-వైసీపీ సెంట్రల్ నియోజకవర్గ సమన్వయకర్త మల్లాది విష్ణు
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
పారిశుద్ధ్య నిర్వహణలో కూటమి ప్రభుత్వం ఘోరంగా వైఫల్యం చెందిందని వైసీపీ సెంట్రల్ నియోజకవర్గ సమన్వయకర్త, మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు విమర్శించారు. ఇంటింటికి బుట్టలను ఇచ్చి చెత్తను సేకరించాలన్నది లక్ష్యమని.. కానీ క్లాప్ ఆటోలు రాకపోవడంతో ట్రాలీలతో చెత్త సేకరణ సరిగా సాగడం లేదన్నారు. తడిచెత్త, పొడిచెత్తను వేర్వేరుగా సేకరించడం పూర్తిగా నిలిచిపోయిందన్నారు. చెత్త సేకరణ సజావుగా సాగుతున్న ఒక్క ప్రాంతాన్ని అయినా నగరంలో చూపగలరా..? అని సూటిగా ప్రశ్నించారు. ట్రాక్టర్లతో చెత్తను తరలించే సమయంలో తిరిగి ఆ చెత్తంతా రోడ్లపైనే పడుతూ.. రహదారులన్నీ కంపు కొడుతున్నాయన్నారు. ఇది ప్రభుత్వ వైఫల్యం కాదా..? అని మండిపడ్డారు. ముఖ్యంగా సర్కిల్ – 2 పరిధిలో రోజుకీ దాదాపు 200 టన్నుల చెత్త బయటకు వస్తుందని.. ఆ చెత్తను తరలించే సమయంలో పరిస్థితి మరింత దయనీయంగా ఉంటోందన్నారు. మరోవైపు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ‘స్వర్ణ ఆంధ్ర – స్వచ్ఛ ఆంధ్ర’.. గత వైసీపీ ప్రభుత్వం అమలుచేసిన క్లీన్ ఆంధ్రప్రదేశ్(క్లాప్) కార్యక్రమానికి పూర్తి కాపీ వర్షెన్ అని మల్లాది విష్ణు ఎద్దేవా చేశారు. పరిసరాల పరిశుభ్రత విషయంలో దేశవ్యాప్తంగా అనేక రాష్ట్రాలలో అధ్యయనం తర్వాత ఒక సమగ్రమైన విధానాన్ని రూపొందించి.. క్లీన్ ఆంధ్రప్రదేశ్ కార్యక్రమానికి తాము శ్రీకారం చుట్టామని గుర్తుచేశారు. చంద్రబాబు చెబుతున్న ఇంటింటి నుంచి 100% చెత్త సేకరణ., తడి చెత్త పొడి చెత్త వేరు చేయడం., తిరిగి ఉపయోగించగల వ్యర్థాలను రీసైక్లింగ్ చేయడం ఇవన్నీ గత ప్రభుత్వంలో అమలు చేసినవేనని చెప్పారు. వైసీపీ ప్రభుత్వంలో క్లాప్ కార్యక్రమం ఎంతగానో విజయవంతమైందని.. విజయవాడ నగరానికి జాతీయ స్థాయిలో అనేక అవార్డులు సైతం వచ్చినట్లు పేర్కొన్నారు. అటువంటి కార్యక్రమాన్ని గత 7 నెలలుగా కూటమి ప్రభుత్వం నీరుగార్చిందని ఆరోపించారు. చెత్త తరలించే వాహనాలు నిలిచిపోవడంతో నివాసాల మధ్య ఎక్కడిక్కడ పెద్దఎత్తున చెత్త పేరుకుపోయిందన్నారు. ముఖ్యంగా కృష్ణా, ఎన్టీఆర్ జిల్లాలలోని నగరాలు, పట్టణాలలో పరిస్థితి దయనీయంగా మారిందని.. వీధుల్లో ఎక్కడికక్కడ చెత్తకుప్పలు దర్శనమిస్తున్నాయన్నారు. ఫలితంగా గత 7 నెలల్లో పదుల సంఖ్యలో ప్రజలు డయేరియా బారిన పడి మృత్యువాత పడ్డారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికీ చాలా చోట్ల ప్రజలు జ్వరం, జలుబు, దగ్గుతో బాధపడుతూ ఆస్పత్రుల చుట్టూ తిరుగుతున్నట్లు మల్లాది విష్ణు తెలిపారు. చేతులు కాలాక ఆకులు పట్టుకున్నట్లు.. ప్రభుత్వం ఇప్పుడొచ్చి ‘స్వర్ణ ఆంధ్ర – స్వచ్ఛ ఆంధ్ర’ కబుర్లు చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా పారిశుద్ధ్యం నిర్వహణలో కూటమి ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని.. కనుననే ప్రజలందరూ అసహనంగా ఉన్నట్లు చెప్పారు. ఇప్పటికైనా ప్రభుత్వం మొక్కుబడిగా నెలకో రోజు మూడో శనివారంలా కాకుండా.. పరిసరాల పరిశుభ్రతకు శాశ్వత పరిష్కారం చూపాలని కోరారు.