-పారిశుద్ధ్య సిబ్బందిది మాత్రమే చెత్త నిర్వహణ బాధ్యత కాదు… ప్రజల్లోనూ చైతన్యం రావాలి
-ప్రతి ఇంటి నుంచీ చెత్త రహిత సమాజం ఆలోచన పుట్టాలి
-స్థానిక సంస్థలు సైతం చెత్త వినియోగం మీద ప్రణాళికతో ముందుకు వెళ్లాలి
-ప్రతి నెలా మూడో శనివారం ‘స్వచ్ఛ ఆంధ్ర – స్వచ్ఛ దివస్’ పక్కాగా నిర్వహించాలి
-వికసిత్ భారత్ లో పరిశుభ్రతకు అధిక ప్రాధాన్యం
-చెత్త నుంచి సంపద సృష్టి కేంద్రం పరిశీలన
-స్వచ్ఛ కార్మికులకు సత్కారం
-చెత్త రవాణా వాహనం ప్రారంభించి, స్వయంగా నడిపిన పవన్ కళ్యాణ్
-నంబూరులో స్వచ్ఛ ఆంధ్ర స్వచ్ఛ దివస్ కార్యక్రమంలో పాల్గొన్న ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్
గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త :
స్వచ్ఛత అనేది ప్రజల జీవన విధానంలో భాగం కావాలి. శుభ్రత అనేది ప్రజల ఆలోచనకు ప్రతిరూపం కావాలి. కేవలం పారిశుద్ధ్య కార్మికులకో, క్లాప్ మిత్రలకో మాత్రమే బాధ్యత ఉంది అనుకోవద్దు. పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవడం, స్వచ్ఛతను కాపాడటం అనేది మన అందరి బాధ్యత’ అని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మరియు పంచాయితీ రాజ్ గ్రామీణాభివృద్ధి మరియు పర్యావరణం అటవీ , సైన్స్ మరియు టెక్నాలజీ శాఖ మంత్రి కొణిదల పవన్ కళ్యాణ్ అన్నారు.
శనివారం పెదకాకాని మండలం, నంబూరు గ్రామంలో స్వచ్ఛ ఆంధ్ర స్వచ్ఛ దివస్ కార్యక్రమంలో రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మరియు పంచాయితీ రాజ్ గ్రామీణాభివృద్ధి మరియు పర్యావరణం అటవీ , సైన్స్ మరియు టెక్నాలజీ శాఖ మంత్రి కొణిదల పవన్ కళ్యాణ్ , రాష్ట్ర ఆహార పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ , పంచాయతీరాజ్ , గ్రామీణాభివృద్ధి శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శశిభూషణ్ కుమార్, జెడ్పి ఛైర్ పర్సన్ కత్తెర హెని క్రిస్టినా, జిల్లా కలెక్టర్ ఎస్. నాగలక్ష్మీ , పంచాయతీరాజ్ కమిషనర్ కృష్ణతేజ, పొన్నూరు శాసన సభ్యులు ధూళిపాళ్ళ నరేంద్ర కుమార్ లతో కలసి పాల్గొన్నారు. గ్రామంలోని సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ కేంద్రాన్ని పరిశీలించారు. చెత్త సేకరణ, నిర్వహణ, సంపద సృష్టి తదితర అంశాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. ప్రతి నెల మూడో శనివారం రాష్ట్ర వ్యాప్తంగా ఈ కార్యక్రమం నిర్వహించాలని గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు నిర్ణయం తీసుకున్నారు. దీనిలో