-వైసీపీ హయాంలో నిర్లక్ష్యం, ఎన్డీయే హయాంలో అభివృద్ధి –
-ప్రధాని, ముఖ్యమంత్రికి ప్రజల తరపున కృతజ్ఞతలు-
-విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అనే నినాదం సజీవం
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
ఎన్డీయే ప్రభుత్వం విశాఖ ఉక్కు పరిరక్షణ కోసం భారీ ప్యాకేజీ ప్రకటించి విశాఖ ఉక్కుకు జీవం పోసిందని రాష్ట్ర వ్యవసాయ శాఖామంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు పేర్కొన్నారు. వైసీపీ హయాంలో విశాఖ ఉక్కును నిర్లక్ష్యం చేశారని, ఎన్నికల ముందు ఇచ్చిన హామీ మేరకు ఎన్డీయే ప్రభుత్వం ఏర్పడిన తర్వాత విశాఖ ఉక్కును ప్రైవేటీకరణ చేయకుండా నిలుపుదల చేయడమే కాకుండా భారీ ప్యాకేజీ ప్రకటించడం హర్షణీయమని మంత్రి అచ్చెన్నాయుడు అన్నారు.
రెండేళ్లలో విశాఖ స్టీల్ ప్లాంట్ దేశంలోనే నంబర్ వన్‌గా నిలుస్తుందని, స్టీల్‌ప్లాంటును అప్పుల్లో నుంచి బయటకు తేవడమే ప్రథమ కర్తవ్యంగా ఎన్డీయే ప్రభుత్వం కృషి చేస్తోందని మంత్రి అచ్చెన్నాయుడు తెలిపారు.
రూ.11,440 కోట్ల ప్యాకేజీకి నిర్ణయంతో రాష్ట్ర ప్రజలు, ముఖ్యంగా ఉత్తరాంధ్ర ప్రజల సంతోషం వ్యక్తం చేస్తున్నారని మంత్రి అచ్చెన్నాయుడు వెల్లడించారు. విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అనే నినాదం ప్రజల గుండెల్లో ఎప్పటికీ సజీవమే అని మంత్రి అచ్చెన్నాయుడు వెల్లడించారు. రాష్ట్ర ప్రజలు, ఉత్తరాంధ్ర ప్రజల తరపున ప్రధాని మోదీకి, ముఖ్యమంత్రి చంద్రబాబుకు మంత్రి అచ్చెన్నాయుడు హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు.