Breaking News

విశాఖ స్టీల్ ప్లాంట్ కు రూ.11,440 కోట్ల ప్యాకేజీ ప్రకటించిన ప్రధాని మోదీకి ధన్యవాదాలు

-ఆంధ్రుల అభీష్టం, కార్మికుల శ్రమ ఫలించింది
-విశాఖ స్టీల్ ప్లాంట్ ను సమర్థవంతంగా నిర్వహించడంలో మేనేజ్మెంట్, కార్మికులు బాధ్యత తీసుకోవాలి
-డబుల్ ఇంజిన్ సర్కార్ తో డబుల్ డిజిట్ గ్రోత్ కల సాకారమవుతోంది
-ఏడు నెలల్లోనే రాష్ట్రానికి రూ. 4 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయి
-రూ. 2 లక్షల కోట్ల పనులకు ప్రధాని మోదీ శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు
-పట్టుదలతో పనిచేశాం-చిత్తశుద్దితో ముందుకెళ్ళాం- అద్భుత ఫలితాలు సాధించాం : ముఖ్యమంత్రి చంద్రబాబు

అమరావతి,  నేటి పత్రిక ప్రజావార్త :
విశాఖ స్టీల్ ప్లాంట్ కు రూ. 11,440 కోట్ల ప్యాకేజీ ప్రకటించిన ప్రధానమంత్రి నరేంద్రమోదీ కి, కేంద్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. స్టీల్ ప్లాంట్ కు ప్యాకేజీ ఇచ్చే విషయంలో ప్రత్యేక శ్రద్ధ పెట్టిన కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, భారీ పరిశ్రమల మంత్రి కుమారస్వామిని ఎన్డీఏ తరపున, రాష్ట్ర ప్రభుత్వం తరపున ప్రత్యేకంగా అభినందిస్తున్నానని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. ఇది సమిష్టి కృషి వల్లే సాధ్యమైందన్నారు. ఏడు నెలల్లోనే ప్రజలకు ఇచ్చిన హామీలను నిలబెట్టుకున్నామని, ఏపీకి అన్నీ మంచిరోజులేనని ముఖ్యమంత్రి అన్నారు.

విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు

విశాఖ స్టీల్ ప్రాంట్ కోసం విశాఖ నగర వాసులే కాకుండా ఎంతోమంది ఉద్యమాలు, ఆందోళనలు చేశారు. ఎందరో ప్రాణత్యాగాలు చేశారు. తెలుగుజాతి సాధించుకున్న ఉక్కు ఫ్యాక్టరీని కాపాడుకోవడానికి ఏడు నెలలుగా అన్ని ప్రయత్నాలు చేశాము. 1996లో స్టీల్ ప్లాంట్ కు ఇబ్బందులు వస్తే నాటి ప్రధాని వాజ్ పేయితో మాట్లాడి రూ.1650 కోట్లు సాధించాము. స్టీల్ ప్లాంట్ కు ఎప్పుడు ఇబ్బంది వచ్చినా ఆదుకుంది ఎన్డీఏ ప్రభుత్వమే. అదే సమయంలో రాష్ట్రంలో అధికారంలో ఉన్నదీ తెలుగుదేశమే.

గత పాలకులు స్టీల్ ప్లాంట్ ను నిర్లక్ష్యం చేశారు

గడిచిన ఐదేళ్లలో విశాఖ స్టీల్ ప్లాంట్ ను నిర్లక్ష్యం చేయడంతో ఇబ్బందులు ఎదురయ్యాయి. స్టీల్ ప్లాంట్ ను కాపాడతామని ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీని నిలబెట్టుకున్నాం. ఇందుకోసం విశాఖ ఎంపీ భరత్ తనవంతు కృషి చేశారు. ఢిల్లీలో అనేక సమావేశాలు నిర్వహించాము. ఒకసారి ఢిల్లీలో కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ రాత్రి పన్నెండున్నరకు సమీక్ష చేశారు. పట్టుదలతో పనిచేశాం. చిత్తశుద్దితో ముందుకెళ్లాం. ప్రధాని మోదీ సానుకూలంగా స్పందించారు.

అసాధ్యాన్ని సుసాధ్యం చేశాం

విశాఖ ప్రజల అభీష్టం, కార్మికుల శ్రమ ఫలించింది. నేను విశాఖలో పనిచేసే కార్మికులకు ఒకటే విన్నవిస్తున్నాను. ప్రజలు మనపై పెట్టుకున్న నమ్మకాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉంది. విశాఖ స్టీల్ ప్లాంట్ ను సమర్థవంతంగా నిర్వహించడంలో మేనేజ్మెంట్, కార్మికులు బాధ్యత తీసుకోవాలి. ఈ ఫ్యాక్టరీకి సమర్థవంతులైన సీఈవోను నియమిస్తాము. కావాల్సిన వనరులను సమీకరిస్తాం. స్టీల్ ప్లాంట్ కు 20 వేల ఎకరాల భూములున్నాయి. దేశంలో ఎక్కడా ఏ స్టీల్ ప్లాంట్ కు ఇంత విలువైన భూమి లేదు. అందరం కలిసి కష్టపడితే మంచి ఫలితాలు వస్తాయి. నేను కూడా శ్రద్ధ పెడతాను. ప్యాకేజీ ఇచ్చిన కేంద్రం మెచ్చుకొనేలా పనిచేద్దాము.