భాగంగా ఉప ముఖ్యమంత్రి కొణిదల పవన్ కళ్యాణ్ నంబూరులోని చెత్త నుంచి సంపద సృష్టి కేంద్రం వద్ద మొక్కను నాటి స్వచ్ఛ ఆంధ్ర స్వచ్ఛ దివస్ కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం గ్రామ స్థాయిలో సేకరించిన చెత్త వివిధ నిర్వహణా క్రమాన్ని పరిశీలించారు. మొదట పళ్లు, కూరగాయల వ్యర్ధాల నిర్వహణను పరిశీలించారు. ప్లాస్టిక్ వ్యర్ధాల రీ సైక్లింగ్, శానిటరీ వేస్ట్ మేనేజ్మెంట్ పరికరాల పనితీరును అడిగి తెలుసుకున్నారు. వ్యర్ధాలతో వర్మి కంపోస్ట్ తయారీ విధానాన్ని పరిశీలించి స్వయంగా వర్మి కంపొస్ట్ ను పిట్ లలో చల్లారు. ఇళ్ల నుంచి చెత్త సేకరణకు ఉపయోగిస్తున్న మూడు రకాల బుట్టలను అధికారులు ఉప ముఖ్యమంత్రి గారికి చూపారు. తడి చెత్త, పొడి చెత్తతో పాటు విష పూరిత వ్యర్ధాలను వేరు చేసేందుకు ఇంటికి మూడు చెత్త బుట్టలు ఇస్తున్నట్టు తెలిపారు. చెత్త నిర్వహణలో ఉపయోగించే వివిధ రకాల యంత్ర పరికరాల పనితీరుని ఉప ముఖ్యమంత్రి కొణిదల పవన్ కళ్యాణ్ అడిగి తెలుసుకున్నారు. చెత్త నుంచి సంపద సృష్టించే కార్యక్రమం విజయవంతంగా నిర్వహిస్తున్న గ్రామాల వివరాలు, సంపద సృష్టి కేంద్రాల సహకారంతో పండించిన పళ్లు, కూరగాయల ప్రదర్శనను తిలకించారు. ఇటీవల విజయవాడ వరదల్లో అహర్నిశలు పని చేసి పారిశుద్ధ్య మెరుగుదలకు కృషి చేసిన 35 మంది స్వచ్ఛ కార్మికులను ఉప ముఖ్యమంత్రి కొణిదల పవన్ కళ్యాణ్ సత్కరించారు. ప్రతి ఒక్కరినీ పేరు పేరునా పలుకరిస్తూ, శాలువా కప్పి తన సొంత నిధులతో ఉప ముఖ్యమంత్రి నూతన వస్త్రాలు, పళ్లు బహుకరించారు. స్వచ్ఛ ఆంధ్ర స్వచ్ఛ దివస్ కార్యక్రమ ప్రారంభోత్సవంలో భాగంగా మొదటి విడతగా గ్రామ స్థాయిలో ఏళ్ల తరబడి పేరుకుపోయిన చెత్తను జిందాల్ వెస్ట్ ఎనర్జీ ప్లాంట్ కు తరలించే ట్రాక్టర్లను ఉప ముఖ్యమంత్రి కొణిదల పవన్ కళ్యాణ్ జెండా ఊపి స్వయంగా ట్రాక్టర్ నడిపి ప్రారంభించారు.
ఈ సందర్భంగా రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మరియు పంచాయితీ రాజ్ గ్రామీణాభివృద్ధి మరియు పర్యావరణం అటవీ , సైన్స్ మరియు టెక్నాలజీ శాఖ మంత్రి కొణిదల పవన్ కళ్యాణ్ విలేకరులతో మాట్లాడుతూ ‘‘2047 వికసిత్ భారత్ లో స్వచ్ఛత అనేది ప్రధానం. కరోనా సమయంలో పారిశుద్ధ్య నిర్వహణకు, స్వచ్ఛతకు ఎంతో ప్రాధాన్యం ఇచ్చాం. ఈ విషయంలో క్రమశిక్షణ అందరిలో మళ్లీ రావాలి. స్వచ్ఛత, పరిశుభ్రత అనేది మనందరి జీవితంలో ఓ భాగం అనే దాన్ని గుర్తుంచుకోవాలి. భవిష్యత్తులో చెత్త కనిపించని భారతదేశం సాకారం కావాలి.
