-విశాఖ స్టీల్‌ప్లాంట్‌ను నిధులు కేటాయింపుపై హర్షం
-నియోజకవర్గంలో ఏడుగురికి ఇస్త్రీ పెట్టెలను అందచేసిన ఎమ్మెల్యే గద్దె రామమోహన్
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
రాష్ట్రంలోని ప్రజల కోరికలు, అవసరాలు తెల్సుకుని వాటిని సమకూర్చుకునేందుకు సంపదను సృష్టించి అభివృద్థి చేసే సత్తా ఒక్క ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడుకే ఉందని తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే గద్దె రామమోహన్ చెప్పారు. శుక్రవారం ఉదయం అశోక్‌నగర్‌లోని తూర్పు నియోజకవర్గ శాసనసభ్యుని కార్యాలయంలో ఏడుగురు రజక సోదరులకు జీవనోపాధి నిమిత్తం ఇస్త్రీపెట్టెలను ఎమ్మెల్యే గద్దె రామమోహన్ తన సొంత నిధులు రూ.50 వేలతో కోనుగోలు చేసి వారికి ఉచితంగా అందచేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే గద్దె రామమోహన్ మాట్లాడుతూ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్‌కు కేంద్ర ప్రభుత్వం గొప్ప బహుమతి ఇచ్చిందన్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్‌ను ప్రవేటీకరణ చేయవద్దని గతంలో టీడీపీ చాలా స్పష్టంగా చెప్పడమే కాకుండా ఆందోళనలు కూడా చేశామన్నారు. కూటమిలో భాగం అయిన బీజేపీని ఒప్పించి విశాఖ స్టీల్ ప్లాంట్‌కు సుమారు రూ.10 వేల 700 కోట్లను ఇవ్వడం వల్ల ప్లాంట్ నష్టాల నుంచి బయటపడుతొందన్నారు. ప్లాంట్‌కు నిధులు మంజూరు చేసిన బీజేపీ ప్రభుత్వానికి, బీజేపీని ఒప్పించి నిధులు విడుదల అయ్యేలా చేసిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు, ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్‌కు ఎమ్మెల్యే గద్దె రామమోహన్ కృతజ్ఞతలు తెలిపారు. 1999వ సంవత్సరంలో కూడా విశాఖ స్టీల్ ప్లాంట్‌ను ప్రవేటీకరణ చేస్తామని చెప్పారని, అప్పుడు తాను ఎంపీగా ఉన్నానని, నారా చంద్రబాబునాయుడు సూచన మేరకు పార్లమెంట్ నాయకుడిగా ఉన్న యర్రంనాయుడు ఎంపీలందరినీ తీసుకువెళ్లి కేంద్రంపై ఒత్తిడి చేశారని చెప్పారు. తెలుగు రాష్ట్ర ప్రజల మనోభవాలు ఈ ప్లాంట్‌తో ముడిపడి ఉన్నాయని చెప్పి రూ.2 వేల కోట్లను ప్లాంట్ అభివృద్ధికి మంజూరు చేయించామన్నారు. ఆ నిధులతోనే విశాఖ స్టీల్ ప్లాంట్∙ఇప్పటి వరకు కాపాడుకున్నామని చెప్పారు. ఇప్పుడు కేంద్రం విడుదల చేసిన నిధులతో ప్లాంట్‌ను మరికొంత కాలం కాపాడుకోవచ్చునని అన్నారు. రాష్ట్ర ప్రజల కోరికలు, ప్రజల అవసరాలు గుర్తించి ఆ అవసరాలను ప్రాధాన్యతా క్రమంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు సమకూరుస్తున్నారని అన్నారు. ఎన్నికల ముందు ఒక మాట, అధికారంలోకి వచ్చిన తర్వాత మరో మాట మాట్లాడి వైఎస్.జగన్‌మోహన్‌రెడ్డి రాష్ట్రాన్ని దోచుకున్నారని చెప్పారు. వైఎస్.జగన్‌మోహన్‌రెడ్డి పాలనలో రాష్ట్రం అప్పుల దిశగా పయనించిందని, నారా చంద్రబాబునాయుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత రాష్ట్రం అభివృద్థి వైపునకు వెళుతుందన్నారు. రాష్ట్రంలో సంపదను సృష్టించి అభివృద్థి, సంక్షేమాన్ని అందించే సత్తా ఒక్క ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడుకే ఉందని ఎమ్మెల్యే గద్దె రామమోహన్ అన్నారు.