ఏడు నెలల్లో అద్భుత ఫలితాలు సాధించాం

ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పిన హామీలన్నీ నెరవేర్చుకుంటూ వస్తున్నాం. అమరావతికి కేంద్రం రూ. 15000 వేల కోట్లు ఈఏపీ ద్వారా ఇప్పించింది. నిలిచిపోయిన పోలవరానికి రూ. 12,157 వేల కోట్లు సాధించాము. రైల్వే జోన్ కు ప్రధాని శంకుస్థాపన చేశారు. ఏడు నెలల్లో రూ. 4 లక్షల కోట్ల పెట్టుబడులకు ఒప్పందాలు జరిగాయి. రూ. 2 లక్షల 8 వేల కోట్ల పనులకు ప్రధాని శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు చేశారు. టీసీఎస్ రాకతో యువతకు ఉద్యోగాలు వస్తాయి. గూగుల్, ఏఐ, డేటా సెంటర్ తో మంచి ఫలితాలు వస్తాయి. ఇక్కడి నుంచి సింగపూర్ కు సీ కేబుల్ వేసి అనుసంధానిస్తాము. గ్రీన్ హైడ్రోజన్ పై ఎన్టీపీసీ, జెన్ కో జాయింట్ వెంచరుగా రూ. లక్షా 80 వేల కోట్లు ఖర్చు పెట్టబోతున్నాం. మిథల్ ప్రాజెక్టుకు 14 మిలియన్ మెట్రిక్ టన్నుల ఐరన్ ఓర్ ఇచ్చేందుకు కేంద్రం ఒప్పుకుంది. ఇది నక్కపల్లి దగ్గర తొందరలోనే ప్రారంభమవుతుంది. ఒక స్టీల్ సిటీ రానుంది. నక్కపల్లిలో స్టీల్ సిటీనే కాకుండా రూ. 14,000 వేల కోట్లతో ఫార్మా సిటీ వస్తోంది. దీని వల్ల 70 వేల మందికి ఉద్యోగాలు వస్తాయి. త్వరలోనే విశాఖ-అనకాపల్లి కలిసిపోతాయి. ఓర్వకల్లులో రూ.2,786 కోట్లతో ఇండస్ట్రియల్ స్మార్ట్ సిటీ, కొప్పర్తిలో ఇండస్ట్రియల్ స్మార్ట్ సిటీకి రూ.2,137 కోట్లు మంజూరయ్యాయి. రూ.55 వేల కోట్ల వ్యయంతో జాతీయ రహదారులన్నీ రాబోయే రెండు, మూడేళ్లలో పూర్తవుతాయి. అమరావతికి 8 లైన్ల అవుటర్ రింగ్ రోడ్డు నిర్మాణానికి కేంద్రాన్ని అనుమతి కోరాను. రూ.400 కోట్లతో టూరిజం కారిడార్ రాబోతోంది. సూర్యలంక, శ్రీశైలం, రాజమహేంద్రవరం, సంగమేశ్వరాలయం వంటి ప్రాంతాల్లో టూరిజం అభివృద్ధి చేస్తాం.

గత ఐదేళ్లలో రాష్ట్రమంతటా చీకట్లే

ఈ ఏడాది రాష్ట్ర వృద్ధి రేటు 12.95 శాతానికి చేరింది. దీన్ని 15 శాతానికి తీసుకెళ్లడమే లక్ష్యంగా పెట్టుకున్నాము. అభివృద్ధి సంక్షేమానికి సమ ప్రాధాన్యత ఇస్తున్నాము. ఏడు నెలల క్రితం రాష్ట్రమంతటా చీకటే ఉంది. అన్ని వ్యవస్థలను భ్రష్టు పట్టించారు. కేంద్ర నిధులనూ దారిమళ్లించారు. మరో నాలుగైదు నెలల్లో అన్ని వ్యవస్థలను గాడిన పెడతాం. 20 లక్షల ఉద్యోగాలు ఇచ్చి తీరుతాం. ఉన్న ఉద్యోగాలు కాపాడుకుంటూనే కొత్త ఉద్యోగాలు కల్పిస్తాము. మరోసారి విశాఖ స్టీల్ ప్లాంట్ కు ప్యాకేజీ ఇచ్చిన ప్రధాని మోదీకి ధన్యవాదాలు తెలియజేస్తున్నానని ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

జిల్లాలో కేంద్ర ప్రభుత్వ పధకాలు అమలు జరుగుతున్న తీరుపై పర్యవేక్షణ కమిటీ సమావేశం

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : గుంటూరు జిల్లాలో కేంద్ర ప్రభుత్వ పధకాలు అమలు జరుగుతున్న తీరుపై జిల్లా అభివృద్ది …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *