునఃపరిశీలన ప్రక్రియను అత్యంత పారదర్శకంగా చేపట్టడం జరుగుతోందని.. ఈ ప్రక్రియ పటిష్ట పర్యవేక్షణకు జిల్లాస్థాయి కమిటీని ఏర్పాటు చేసినట్లు తెలిపారు. జియో ట్యాగింగ్‌తో పాటు పునఃపరిశీలన వివరాలను డిజిటల్ యాప్‌లో నమోదు చేస్తున్నట్లు వివరించారు. ఎక్కడా ఎలాంటి పొరపాట్లకు తావులేకుండా ప్రక్రియ చేపట్టేందుకు బృందాలకు శిక్షణ ఇవ్వడం జరిగిందని, వివిధ శాఖల సమన్వయంతో జిల్లాలో ప్రక్రియను షెడ్యూల్ ప్రకారం సజావుగా నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ లక్ష్మీశ తెలిపారు. కలెక్టర్ వెంట డీఆర్‌డీఏ పీడీ కె.శ్రీనివాసరావు, డీఎంహెచ్‌వో డా. ఎం.సుహాసిని తదితరులు ఉన్నారు.