చెత్త నుంచి సంపద సృష్టి
చెత్తను వేరు చేయడం ద్వారా, దాన్ని మళ్లీ పునర్వియోగం కోసం ఉపయోగించడం ద్వారా చెత్త నుంచి సంపదను సృష్టించవచ్చు. చెత్తే కదా.. దానిని ఏం చేస్తాం అనే భావన కాకుండా, పునర్వినియోగానికి పనికొచ్చే చెత్తను ఇంట్లోనే వేరు చేయాలి. చెత్త నుంచి సంపదను సృష్టించాలి. అలాగే చెత్త ద్వారా విద్యుత్ ప్లాంటు నిర్వహణ, వర్మీ కంపోస్టును తయారు చేసేందుకు సైతం స్థానిక పరిస్థితులను ఆధారంగా చేసుకొని స్థానిక సంస్థలు ప్రణాళిక రూపొందించుకోవాలి. ఇంట్లోనే చెత్తను వేరు చేయడం, నిర్మూలించే కార్యక్రమం జరిగినపుడే చెత్త ఉత్పత్తి తగ్గుతుంది. ప్రజల్ని నిత్యం జాగురూకుల్ని చేయడం, చైతన్యం తీసుకురావడం దీనిలో ప్రధానమైన భాగం. ఇందుకోసం అధికారులు పూర్తి స్థాయి కార్యక్రమాన్ని రూపొందించాలి. ఇటీవల జరిగిన కేబినెట్ లో స్వచ్ఛ ఆంధ్ర – స్వచ్ఛ దివన్ కార్యక్రమం ప్రతి నెలా మూడో శనివారం చేపట్టాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సూచించిన నేపథ్యంలో ఈ కార్యక్రమం నిరంతరాయంగా జరుగుతుంది. ప్రజాప్రతినిధులు, అధికారులు ఈ కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకొని నిర్వహించాలి. ప్రజల్ని సైతం ఈ కార్యక్రమంలో భాగస్వామ్యం చేయాలి.
బయో వ్యర్థాల నిర్వహణపై దృష్టి
ఆస్పత్రుల నుంచి వచ్చే బయో వ్యర్థాల నిర్వహణపై పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అధికారులతో ఒకసారి మాట్లాడి వాటి నిర్వహణపై దృష్టిపెడతాం. కచ్చితంగా బయో వ్యర్థాలను నిర్వహణ అనేది స్వచ్ఛతలో కీలకమైంది. దీనిపై స్వచ్ఛంద సంస్థల సహాయంతోపాటు, ప్రత్యేక ప్రణాళికతో వీటి నిర్వహణను చేపడతాం. వీటి వల్ల కాలుష్యం ఎక్కువ కావడంతోపాటు, మానవ ఆరోగ్యానికి మంచిది కాదనే విషయాన్ని గుర్తుంచుకోవాలి. ఆస్పత్రుల్లోనే ట్రీట్మెంట్ ప్లాంట్లు ఏర్పాటు కూడా వీటి నిర్వహణకు అవసరం. దాన్ని కూడా పరిగణనలోకి తీసుకొని బయో వ్యర్థాల నిర్వహణపై దృష్టి సారిస్తాం. క్లాప్ సిబ్బందికి వేతనాల విషయం కూడా నా దృష్టికి వచ్చింది. దీనిపై కేబినెట్ దృష్టికి తీసుకెళ్లి వారి వేతనాలు పెంచేలా ప్రయత్నం చేస్తాం. ఇటీవల విజయవాడ వరదల సమయంలో ఎంతో కష్టపడి పని చేసి, ప్రజల మన్ననలు అందుకున్న 35 మంది పారిశుద్ధ్య సిబ్బందిని సన్మానించుకోవడం సంతోషంగా ఉంది. పారిశుద్ధ్య సిబ్బంది సేవలు అమూల్యమైనవి. వారిని గౌరవించుకోవడం ప్రజలందరి బాధ్యతగా గుర్తించాలి’’ అన్నారు.
ఈ కార్యక్రమంలో జెడ్పి సిఇఓ జ్యోతిబసు , డిపిఓ సాయి కుమార్, ఎస్.ఈ ఆర్ డబ్ల్యూ ఎస్ కళ్యాణ చక్రవర్తి , పీడీ డ్వామా శంకర్ , ఆర్డిఓ కే.శ్రీనివాస రావు, జెడ్పీటీసీ గోళ్లముడి జ్యోతి , యంపిడిఓ రమావత్ శ్రీనివాస నాయక్ , తహశీల్దార్ క్రిష్ణకాంత్ , సర్పంచ్ జ్యోతి , కూటమి నాయకులు , స్థానిక పెద్దలు తదితరులు పాల్గొన్నారు.