-అదనపు పోషక ఆహారం గా మునగాకు పొడి
-జంక్ ఫుడ్ కి దూరంగా ఉండండి.. నిత్య ఆహారంలో పోషక విలువలు కలిగిన ఆహారాన్ని తీసుకోండి
-కలెక్టర్ పి ప్రశాంతి
రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
మీ సమయాన్ని ఆరోగ్యానికి సరిపోయేలా చేసుకొనే అవకాశం మీ చేతుల్లో ఉందని .. అది మిమ్మల్ని ఆరోగ్యవంతంగా చేస్తుందని జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి పేర్కొన్నారు. గురువారం స్థానిక పోస్టు మెట్రిక్ బాలికల వసతి గృహంలో జిల్లా యంత్రాంగం, జిల్లా వైద్య ఆరోగ్యశాఖ ఇతర సమన్వయ శాఖల ఆధ్వర్యంలో పోషన్ ప్లస్ కార్యక్రమాన్ని కలెక్టరు ప్రారంభించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ పి ప్రశాంతి మాట్లాడుతూ, కౌమార దశ లోని ఆడపిల్లల్లో రక్తహీనత తలెత్తకుండా నివారించే క్రమంలో కార్యకలాపాల్లో భాగస్వామ్యం పోషన్ ప్లస్ కింద ఐరన్ మాత్రలు తో పాటుగా మునగాకు పొడి వసతి గృహాలలో ఉన్న బాలికలకు అందచేస్తున్నట్లు పేర్కొన్నారు. ఎనీమియా లోపం వల్ల రక్త హీనత కలిగి కళ్ళు తిరిగి పడిపోవడం వంటివి జరుగుతూ ఉంటాయని, మనం తీసుకునే ఆహారంలో తప్పకుండా ఐరన్ పోషకాలు అందుతున్నయో లేదో నిర్ధారణ చేసుకోవడం ముఖ్యం అన్నారు. జిల్లాలోని సంక్షేమ వసతి గృహాలలో ఉన్న బాలికలకి మునగాకు పొడి అందచేసి మంచి ఫలితాలు సాధించడం జరిగిందన్నారు. పిల్లలు చిన్నతనం నుంచే ఆరోగ్యమైన ఆహారపు అలవాట్లు చేసుకొవాలని , ఆమేరకు వారిలో అవగాహన కల్పించడం ముఖ్యం అని తెలియ చేశారు. గతంలో చిరు ధాన్యాలు, రాగులు జొన్నలు సజ్జలు ఆహారంలో తీసుకునే వారన్నారు. నేడు ఫాస్ట్ ఫుడ్, పోషక విలువలు లేని ఆహారం తీసుకోవడం వల్ల రక్త హీనత కు గురి అవ్వడం చూస్తున్నామని తెలిపారు.
కౌమార దశలో ఉన్న బాలికలకు మునగాకు పౌడర్ ఇవ్వటం జరుగుతోందనీ, రోజు విడిచి రోజు తప్పకుండా ఆహారంలో మునగాకు తీసుకోవడం వల్ల రక్త హీనత ను అధిగమించడం సాధ్యం అవుతుందని అన్నారు. ముఖ్యంగా సంక్షేమ వసతి గృహాలలో ఉన్న బాలికలకు ప్రభుత్వం అందచేస్తున్న వాటికి అదనంగా “ప్రాజెక్ట్ ఐరెన్ ప్లస్ ” కార్యక్రమం ద్వారా మునగాకు పోడి అందజేసే కార్యక్రమాన్ని చేపట్టినట్లు తెలిపారు. వీటికి అదనంగా కరిపాకు, క్యారెట్ తదితర పోషక విలువలు కలిగిన వాటిని మీ శరీరతత్త్వం, వయస్సు ఆధారంగా తీసుకోవడం ముఖ్యం అన్నారు.
ఆరోగ్య పరిరక్షణపై , మంచి పోషక విలువలు కలిగిన ఆహారంలో తప్పకుండా తీసుకుని రావడం పై జిల్లా వ్యాప్తంగా యుక్త వయసులో వున్న బాలికలు భవిష్యత్తులో కూడా కొనసాగించేలా ముందుకు రావాలని కలెక్టర్ ప్రశాంతి కోరారు. జిల్లాలో ఎస్సి ఎస్టీ బీసీ సంక్షేమ వసతి గృహాలలో సుమారు కౌమర దశలో ఉన్న బాలికలు 2793 మందికి మురింగా (మునగాకు) పొడి అందజేసినట్లు తెలిపారు. ఈ సందర్భంగా వసతి గృహంలోని విద్యార్థులకి స్వయంగా ఆహారాన్ని వడ్డించిన కలెక్టరు ప్రశాంతి.
ఈ కార్యక్రమము లో జిల్లా వైద్య ఆరోగ్యశాఖాధికారి డాక్టర్ కె. వెంకటేశ్వర రావు, అధ్యక్షతన జిల్లా ఉప వైద్య ఆరోగ్యశాఖా ధికారి డాక్టర్ ఎన్. వసుంధర , ట్రైబల్ వెల్ఫేర్ ఆఫీసర్ కే ఎన్ జ్యోతి, సోషల్ వెల్ఫేర్ ఆఫసర్, ఎం. శోభా రాణి , జిల్లా బిసి వెల్ఫేర్ ఆఫీసర్ బి . శశాంక, డి ఆర్ డి ఎ పిడి ఎన్ వి వి ఎస్ మూర్తి, హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్, ఎస్. ఎస్. లక్ష్మి కాంతి, డాక్టర్ ఎ. వి. కె. చైతన్య, డాక్టర్ ఎ. భావని, విద్యార్థినీ లు పాల్గొన్నారు.