దేశానికి దిశానిర్థేశం చేసిన టీడీపీ: నేడు వాడ వాడలో ఘనంగా ఎన్టీఆర్ వర్ధంతి కార్యక్రమాలు
ఆనాడు నందమూరి తారక రామారావు ముఖ్యమంత్రి అయిన తర్వాత రూ.35లతో పేదలకు ఫించన్లు ఇచ్చే పథకాన్ని ప్రవేశపెట్టారని ఎమ్మెల్యే గద్దె రామమోహన్ చెప్పారు. మన రాష్ట్రంలో పేదలకు ఫించను పథకం ప్రవేశపెట్టిన తర్వాతే మిగిలిన రాష్ట్రాల్లో ఆ పథకాన్ని అమలు చేశారన్నారు. కిలో రెండు రూపాయాలకు బియ్యం పథకం, పేదలకు గూడు పథకాలు కూడా అన్న ఎన్టీఆర్ ముఖ్యమంత్రి అయిన తర్వాత అమలు చేసినవేనని అన్నారు. అలాంటి మహానుభావుడు వర్థంతి, జయంతిలను తెలుగు ప్రజలందరూ ఘనంగా జరుపుకుంటారని చెప్పారు. ఎన్టీఆర్ 29వ వర్థంతి సందర్భంగా నియోజకవర్గంలోని ప్రతి డివిజనులో ఎన్టీఆర్ వర్థంతి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించనున్నామని ఎమ్మెల్యే గద్దె రామమోహన్ చెప్పారు.
ఆంధ్రప్రదేశ్ గౌడ కార్పోరేషన్ ఛైర్మన్ వీరంకి గురుమూర్తి మాట్లాడుతూ ఎమ్మెల్యే పదవి ఉన్నా లేకపోయినా పేదలకు సేవ చేసే గొప్ప మనస్సు ఉన్న నాయకుడు ఎమ్మెల్యే గద్దె రామమోహన్ అని అన్నారు. బడుగు బలహీనవర్గాల వారికి ఇస్త్రీ పెట్టెలు, బండ్లు, తోపుడు బండ్లు రాజకీయాలతో సంబంధం లేకుండా ఇస్తున్నారన్నారు. 80 వేల మందికి కుట్టుమిషన్లు, ప్రతి నియోజకవర్గంలో జనరిక్ మెడికల్ షాపులు, గొర్రెలు, పాడి గేదెలు త్వరలో తమ కార్పోరేషన్ తరపున ఇవ్వనున్నామని ఆయన చెప్పారు. సేవకు ఎమ్మెల్యే గద్దె రామమోహన్ బ్రాండ్ అని గురుమూర్తి అన్నారు. ప్రతి నెలా ఈ విధంగా సేవా, సహయ కార్యక్రమాలను ఎమ్మెల్యే గద్దె రామమోహన్ చేస్తున్నారని చెప్పారు. గద్దె రామమోహన్ ఎంపీగా ఉన్న సమయంలో నియోజకవర్గంలో ప్రత్యేకంగా కార్యాలయాన్ని ఏర్పాటు చేసి ప్రజలకు అందుబాటులో ఉన్నారని చెప్పారు.
ఈ కార్యక్రమములో పార్టీ నాయకులు చెన్నుపాటి గాంధీ, రాధారపు ఎల్లబాబు, గౌడ కార్పోరేషన్ డైరెక్టర్ శొంటి నాగేశ్వరరావు, పార్టీ నాయకులు మల్లెల లక్ష్మినారాయణ, చిలకలపూడి లక్ష్మీ నరసింహారావు, తుమ్మల శ్రీను, మల్లెల రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.