-మనోభావాలు దెబ్బతినే విధంగా పండుగలపైనా ప్రేలాపనలు
-రూ.850 కోట్లతో రోడ్లు బాగు చేసినా… వక్రబుద్ధితో విమర్శలు
-రూ. 6,700 కోట్లు బకాయిలు చెల్లించినా… సైకో గ్యాంగ్ ఓర్వలేనితనం
-విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
గత ఎన్నికల్లో కేవలం 11 సీట్లకు మాత్రమే పరిమితం చేసి… కనీసం ప్రధాన ప్రతిపక్ష హాదా దక్కకుండా ప్రజలు చేసినా… వైసీపీ నేతల తీరు మార్చుకోలేదని విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ విమర్శించారు. ప్రజలు గడ్డి పెట్టినా… వైసీపీ నేతలు ఇంకా బుద్ధి మార్చుకోలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. కోట్లాది తెలుగు ప్రజల మనోభావాలు దెబ్బతినే విధంగా సంప్రదాయ సంక్రాంతి పండుగపైనా విషం వెళ్లగక్కుతూ.. అసత్య ప్రచారాలతో పిచ్చి ప్రేలాపనలు పేలుతున్నారని ఆరోపించారు. పల్లెల్లో సంక్రాంతి కళ లేదంటూ సైకో జగన్ అండ్ కో చేస్తున్న దుష్ప్రచారం చాలా దుర్మార్గమన్నారు. తమ అసత్య ప్రచారాల కోసం కోట్లాది ప్రజలు ఎంతో ఇష్టంగా జరుపుకునే… పండుగలను కూడా వదలకుండా వాడుకోవడం సిగ్గు చేటని ఎద్దేవా చేశారు. సమగ్ర నీటి వినియోగంతో ఈసారి పంటలు కూడా బాగా పండాయని, అదే విధంగా ధాన్యం అమ్మిన డబ్బులు 24 గంటల్లోనే రైతులకు చెల్లించామని ఆయన తెలిపారు. ప్రజల సంతోషాన్ని చూడలేకనే మీడియా, సోషల్ మీడియా వేదికగా వైఎస్సార్ కాంగ్రెస్ నేతలు అసత్యాలను ప్రచారంలోకి తేవడానికి ప్రయత్నిస్తున్నారని మంత్రి గొట్టిపాటి మండిపడ్డారు. గతంలో ఎప్పుడూలేని విధంగా పొరుగు రాష్ట్రాలతో పాటు దేశ, విదేశాల్లో ఉన్న తెలుగు వారందరూ ఈ సంక్రాంతికి సొంతూళ్లకు వచ్చారని తెలిపారు. అదే విధంగా గత ఏడాది గుంతల రహదారులతో ప్రయాణంలో నరకం అనుభవించిన వారంతా… ఈ ఏడాది సంక్రాంతి ప్రయాణాలు సాఫీగా సాగించారన్నారు.
గత వైసీపీ ప్రభుత్వ హయాంలో శిథిలావస్థకు చేరిన రహదారులను రూ.850 కోట్లతో కూటమి ప్రభుత్వం బాగు చేసి పునురుద్ధరించిందని మంత్రి గొట్టిపాటి రవికుమార్ పేర్కొన్నారు. అదే విధంగా గత ప్రభుత్వ ఐదేళ్ల కాలంలో వివిధ వర్గాలకు పెండింగ్ పెట్టిన రూ.6,700 కోట్లు బకాయిలను కూడా ఈ పండుగ కానుకగా విడుదల చేసినట్లు మంత్రి స్పష్టం చేశారు. వందల కోట్లతో రోడ్లు బాగుచేసినా… వేల కోట్ల రూపాయిల పెండింగ్ బకాయిలు చెల్లించినా… వైసీపీ నేతలు ఓర్వలేనితనంతో రాష్ట్ర ప్రభుత్వంపై తమ అక్కసు వెళ్లగక్కుతున్నారని ఆయన విమర్శించారు. వైసీపీ నేతల సైకో చేష్టలకు అంతు లేకుండా పోతుందన్నారు. ప్రతిపక్ష నేతలు ఎన్ని అసత్యాల విష ప్రచారాలు చేసినా… అభివృద్ధికి అడ్డంకులు సృష్టించాలని ప్రయత్నించినా… ప్రజల పక్షాన పోరాడుతున్న కూటమి ప్రభుత్వం ముందుకే వెళ్తుందని మంత్రి గొట్టిపాటి తెలిపారు. అదే విధంగా ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఆధ్వర్యంలోని కూటమి ప్రభుత్వం… ఆంధ్రరాష్ట్ర ప్రజలందరూ.. ప్రతి రోజునూ ఒక పండుగలా జరుపుకునేలా మరెన్నో సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతుందని మంత్రి ఈ సందర్భంగా వెల్లడించారు.