-యం.యస్. శోభా రాణి
రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
ఎస్సీ కులగణన పై నిర్వహిస్తున్న అభ్యంతరాల (ఆడిట్ ప్రక్రియ) స్వీకరణ గడువును జనవరి 12వ తేదీ వరకు పొడిగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయడం జరిగిందనీ జిల్లా యస్.సి సంక్షేమ మరియు సాధికారత అధికారి, శ్రీమతి.యం.యస్. శోభా రాణి మంగళవారం ఒక ప్రకటనలో తెలియచేసారు. ఎస్సీ కులగణన పై నిర్వహిస్తున్న అభ్యంతరాల స్వీకరణ మంగళవారం (జనవరి,07వ తేదీతో) గడువు ముగియనుండటంతో మరొక 5 రోజులు పొడిగిస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రత్యేక ఉత్తర్వులు జారీ చేసినట్లు పేర్కొన్నారు. ఎస్ఓపీ విధి విధానాలు తెలుపుతూ ప్రభుత్వం 265 నంబరు జీవో విడుదల చేసినట్లు తెలిపారు. ఈ మేరకు జనవరి 12వ తేదీ ఆదివారం వరకు కులగణనపై నిర్దేశిత ప్రాంతాల్లో సంబంధిత అధికారులు ప్రజల నుంచి అభ్యంతరాలు స్వీకరిస్తారన్నారు. స్వీకరించిన వివరాలను ఆన్లైన్ ప్రక్రియ ద్వారా జనవరి 16 వ తేదీ వరకు అధికారులు నమోదు చేస్తారని, అనంతరం అన్ని తనిఖీలు పూర్తి చేసి తుది కులగణన సర్వే వివరాలను జనవరి 20వ తేదీన గ్రామ, వార్డు సచివాలయాల వద్ద విడుదల చేస్తారని వెల్లడించారు. మండల ప్రత్యేక అధికారులు సంబంధిత ప్రక్రియను పూర్తి స్థాయిలో పర్యవేక్షించాలని ఉప సంచాలకులు (సాం.సం.శాఖ) యం. యస్. శోభా రాణి కోరారు.